ఇసుక తోడేస్తున్నారు

ABN , First Publish Date - 2022-01-08T07:15:46+05:30 IST

ప్రభుత్వ అవసరాల పేరుతో ఇసుక అక్రమంగా తరలిపోతోంది. మైనింగ్‌, రెవెన్యూ అధికారులతో మిలాఖతైన దళారులు నిత్యం వందలాది ట్రాక్టర్లలో ఇసుకను దారిమళ్లిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండగా, సామాన్యులు ఆన్‌లైన్‌లో బుక్‌చేసి 20 రోజులైనా ఇసుక మాత్రం దొరకడంలేదు.

ఇసుక తోడేస్తున్నారు
యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలం బిక్కేరు వాగునుంచి ఇసుకను తరలిస్తున్న నిర్వాహకులు

  • ప్రభుత్వ అవసరాలపేరుతో పక్కదారి
  • మైనింగ్‌ అధికారులు, దళారులు మిలాఖత్‌
  • నిత్యం వందలాది ట్రాక్టర్లలో తరలింపు 
  • సామాన్యులకు 20 రోజులైనా దిక్కులేదు


ప్రభుత్వ అవసరాల పేరుతో ఇసుక అక్రమంగా తరలిపోతోంది. మైనింగ్‌, రెవెన్యూ అధికారులతో మిలాఖతైన దళారులు నిత్యం వందలాది ట్రాక్టర్లలో ఇసుకను దారిమళ్లిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండగా, సామాన్యులు ఆన్‌లైన్‌లో బుక్‌చేసి 20 రోజులైనా ఇసుక మాత్రం దొరకడంలేదు.


నల్లగొండ, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/ యాదాద్రి (ఆంధ్రజ్యోతి)/ ఆత్మకూర్‌(ఎస్‌): ఉమ్మడి జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా జోరుగా సాగుతోంది. ఫలితంగా దళారులు కోట్లకు పడగలెత్తుతుండగా, పేద, మధ్య తరగతి వర్గాలు ఇసుక కొనుగోలుచేసే పరిస్థితి లేదు. ఇష్టారీతిన తవ్వకాలతో ఇసుక రీచ్‌ల పరిసర గ్రామాల్లో భూగర్భజలాలు పడిపోతున్నాయి. నల్లగొండ జిల్లాలో సాండ్‌ ట్యాక్స్‌ విధానాన్ని అమలు చేస్తుండగా, మీ-సేవ లేదా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే ప్రభుత్వ ధరకే అందరికీ ఇసుక దొరికేది. ఆ తరువాత ప్రభుత్వ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఇంజనీరింగ్‌శాఖల నుంచి ఒత్తిడి రావడంతో వారికి తక్కువ ధరకే వెంటనే కేటాయించేలా ఓ వ్యవస్థను అప్పటి కలెక్టర్‌ ఉప్పల్‌, ఎస్పీ రంగనాథ్‌ ఏర్పాటు చేశారు. దీంతో ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. తాజాగా, ఈ వ్యవస్థపై పర్యవేక్షణ కొరవడటంతో మైనింగ్‌శాఖ కిందిస్థాయి సిబ్బంది చేతివాటం ప్రారంభించారు. ప్రభుత్వ అవసరాల పేరుతో ఐడీ సృష్టించి నిత్యం వందలాది ట్రాక్టర్ల ఇసుకను బహిరంగ మార్కెట్‌కు అక్రమంగా తరలిస్తున్నారు.


ప్రభుత్వ అవసరాలంటూ..

