బస్సెక్కలేదు

ABN , First Publish Date - 2020-05-23T09:01:11+05:30 IST

సుదీర్ఘ విరామం తరువాత పునరుద్ధరించిన ఆర్టీసీకి ప్రయాణికుల నుంచి స్పందన

బస్సెక్కలేదు

ఆర్టీసీ ప్రయాణానికి స్పందన పూజ్యం

28 సర్వీసులకు రోడ్డుపైకి వచ్చింది 12 బస్సులే

ఆన్‌లైన్‌ బుకింగ్‌పై అవగాహనలేకపోవటమే కారణం


గుంటూరు, సత్తెనపల్లి, పొన్నూరు, మే 22: సుదీర్ఘ విరామం తరువాత పునరుద్ధరించిన ఆర్టీసీకి ప్రయాణికుల నుంచి స్పందన నామమాత్రంగానే కనిపించింది. రీజియన్‌లో 8 డిపోల నుంచి 28 సర్వీసులు అందుబాటులో ఉంచగా 12 బస్సులు మాత్రమే రోడ్డుపైకి వచ్చాయి. అది కూడా 12 బస్సుల్లో 47 మంది ప్రయాణికులతో మమ అనిపించాల్సి వచ్చింది. రేపల్లె డిపో నుంచి తెనాలి, బాపట్ల, పొన్నూరు బస్టాండ్‌లకు 2 చొప్పున 6 సర్వీసులను ఏర్పాటు చేయగా మూడు సర్వీసులు మాత్రమే నడిచాయి.


అలాగే మంగళగిరి నుంచి తెనాలికి రెండు, బాపట్లలో రెండుకి ఒకటి, పొన్నూరులో 4 సర్వీసులకు రెండు సర్వీసులు ఏర్పాటు చేయగా ప్రయాణికులు ముందుకు రాకపోవడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తెనాలి డిపో నుంచి 6 సర్వీసులు ఏర్పాటు చేయగా 4 సర్వీసులను మాత్రమే ఆపరేట్‌ చేశారు. పిడుగురాళ్ళ 4 సర్వీసులకు ఒకటి, వినుకొండ రెండు సర్వీసులకు ఒకటి మాత్రమే రోడ్డుపైకి వచ్చాయి. తొలి రోజు శుక్రవారం అమావాస్య కావటం, ప్రధాన రూట్లలో బస్సులు లేకపోవటంతో ప్రయాణికుల నుంచి పెద్దగా స్పందన కనిపించలేదని అధికారులు భావిస్తున్నారు. 


సత్తెనపల్లి డిపో నుంచి పిడుగురాళ్లకు రెండు సర్వీసులను ప్రారంభించారు. అయితే ఆన్‌లైన్‌లో ఒక టికెట్‌ బుక్‌ అయింది.  కొంతసేపటి వరకు ప్రయాణికులు ఎవరూ రాకపోవటంతో ఆ వ్యక్తి టిక్కెట్‌ క్యాన్సల్‌ చేసుకుని వెనుదిరిగారు. 

 

ఆన్‌లైన్‌ బుకింగ్‌తోనే తంటా

ఆన్‌లైన్‌లో టిక్కెట్‌ బుక్‌ చేసుకున్న వారికి మాత్రమే బస్సులో ప్రయాణించే అవకాశం కల్పిస్తామన్న నిబంధన సాధారణ ప్రయాణికులకు సమస్యగా మారిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆన్‌లైన్‌ బుకింగ్‌ సౌకర్యంతో బస్సులు ఏర్పాటు చేయటం వృథా ప్రయాసే అవుతుందని పలువురు అంటున్నారు.  


డిపోలు    -  సర్వీసులు    - ప్రయాణికుల సంఖ్య 

తెనాలి    -       4     -   19 

రేపల్లె      -       3     -  5 

బాపట్ల          -  1     -   5 

పొన్నూరు       -  2      -  4

పిడుగురాళ్ళ    -   1     -  10

వినుకొండ     -   1     -  4

  

28 బస్సుల ద్వారా సేవలు

జిల్లాలోని 8 డిపోల  ద్వారా 28 బస్సులను నడుపుతున్నాం.  పొన్నూరు డిపో నుంచి నాలుగు బస్సులను ప్రారంభించాం.  ప్రయాణికుల అవసరం మేరకు బస్సులను పెంచుతాము. ప్రయాణికులు విధిగా మాస్క్‌లు ధరించాలి. భౌతికదూరం పాటిస్తూ,  శానిటైజర్లతో ప్రయాణికులు చేతులు శుభ్రం చేసుకుంటూ బస్సుల్లో ప్రయాణించాలి. 

- రాఘవకుమార్‌, పొన్నూరులో ఆర్టీసీ ఆర్‌ఎం

Updated Date - 2020-05-23T09:01:11+05:30 IST