లీడర్స్‌.. రియల్టర్స్‌..

ABN , First Publish Date - 2022-05-23T12:05:20+05:30 IST

అధికార పార్టీకి చెందిన ప్రముఖ నేతలు ట్రెండ్‌ మార్చారు. అధికారం మాటున కాంట్రాక్ట్‌ పనులు, ఇతర పనులు చేసుకునే వారు... అయితే జగన్‌ సర్కార్‌లో కాంట్రాక్ట్‌ పనులు చేస్తే బిల్లులు రావనుకున్నారేమో.. ఆ పనులపై ఆసక్తి కనబరచడం లేదు. కేవలం

లీడర్స్‌.. రియల్టర్స్‌..
కడప శివారుల్లో వెలసిన లేఔట్లు

స్థిరాస్తి వ్యాపారంలోకి అధికార పార్టీ నేతలు

కడప, ప్రొద్దుటూరు, బద్వేలులో వెంచర్లు

కొన్నిచోట్ల నిబంధనలకు 

విరుద్ధంగా వ్యాపారం

కడప, మే 22 (ఆంధ్రజ్యోతి): అధికార పార్టీకి చెందిన ప్రముఖ నేతలు ట్రెండ్‌ మార్చారు. అధికారం మాటున కాంట్రాక్ట్‌ పనులు, ఇతర పనులు చేసుకునే వారు... అయితే జగన్‌ సర్కార్‌లో కాంట్రాక్ట్‌ పనులు చేస్తే బిల్లులు రావనుకున్నారేమో.. ఆ పనులపై ఆసక్తి కనబరచడం లేదు. కేవలం కొందరు మాత్రమే ఆ పనుల్లో పర్సంటేజీలు తీసుకొని వదిలేస్తున్నారు. ఇప్పుడంతా లీడర్స్‌ రియల్టర్లుగా మారారు. నివాస స్థలాలకు ఉన్న డిమాండ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు ఎక్కడ చూసినా పెద్ద పెద్ద వెంచర్లు వేస్తున్నారు. చిన్న చితకా నేతలు వెంచర్లు వేస్తున్నప్పటికీ... ముఖ్య నేతలు భారీగా వెంచర్లు వేస్తుండడం విశేషం. ఇందులో కొన్ని వెంచర్లు నిబంధనలకు విరుద్ధంగా వేస్తున్నప్పటికీ ప్రముఖులు కావడంతో పట్టణ ప్రణాళికా విభాగాలు పట్టించుకోవడం లేదనే విమర్శ ఉంది. కడప, ప్రొద్దుటూరు, బద్వేలు, పోరుమామిళ్లలో కొందరు అధికారపార్టీ ముఖ్య నేతలే జోరుగా రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. ముఖ్య నేతల పేరిట నేరుగా క్రయ విక్రయాలు లేకుండా కుటుంబ సభ్యులు, బినామీల పేరిట రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం సాగిస్తున్నారు. కనీసం రూ.300 కోట్ల పైగా లావాదీవీలు జరిగినట్లు రియల్టర్ల వర్గాలు చెబుతున్నాయి. 


కడపలో ముఖ్య నేతల హవా

కడప నగరంలో అధికారాన్ని అనుభవిస్తున్న ముఖ్య నేతలు రియల్టర్ల అవతారమెత్తారు. కొన్నింటిలో భాగస్వామ్యంతో వెంచర్లు వేయగా... మరి కొన్నింటిలో సపరేట్‌ సపరేట్‌గా కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో కలిపి వెంచర్లు వేసినట్లు చెబుతారు. కడప నగరం చుట్టూ రింగ్‌రోడ్డుతో పాటు కడప-రాయచోటి ప్రధాన రహదారి, రాజంపేట రహదారుల పక్కన పెద్దపెద్ద వెంచర్లు వేసి రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం సాగిస్తున్నారు.  


ఆ ముఖ్య నేత నుంచే..

కడపకు చెందిన ఓ ముఖ్యనేత కుటుంబీకులు వ్యాపార రంగంలో ఉన్నారు. ఇప్పుడు వారికి స్థిరాస్థి వ్యాపారం తోడై నగరంలో వెంచర్లు వేస్తున్నారు. వినాయకనగర్‌లో సుమారు 15 ఎకరాల్లో ఓ వెంచర్‌, చలమారె డ్డిపల్లె వద్ద 20 ఎకరాల్లో భాగస్వాములతో కలిపి కొన్ని వెంచర్లు, ఏ1 నగర్‌లో సుమారు 8 ఎకరాలు, పాత అమర్‌ హాస్పిటల్‌ సమీపంలో మరో 8 ఎకరాల్లో లేఔట్లు వేసినట్లు చెబుతారు. ఈ ప్రాంతాన్ని బట్టి సెంటు 2 నుంచి 5 లక్షల మధ్య ధర పలుకుతున్నట్లు చెబుతున్నారు. సుమారు రూ.100 కోట్లకు పైగానే వ్యాపారం జరిగినట్లు చెప్పుకొస్తున్నారు.