సామాన్యులు ట్రాక్టర్‌ ఇసుక కోసం రూ.2420 చెల్లిస్తే 24గంటలు మొదలు గరిష్ఠంగా వారం రోజుల్లో ఇంటి వద్దకే ఇసుక రావాల్సి ఉండగా, కొంత కాలంగా నల్లగొండ జిల్లాలో ఆ పరిస్థితి లేదు. బుక్‌ చేసి ఎదురుచూసినా ఇసుక రాకపోవడంతో స్లాబ్‌ వంటి అత్యవసర పనులకు బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్నారు. దళారులకు రూ.2700 పైగా చెల్లిస్తే గంటల వ్యవధిలో కావాల్సినన్ని ట్రాక్టర్ల ఇసుకను ఇంటిముందు పోస్తున్నారు. ఇదేంటని ఆరా తీస్తే ప్రభుత్వ అవసరాల పేరుతో పెద్ద మొత్తంలో దళారులు ఇసుకను మళ్లిస్తున్నట్టు తెలిసింది. మునిసిపాలిటీ, ప్రభుత్వ ఇతర అభివృద్ధి పనులకు ట్రాక్టర్‌ ఇసుకకు రూ.2100 మాత్రమే ధర ఖరారు చేశారు. ఏ పనికి ఎంత ఇసుక అనే దానిపై అజమాయిషీ లేకపోవడం అక్రమార్కులకు కలిసొచ్చింది. జిల్లాపరిషత్‌ కేంద్రంగా పనిచేసే మైనింగ్‌ అధికారులు ఇసుక లోడ్లు రిలీజ్‌ చేస్తున్నారు. ఒక్కో ట్రాక్టరుకు రూ.2100 కాగా, దళారుల నుంచి ప్రతీ ట్రాక్టర్‌కు రూ.300 వరకు వసూలు చేసి వారికే ఆన్‌లైన్‌లో మెసేజ్‌లు పంపుతున్నారు. ఒక్క ట్రాక్టర్‌కు రూ.300 చొప్పున రోజుకు సుమారు 100 ట్రాక్టర్లను దళారులకు మళ్లిస్తున్నట్టు తెలిసింది. ఆ సిబ్బంది వచ్చిన గంటలోనే ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పంపడం, డబ్బు వసూలు చేసుకోవడం చకచకా సాగిపోతున్నాయి. ఒక్క నల్లగొండ పట్టణంలోనే సుమారు 10మంది దళారులు ఇలా ఇసుకను దారిమళ్లించి బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. వారికి ఒక్కో ట్రాక్టర్‌పై రూ.300 వరకు మిగులుతుండగా, సామాన్యుడి జేబుకు చిల్లుపడుతోంది.


యాదాద్రి జిల్లాలో

యాదాద్రి జిల్లాలోని బిక్కేరు వాగుతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల్లోని వాగుల నుంచి ఇసుక అక్రమంగా తరలుతోంది. అడ్డగూడూరు మండలంలోని చిర్రగూడూరు, జానకీపురం, డీరేపాక, లక్ష్మీదేవికాల్వ గ్రామాల పరిధిలోని బిక్కేరు వాగులో ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఇసుకను తీసుకెళ్లేందుకు రెవెన్యూ అధికారులు అనుమతించారు. దీంతో నిత్యం ఈ వాగు నుంచి లారీల్లో ఇసుక తరలుతోంది. మానాయకుంట, గట్టుసింగారం, వెల్దేవి, ఆదీంపేట, కొండంపేట, కోటమర్తి, ధర్మారం, తదితర గ్రామాల్లో ఎండ్లబండ్లు, ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతం వలిగొండ, గోకారం, వేములకొండ, దుప్పల్లి, ప్రొద్దటూరు గ్రామాల్లో ఇసుక తవ్వుతున్నారు. రామన్నపేట మండలం లక్ష్మాపూర్‌, శోభనాద్రి పల్లివాడ, తుమ్మలగూడెం, తదితర గ్రామాల్లోనూ ఇసుక తోడుతున్నారు. స్థానికంగా నిర్మిస్తున్న భవనాలు, కాల్వలు, ఇతర నిర్మాణాల కోసం అధికారులు బుధవారం, గురువారం ఉదయం వేళల్లో మాత్రమే అనుమతి ఇస్తున్నారు. అయితే ఈ ప్రాంతాల నుంచి నిత్యం ఉదయం, రాత్రివేళల్లో యథేచ్చగా ఇసుక అక్రమంగా తరలుతోంది. బండ్లు, ట్రాక్టర్లతో ఇసుకను ఒక ప్రాంతంలో నిల్వచేసి ఆ తరువాత హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాలకు తరలిస్తున్నారు. కాగా, బస్వాపూర్‌, కాళేశ్వరం ప్రాజెక్టుల కోసం 10లారీల ఇసుక తరలించి, మరో 30లారీలను హైదరాబాద్‌కు తరలించి విక్రయిస్తున్నారని గ్రామస్థులు ఇటీవల ఆందోళనలు చేశారు. కాంట్రాక్టర్లకు ఇచ్చిన అనుమతి కంటే ఎక్కువ మొత్తంలో ఇసుక తరలిస్తున్నారని, దీంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని అడ్డగూడూరు మండలంలోని జానకీపురం, చిర్రగూడురు, లక్ష్మీదేవీపల్లి, డీరేపాక  గ్రామస్థులు పలుమార్లు కలెక్టరేట్‌ ఎదుట ధర్నాలు సైతం చేశారు. ఇసుక లారీలను అడ్డుకున్న గ్రామస్థులపై పోలీసులు, అధికారులు కేసు నమోదు చేశారు గానీ తరలింపును మాత్రం అడ్డుకోలేదు.



