టీవీ సీరియల్ ప్రోమోతో కొత్త కాంట్రవర్సీ.. ఇదేంటంటూ విమర్శలు.. ఇంతకీ ఆ ప్రోమోలో ఏముందంటే..

ABN , First Publish Date - 2021-07-27T20:36:06+05:30 IST

త్వరలో ప్రసారం కాబోతున్న తమిళ సీరియల్ `తెండ్రల్ వంతు ఎన్నై తోండుమ్` ప్రోమో సరికొత్త వివాదానికి తెరతీసింది.

టీవీ సీరియల్ ప్రోమోతో కొత్త కాంట్రవర్సీ.. ఇదేంటంటూ విమర్శలు.. ఇంతకీ ఆ ప్రోమోలో ఏముందంటే..

త్వరలో ప్రసారం కాబోతున్న తమిళ సీరియల్ `తెండ్రల్ వంతు ఎన్నై తోండుమ్` ప్రోమో సరికొత్త వివాదానికి తెరతీసింది. ఆదివారం విడుదలైన ఈ ప్రోమో మహిళలను, వారి హక్కులను కించపరిచేలా ఉందని తమిళనాట విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తిరవళ్లూర్ ఎస్పీ వరుణ్ కుమార్ కూడా ఆ ప్రోమోపై అసహనం వ్యక్తం చేశారు. ఇంతకీ ఆ ప్రోమోలో ఏముందంటే.. 


ఆ సీరియల్ హీరోయిన్ అభినయ గుడికి వస్తుంది. ఆమె గుడిలో పూజ చేస్తుండగా.. హీరో ఆగ్రహంగా గుడిలోకి ప్రవేశిస్తాడు. తల్లిదండ్రులకు తెలియకుండా గుళ్లో పెళ్లి చేసుకున్న నూతన దంపతుల దగ్గరకు వచ్చి.. వధువు మెడలోని తాళి తెంపేందుకు ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన హీరోయిన్.. హీరోను కొడుతుంది. గుడిలో దేవత ముందు కట్టిన తాళి పవిత్రత గురించి చెబుతుంది. దీంతో హీరోయిన్‌కు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో హీరో అక్కడే దేవతా విగ్రహం మెడలో ఉన్న తాళి తీసి హీరోయిన్‌కు కట్టేస్తాడు. `దేవత ముందు తాళి కట్టేశాను.. నువ్వు నా భార్యవి అయిపోతావా?` అని అడుగుతాడు. హీరోను కన్నీటితో హీరోయిన్ అనుసరిస్తుండగా ప్రోమోను ముగించారు. 


ఆదివారం విడుదలైన ఈ ప్రోమో  తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కవితా మురళి ఈ ప్రోమోను సోషల్ మీడియాలో షేర్ చేసి `తమిళ సీరియల్స్ వెదజల్లుతున్న విషం` అని కామెంట్ చేశారు. ఈ పోస్ట్‌కు తిరవళ్లూర్ ఎస్పీ వరుణ్ కుమార్ స్పందిస్తూ.. మహిళలను వేధించడం అనేది చట్ట రీత్యా నేరమని, ప్రార్థనా స్థలాల్లో వారిపై దురుసుగా ప్రవర్తించడం మరింత నేరమని పేర్కొన్నారు. కాగా, సీరియల్స్, సినిమా రూపకర్తలు సామాజిక బాధ్యతను కలిగి ఉండాలని పేర్కొన్నారు. 



Updated Date - 2021-07-27T20:36:06+05:30 IST