ఎన్నికల్లో జోనల్‌ అధికారుల పాత్ర కీలకం

ABN , First Publish Date - 2021-02-26T04:17:01+05:30 IST

మునిసిపల్‌ ఎన్నికల్లో జోనల్‌ అధికారుల పాత్ర కీలకమని కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌ సమా వేశ మందిరంలో జోనల్‌ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఎన్నికల్లో జోనల్‌ అధికారుల పాత్ర కీలకం
మాట్లాడుతున్న కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌

కలెక్టరేట్‌,ఫిబ్రవరి 25: మునిసిపల్‌ ఎన్నికల్లో జోనల్‌ అధికారుల పాత్ర కీలకమని కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌  తెలిపారు. గురువారం కలెక్టరేట్‌ సమా వేశ మందిరంలో  జోనల్‌ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ బాధ్యతతో విధులు నిర్వ హించాల్సి ఉందన్నారు. జోనల్‌ అధికారుల వ్యవహార సామర్థ్యంపైనే ఎన్నికల ప్రక్రియ ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఆర్‌వోలు, పీవోలు ఇతర ఎన్నికల అధికారులు, సిబ్బందిని సమన్వయపరచాలన్నారు. ఎన్నికల ముందు రోజు సిబ్బంది హాజరు,  అవసరమైన సామగ్రి అందజేత తదితర అంశాలను  పరి శీలించాల్సి ఉంటుందన్నారు. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ను  కనీసం రెండుసార్లెనా పరిశీలించాలని సూచించారు.  పోలింగ్‌ స్టేషన్లను ఎంత ఎక్కువగా సందర్శిస్తే అంతా సజావుగా ఎన్నికలు జరుగుతాయని చెప్పారు.  ఓటింగ్‌ ఎక్కువగా జరిగేలా చూడడం, నిర్ణీత సమయానికి పోలింగ్‌ ప్రారంభించడంతో పాటు సకాలంలో ముగిసిలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని సక్రమంగాఅందించాలన్నారు. అనంతరం జేసీ మహేష్‌కుమార్‌ మాట్లాడుతూ... మునిసిపల్‌ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరుగుతాయని, ఈ నేపథ్యంలో  ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని తెలిపారు. దీనిని తట్టుకునే విఽధం గా జోనల్‌ అధికారులు ముందే సంసిద్ధులు కావాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటించి, పోలింగ్‌ కేంద్రాల్లో లోటు పాట్లును సరి చేయాలన్నారు. పంచాయతీ ఎన్నికలకు భిన్నంగా జరిగే మునిసిపల్‌ ఎన్నికల్లో మరింత అప్రమత్తంగా విధులు నిర్వహించాలని కోరారు. జోనల్‌ అధికారుల బాధ్యతలు, నిర్వహించాల్సిన విధులను ట్రైనింగ్‌ నోడల్‌ అధికారి ఎస్‌.అప్పల నాయుడు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు.  జేసీలు కిషోర్‌ కుమార్‌, జె.వెంకటరావు, నగర కమిషనర్‌ వర్మ తదితరులు ఉన్నారు. 

మరణించిన అభ్యర్థుల స్థానంలో కొత్తగా నామినేషన్లు 

 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి మునిసిపల్‌ ఎన్నికలకు నామి నేషన్లు వేసి మరణించిన అభ్యర్థుల స్థానంలో  కొత్తవారికి అవకాశం ఇస్తున్నట్లు కలెక్టర్‌  హరి జవహర్‌లాల్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇలాంటి వార్డుల్లో నామినేషన్లు వేసేందుకు ఈనెల 28వరకూ గడువు ఇస్తున్నట్లు తెలిపారు. మార్చి మొదటిన నామినేషన్ల పరిశీలన, 2, 3 తేదీల్లో ఉపసంహరణ చేసుకోవచ్చని వివ రించారు. మునిసిపల్‌ ఎన్నికల నిర్వహణపై మార్చి 1న విశాఖలో ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి,  జిల్లాల కలెక్టర్లు , ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సమీక్ష సమావేశం నిర్వహిస్తారని చెప్పారు.  

    

Updated Date - 2021-02-26T04:17:01+05:30 IST