కాలు‘వే’ ఏది?

ABN , First Publish Date - 2022-08-01T05:53:50+05:30 IST

జిల్లాలో రిజర్వాయర్ల నుంచి సాగునీరు విడుదల చేస్తున్న అధికారులు కాలువల పరిస్థితిని పట్టించుకోవడం లేదు. గత మూడేళ్లుగా నిర్వహణకు నోచని కాలువలు అధ్వానంగా మారాయి.

కాలు‘వే’ ఏది?
వీఆర్‌ఎస్‌ నుంచి సాగునీటిని విడుదల చేస్తున్న డిప్యూటీ సీఎం

నీరు విడుదల సరే..  కాలువల పరిస్థితి పట్టదా?

  పిచ్చిమొక్కలతో నిండిన వైనం   

నిరాశలో రైతులు

 జియ్యమ్మవలస, జూలై 31 :  జిల్లాలో రిజర్వాయర్ల నుంచి సాగునీరు విడుదల చేస్తున్న అధికారులు కాలువల పరిస్థితిని పట్టించుకోవడం లేదు. గత మూడేళ్లుగా నిర్వహణకు నోచని కాలువలు అధ్వానంగా మారాయి. పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. శివారుకు సాగునీరు అందడగం ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో రైతులు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా ఆదివారం ఒట్టిగెడ్డ రిజర్వాయర్‌ నుంచి  కురుపాం  ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి సాగునీటిని విడుదల చేశారు. అయితే రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు.  రిజర్వాయర్‌ ఆధునికీకరణ పనుల్లో భాగంగా చేసిన తప్పిదమే ఇందుకు కారణం. రెండేళ్ల కిందట జైకా మంజూరు చేసిన రూ. 44.84 కోట్లతో పనులు ప్రారంభించారు. కాగా కుడి, ఎడమ ప్రధాన కాలువలు లోతు చేయడం, మిగిలిన పిల్లకాలువలు ఎత్తులో ఉండటం వల్ల ప్రధాన కాలువ గుండానే ఎక్కువ నీరు వృఽథాగా పోయే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో కొందరు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు నీటి పారుదలశాఖ ఏఈ జీవీ రఘును నిలదీశారు.  పిల్లకాలువలకు నీరందే విధంగా గ్రావెల్‌ ఫిల్‌ చేస్తామని ఆయన సమాధానమిచ్చారు.  అయితే వర్షాల కారణంగా  ఆ పని జరగలేదు.  దీంతో ప్రధాన కాలువ లైనింగ్‌కు నాలుగు అడుగుల ఎత్తులో  పిల్ల కాలువలు ఉన్నాయి. వాటిల్లో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగిపోయాయి. దీంతో శివారుకు సాగునీరు అందడం ప్రశ్నార్థకంగా మారింది. ఈ రిజర్వాయర్‌ ద్వారా మొత్తం 16,684 ఎకరాలకు సాగునీరందాల్సి ఉంది. ఇందులో కుడి కాలువలో 6  పిల్ల కాలువల ద్వారా 13,324 ఎకరాలకు, ఎడమకాలువ పరిధిలో  3 డిస్ట్రిబ్యూటరీల ద్వారా 3,360 ఎకరాలకు సాగునీరందాల్సి ఉంది. దీనిపై ఏఈ జీవీ రఘును వివరణ కోరగా ప్రస్తుతానికి ఏమీ చేయలేమని తెలిపారు. మెయిన్‌ కెనాల్‌ పని పూర్తవ్వకుండా పిల్ల కాలువల పని చేయలేని చెప్పారు. వాతావరణం అనుకూలిస్తే త్వరగా రిజర్వాయర్‌ ఆధునికీకరణ పనులు పూర్తి చేసి, శివారుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తామని ఆయన చెప్పారు.

వీఆర్‌ఎస్‌ నుంచి... 

 మక్కువ: శంబర గ్రామ సమీపంలో ఉన్న వెంగళరాయసాగర్‌ జలాశయం  నుంచి కుడి, ఎడమ ప్రధాన కాలువలకు 80క్యూసెక్కుల సాగునీటిని ఆదివారం విడుదల చేశారు.  సాలూరు నియోజకవర్గంలో ఆండ్ర, పెద్దగెడ్డ, వెంగళరాయ సాగర్‌ ప్రాజెక్టులను రూ.100 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం రాజన్నదొర తెలిపారు. సుమారు రూ. 63  కోట్లతో వీఆర్‌ఎస్‌ ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు ప్రారంభించామన్నారు. శివారు ఆయకట్టు భూములకు సాగునీరు అందించేలా ఇరిగేషన్‌ సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.  మండలంలోని సురాపాడు, అడారుగెడ్డ ప్రాజెక్టుల నిర్మాణాలకు ప్రతిపాదనలు తయారుచేసి నివేదికలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ,  ఇరిగేషన్‌ ఎస్‌ఈ  రాంబాబు, కార్యనిర్వహణ ఇంజనీర్‌  అప్పలనాయుడు, ఏఈలు, రైతులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-08-01T05:53:50+05:30 IST