మరో ముఖ్యనేత కూడా.. 

మరో ముఖ్యనేత కూడా కుటుంబీకులు, సన్నిహితులతో కలిపి పెద్ద ఎత్తున లేఔట్లు వేస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు. ఆయన కీలకంగా ఉండడంతో లేఔట్లలో ఆయన మాటే వేదంగా మారినట్లు చెబుతారు. ఇర్కాన్‌ సర్కిల్‌ టూ రాజంపేట బైపా్‌సలో సుమారు 30 ఎకరాల్లో వేసిన ఓ లేఔట్‌లో భాగస్వామి అని చెబుతారు. చలమారెడ్డిపల్లె సమీపంలో 8 ఎకరాలు, మాసాపేట సర్కిల్‌ నుంచి చలమారెడ్డిపల్లె పోయే దారిలో మరి కొన్ని వెంచర్లలో భాగస్వామిగా ఉన్నట్లు చెప్పుకొస్తారు. ఈయనతో పాటు కడపలో ఓ పదవిలో నెంబర్‌ 2 అని చెప్పుకుంటున్న ఆయన కూడా రిమ్స్‌, ఎర్రముక్కపల్లి, అంగడివీధి, ప్రొఫెసర్‌ కాలనీల్లో వెంచర్లు వేశారు. అధికార పార్టీ అయ్యి స్థిరాస్థి వ్యాపారం చేయడం తప్పుకాదన్నప్పటికీ కడప ముఖ్య నేతలంతా రియల్టర్‌ అవతారమెత్తడమే విశేషం. ఇక కడ పలో ఉంటూ సమీపంలో ఓ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ నేత కడప రాయచోటి రోడ్డులోని సుమారు 40 ఎకరాల్లో లేఔట్‌ వేశారు. ఇప్పటికే ఆయన నగర శివారు పరిధిలో ఓ టౌన్‌షి్‌ప ఏర్పాటు చేశారు. 


ప్రొద్దుటూరులో ఇదే తీరు

ప్రొద్దుటూరు పట్టణం చుట్టూ విస్తరిస్తోంది. పట్టణంలోని కొన్ని ప్రాంతాలు పంచాయతీ పరిధిలో ఉన్నాయి. ఇక్కడ పట్టణాన్ని శాశిస్తున్న ముఖ్య నేతలు రియల్‌ఎస్టేట్‌ వ్యాపారంలో బిజీగా ఉన్నట్లు చెబుతారు. కొత్తపల్లి, నంగనూరుపల్లి, చౌటుపల్లి, గోపవరం, తాళ్లమాపురం, పెద్దిశెట్టిపల్లి మరి కొన్నిప్రాంతాల్లో సుమారు 200 ఎకరాల్లో వెంచర్లు వేసినట్లు చెబుతున్నారు. ఒక వెంచర్‌ 10 నుంచి 20 ఎకరాల్లో వేసినట్లు చెబుతారు. ఇక బద్వేలు, పోరుమామిళ్ల పట్టణాల్లో అధికార పార్టీ ముఖ్య నేతల అనుచరులు ఎకరాలు ఎకరాలలో లేఔట్లు వేశారు. 


లేఔట్ల మాటున నిబంధనలకు నీళ్లు 

జిల్లాల్లో లీడర్స్‌ వేసిన చాలావరకు లేఔట్లు నిబంధనలకు విరుద్ధంగా వెలిసినట్లు చె బుతున్నారు. లేఔట్‌ పరిధిలో ఖాళీగా ఉన్న ఖాళీ స్థలాలు, వాగులు, వంకలను కూడా ఆక్రమిస్తున్నట్లు చెబుతారు. కడపలో ఇదే పరిస్థితి ఉన్నట్లు చెబుతారు. ప్రొద్దుటూరు, పోరుమామళ్ల ప్రాంతాల్లో చాలావరకు లేఔట్లు నిబంధనలకు విరుద్ధంగా వెలిశాయని చెబుతారు. లీడర్స్‌కు కావాల్సిన బిజనెస్‌ జరుగుతోంది. వారు పెట్టిన పెట్టుబడికి లాభం పొందుతున్నారు. ప్రభుత్వ ఖజానాకు మాత్రం గండిపడుతోంది. తెలియకుండా కొన్న వారు ఇబ్బందులు పడుతున్నారు. లేఔట్లలో ప్లాట్లు కొనుగోలు చేసే వారు  అనుమతులు ఉన్నాయో లేవో చెక్‌ చేసుకొని కొనుగోలు చేయాలని కార్పొరేషన్‌ అధికారి నాగేంద్ర సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా లేఔట్లు వేస్తే చర్యలు తప్పవన్నారు. 

Updated Date - 2022-05-23T12:05:20+05:30 IST