Advertisement
Advertisement
Abn logo
Advertisement

పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి

ఆదిలాబాద్‌టౌన్‌, అక్టోబరు 21: పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. గురువారం పోలీసు అమరవీరుల స్మారక వారోత్సవాల్లో భాగంగా పోలీసు హెడ్‌క్వార్టర్‌లో ఏర్పాటు చేసిన ముగింపు వారోత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌, ఎస్పీ రాజేశ్‌చంద్రలు అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇందులో భాగంగా సాయుధ పోలీసు బలగాలు స్మృతి పరేడ్‌ నిర్వహించి ఈ యేడాది విధి నిర్వహణలో దేశవ్యాప్తంగా వివిధ సంఘటనల్లో ప్రజారక్షణలో సేవలందిస్తూ, ఉగ్రవాదులు, మావోయిస్టులతో పోరాడి ప్రాణత్యాగం చేసిన 377 మంది నామస్మరణతో కూడిన పుస్తక్‌టోలిని సమ్మాన పూర్వకంగా ఎస్పీకి అందజేశారు. ఈ మేరకు పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన జిల్లా కలెక్టర్‌, ఎస్పీలు ప్రజా ప్రతినిధులు, పోలీసు అధికారులు అమరవీరుల కుటుంబీకులతో  కలిసి స్మారకస్థూపంకు పుష్పాలతో ఘన నివాళులర్పించారు. అనంతరం అమరవీరుల శాంతికి ప్రతికగా కాగడాలు వెలిగించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అమరులైన ప్రతి కుటుంబాలను ఆదుకోవడానికి, వారి సంక్షేమానికి అధిక ప్రాధాన్యం కల్పిస్తామని తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ అక్టోబరు 21 జాతీయ పోలీసు చరిత్రలో ఎర్రని అక్షరాలతో లిఖించబడిన రోజన్నారు.  జిల్లా భద్రత, ప్రజల రక్షణ కోసం అమరులైన పోలీసులకు సెల్యూట్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా కలెక్టర్‌తో కలిసి అమరవీరుల కుటుంబ సభ్యులను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు పోలీసు హెడ్‌క్వార్టర్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీని కలెక్టర్‌, ఎస్పీలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో యువకులు, విద్యార్థులు, ఎన్‌సీసీ క్యాడెట్లు, టీఎస్‌ఎస్పీ పోలీసు అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు శ్రీనివాస్‌రావు, సమైజాన్‌రావు, వినోద్‌కుమార్‌, టీఎస్‌ఎస్పీ కమాండెంట్‌ వేణుగోపాల్‌, డీఈవో ప్రణీత, డీఎస్పీలు వెంకటేశ్వర్‌రావు, విజయ్‌కుమార్‌, పట్టణ సీఐలు పోతారాం శ్రీనివాస్‌, రామకృష్ణ, మల్లేష్‌, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

ఉట్నూర్‌: పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీసుల సేవలను కొనియాడడం బాగుందని ఏఎస్పీ హర్షవర్దన్‌ శ్రీవాత్సవ అన్నారు. గురువారం స్థానిక పోలీసు స్టేషన్‌ ఆవరణలో ఉన్న పీపుల్స్‌వార్‌ నక్సలైట్ల కాల్పుల్లో చనిపోయిన పోలీసులు కోటియానాయక్‌, తాహేర్‌ హైమద్‌, గోవర్ధన్‌ల శిలాఫలకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం  స్వీకరించి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తించాలని, సంఘ విద్రోహుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో సీఐ సైదారావు, ఎస్సై సుబ్బారావు, ఏఎస్‌ఐలు ముకుంద్‌రావు, దిలీప్‌, ప్రొహిబిషనరి ఎస్సై రాజమణి పాల్గొన్నారు.

Advertisement
Advertisement