సూర్యాపేట జిల్లాలో

సూర్యాపేట జిల్లాలో మూసీ పరివాహక ప్రాంతాలు, పలు మండలాల్లోని వాగుల నుంచి ఇసుక అక్రమంగా తరలుతోంది. ఆత్మకూర్‌(ఎస్‌) మండల పరిధిలోని ముక్కుడుదేవులపల్లి వాగు నుంచి నిత్యం ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. నూతనకల్‌ మండలం గుండ్లసింగారం గ్రామంలోని వ్యవసాయ భూముల మీదుగా ఇసుకను తరలిస్తున్నారు. ఎవరైనా అధికారులకు సమచారం ఇచ్చినా స్పందించడం లేదు. అంతేగాక మద్యం సేవించి ఉన్న, ఎలాంటి లైసెన్సులు లేని మైనర్లతో ట్రాక్టర్ల ద్వారా రాత్రి వేళల్లో ఇసుక తరలిస్తున్నారు. నూతనకల్‌కు చెందిన ఓ మండలస్థాయి ప్రజాప్రతినిధికి వాగు వద్ద పట్టా భూమి ఉందన్న సాకుతో అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు సమాచారం ఇస్తే తమ పరిధి కాదంటే, తమ పరిధికాదని తప్పించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.


జడ్పీ నుంచే దారిమళ్లుతోంది : వంటెపాక జగన్‌, సర్పంచ్‌, కల్వలపల్లి, మం.మునుగోడు, నల్లగొండ జిల్లా

నేను మునుగోడు మండలం ఒంటెపాక సర్పంచ్‌ను. నల్లగొండ పట్టణంలో ఇసుక అవసరానికి మీ-సేవ ద్వారా బుక్‌ చేసి 20 రోజులైనా రాలేదు. స్లాబ్‌ వేయాల్సి ఉండటంతో దళారుల వద్ద ఇసుక కొనుగోలు చేశా. ట్రాక్టర్‌కు రూ.2700 వసూలు చేశారు. గంటల్లో ఇసుక ఇంటి ముందుకు వచ్చింది. సెల్‌కు వచ్చిన మెసేజ్‌ చూస్తే అందులో మునిసిపాలిటీ, ప్రభుత్వ అవసరాల పేరుతో ఓ నిర్మాణ సంస్థకు సరఫరా చేస్తున్నట్టు ఉంది. ఇదేంటని ఏడీ మైనింగ్‌ కార్యాలయానికి వెళ్లి అడిగితే జడ్పీకి సంబంధించినదని చెప్పారు. అక్కడి నుంచే పెద్ద మొత్తంలో ప్రభుత్వ అవసరాల పేరుతో దళారులు, అధికారులు కలిసి ఇసుక దారిమళ్లిస్తున్నారు.


ఆ అవకాశం లేదనలేను : వెంకటేశ్వర్లు, మైనింగ్‌ ఏడీ, నల్లగొండ

మీ-సేవ, ఆన్‌లైన్‌లో ప్రైవేట్‌ వ్యక్తులు బుక్‌ చేస్తే వారికి సకాలంలో ఇసుక రావాలనే నిబంధన ఏదీ లేదు. ఎందుకంటే ఇసుక రీచ్‌లో ఇబ్బందులు, కస్టమర్లకు మెసేజ్‌ వచ్చిన తరువాత నిర్ణీత సమయంలో చూసుకోకపోవడంతో ఆలస్యమవుతోంది. ప్రభుత్వ అవసరాలకు అంటూ ఇసుక బయట దొరుకుతోంది అంటే కాదనలేను. దీనిపై పూర్తి వివరాలు ఇస్తే విచారించి చర్యలు తీసుకుంటా.

Updated Date - 2022-01-08T07:15:46+05:30 IST