నాకేమవుతుందిలే..

ABN , First Publish Date - 2020-07-12T11:29:11+05:30 IST

జిల్లాలో ‘కరోనా’ బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. లాక్‌డౌన్‌ తొలినాళ్లలో జిల్లా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య నిల్‌. కానీ వలసకూలీల రాకతో

నాకేమవుతుందిలే..

నిర్లక్ష్యానికి మూల్యం.. నిండు ప్రాణం!

జిల్లాలో పెరుగుతున్న ‘కరోనా’ బాధితులు

స్వీయ నియంత్రణ పాటించని ప్రజలు

తొలినాళ్లలో జిల్లా సేఫ్‌ జోన్‌

వలస కూలీల రాకతో మారిన పరిస్థితి

అత్యవసరమైతేనే బయటకు వెళ్లండి.

భౌతిక దూరాన్ని పాటించండి.

మాస్కులు ధరించండి.

ఇవీ కరోనా నియంత్రణలో భాగంగా అధికారుల హెచ్చరికలు

వేల మందిలో ఒకరికి తగిలే లాటరీ తనకే వస్తుందని ఆశిస్తారు. కానీ, లక్షలాది మందికి సోకే కరోనా మాత్రం నాకు రాదులే అని ప్రవర్తిస్తారు.


ఇదీ జిల్లాలో కొంత మంది ప్రజల తీరు. 

మరో రకంగా చెప్పాలంటే.. నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యానికి.. ఇప్పుడు నిండు ప్రాణాలు మూల్యంగా చెల్లించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అధికారుల ఆదేశాలు బేఖాతారు చేస్తూ కొంతమంది విచ్చలవిడిగా రోడ్లపై తిరిగేస్తున్నారు. మాస్క్‌లు ధరించకుండా.. భౌతిక దూరం పాటించకుండా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. దీంతో జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి వేగంగా విస్తరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సిక్కోలులోనే అధికంగా ‘పాజిటివ్‌’ కేసులు నమోదవుతుండడం సర్వత్రా ఆందోళన కల్గిస్తోంది. కరోనా మృతుల సంఖ్య కూడా పెరుగుతుండడం కలవరపాటుకు గురిచేస్తోంది. ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వీడి.. స్వీయ నియంత్రణ పాటించకపోతే.. మరింత ముప్పు తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. 


(పలాస): జిల్లాలో ‘కరోనా’ బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. లాక్‌డౌన్‌ తొలినాళ్లలో జిల్లా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య నిల్‌. కానీ వలసకూలీల రాకతో పరిస్థితి మారిపోయింది. కేసులు గణనీయంగా పెరిగాయి. ప్రతిరోజూ పదుల సంఖ్యలో నమోదువుతున్నాయి. మృతుల సంఖ్య పెరుగుతుండడం కలవరపరుస్తోంది. సేఫ్‌ జోన్‌గా ఉన్నా జిల్లా ఈ పరిస్థితికి రావడానికి ప్రధాన కారణం ప్రజలు నిబంధనలు పాటించకపోవడమే. జిల్లా కలెక్టర్‌ నుంచి కిందిస్థాయి అధికారి వరకూ స్వీయ నియంత్రణ పాటించండి, భౌతిక దూరాన్ని అమలు చేయండి, మాస్కులు పెట్టుకోండి, అనవసరంగా వీధుల్లో తిరగొద్దని చెప్పినా ప్రజలు పెడచెవిన పెట్టారు. నాకేమవుతుందిలే.. నా వరకూ వైరస్‌ సోకదనే నిర్లక్ష్యంతో కొందరు విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. దీంతో ప్రస్తుతం జిల్లాలో అన్నీ మండలాల్లో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రజల నిర్లక్ష్యానికి మూల్యంగా ఎన్నో ప్రాణాలు బలవుతున్నాయి.


పలాసలో మొదలైన మరణాలు పొరుగు మండలాలకు కూడా వ్యాప్తి చెందుతున్నాయి. చుట్టుపక్కల మండలాల్లో నమోదవుతున్న కేసులకు పలాస మూలాలే కనిపిస్తున్నాయి.  వేడుకలు నిర్వహించవద్దని, దీనికి ఎటువంటి అనుమతులు ఇచ్చేది లేదని అధికారులు ఒకవైపు ప్రకటిస్తున్నారు. కానీ చాలామంది వేడుకలు నిర్వహించి సామాజిక వ్యాప్తికి కారణమవుతున్నారు. ఈ ప్రాంతంలో కరోనా కేసులు పెరగడానికి రెండు వేడుకలే కారణమని అధికారులు ప్రాథమికంగా గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు. 


ప్రజాప్రతినిధులు, అధికారులనూ వదలని వైరస్‌

 తాజాగా ప్రజాప్రతినిధులు, వైద్యులు, పోలీసులు, రెవెన్యూ ఉద్యోగుల్లో వైరస్‌ లక్షణాలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. కలెక్టర్‌ నివాస్‌ ప్రత్యేక శ్రద్ధతో జిల్లా అంతా పర్యటిస్తూ వాహనంలో నుంచే టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. జనతా కర్ఫ్యూ నిర్వహించడంతో జిల్లాలో కరోనా కేసులు పూర్తిగా నమోదు కాలేదు. అనంతరం లాక్‌డౌన్‌తో అంతా సేఫ్‌ అనుకున్న తరుణంలో పాతపట్నంలో తొలి కరోనా కేసు నమోదైంది.


ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవడంలో సఫలీకృతులయ్యారు. లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపులో భాగంగా వలసకూలీలకు అనుమతివ్వడంతో పరిస్థితి మారిపోయింది. చాలామంది స్వస్థలాలకు వచ్చినా అధికారులకు కళ్లుగప్పి ఇళ్లకు చేరుకున్నారు. ఇటువంటి వారిలో వైరస్‌ లక్షణాలు కనిపించడంతో పాటు వ్యాప్తి చెందాయి. ఇటువంటి వారిని గుర్తించి వారితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించడం కష్టతరంగా మారింది. జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఆయాసం వంటి లక్షణాలు ఉంటే తక్షణం సమీపంలోని ఆరోగ్య కార్యకర్త, రెవెన్యూ, అంగన్‌వాడీ, సచివాలయం ఉద్యోగులు, వార్డు, గ్రామ వలంటీర్లలో ఎవరికైనా ఒకరికి సమాచారం ఇస్తే బాగుంటుంది.


వైరస్‌  వ్యాప్తి చెందకుండా అటువంటి వారికి ఐసోలేషన్‌లో పెట్టి కట్టడి చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ వైరస్‌ బాధితుడు వెలుగులోకి వచ్చేవరకూ వారితో సన్నిహితంగా మెలిగిన వారు అప్రమత్తం కావడం లేదు. అలాగే పాజిటివ్‌ లక్షణాలు వచ్చేవారు.. తమపై సమాజం చిన్నచూపు చూస్తుందనే అభిప్రాయాన్ని తొలుత విడనాడాలి. సామాజిక బాధ్యతగా గుర్తిస్తే కరోనా అరికట్టడం సులభరతరం అవుతుంది. ప్రజలు కూడా వ్యాధి రాకుండా ప్రభుత్వం ప్రకటించిన నిబంధనలు పాటించాల్సి ఉంది. మరిన్ని మరణాలు జరగకముందే మేలుకుంటే మంచిదని వైద్య ఆరోగ్యశాఖ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. 

Updated Date - 2020-07-12T11:29:11+05:30 IST