ప్రిన్సిపాల్‌ను బదిలీ చేయాల్సిందే

ABN , First Publish Date - 2022-05-27T06:52:43+05:30 IST

నల్లగొండ ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రాజకుమారిని బదిలీ చేయాల్సిందేనని వైద్యులు ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు. మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ వైఖరికి నిరసనగా వైద్యులు చేపట్టిన సమ్మె గురువారం రెండో రోజూ కొనసాగింది. మెమోలు అందుకున్న 57మంది వైద్యులు విధులు బహిష్కరించి మెడికల్‌ కళాశాల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.

ప్రిన్సిపాల్‌ను బదిలీ చేయాల్సిందే
నల్లగొండ జనరల్‌ ఆస్పత్రి ఎదుట సమ్మెలో పాల్గొన్న వైద్యులు

నల్లగొండలో రెండో రోజూ కొనసాగిన వైద్యుల సమ్మె



నల్లగొండ అర్బన్‌,మే 26: నల్లగొండ ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రాజకుమారిని బదిలీ చేయాల్సిందేనని వైద్యులు ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు. మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ వైఖరికి నిరసనగా వైద్యులు చేపట్టిన సమ్మె గురువారం రెండో రోజూ కొనసాగింది. మెమోలు అందుకున్న 57మంది వైద్యులు విధులు బహిష్కరించి మెడికల్‌ కళాశాల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. డాక్టర్లు, ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న ప్రిన్సిపాల్‌ను బదిలీ చేసే వరకు విధులకు హాజరుకాబోమని తెలంగాణ టీచింగ్‌ గవర్నమెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ డాక్టర్‌ యుగేందర్‌, నిరసనలో పాల్గొన్న డాక్టర్లు  తేల్చిచెప్పారు. మెడికల్‌ కళాశాల ప్రారంభమైన నాటి నుంచి డాక్టర్ల పట్ల ప్రిన్సిపాల్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. క్లినికల్‌ డిపార్టుమెంట్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ పరిధిలోకి వస్తుందని, ప్రతి నెల సూపరింటెండెంట్‌ కార్యాలయం నుంచే డాక్టర్ల హాజరు వివరాలు పంపిస్తారని, దీని ప్రకారమే జీతాలు వేయడం ఆనవాయితీ అన్నారు. ఇటీవల ఈ విధానాన్ని మారుస్తూ ప్రిన్సిపాల్‌ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ క్లినికల్‌ విభాగం అటెండెన్స్‌ను తన పరిధిలోకి తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ల అటెండెన్సును తగ్గించి మెమోలు జారీ చేశారని ఆరోపించారు. ప్రతినెలా 21వ తేదీలోపు శాలరీ స్లిప్‌ పంపించాల్సి ఉండగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ 26వ తేదీ వరకూ శాలరీ చేయడం లేదన్నారు. అదనపు డ్యూటీలు చేసినా రిజిస్టర్‌ చార్టు చూసుకోకుండా ఆబ్సెంట్‌ వేస్తున్నారని, సెలవు దినాలు, ఆదివారాలు కూడా ఆబ్సెంట్లు వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. ప్రిన్సిపాల్‌ మాత్రం వారంలో ఒక రోజు కూడా కళాశాలకు రాకుండా సొంత పనులు చూసుకుంటూ బయోమెట్రిక్‌ని మాన్యువల్‌ చేస్తూ పూర్తి వేతనం తీసుకుంటున్నారని ఆరోపించారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిరసన వ్యక్తంచేసిన వైద్యులు జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ను కలిసి ఘటన తీరును వివరించారు. మెమోలు ఉపసంహరించుకుని అందరికీ పూర్తి జీతం అందేలా చర్యలు తీసుకుంటానని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. కాగా, రెండు రోజులుగా వైద్యులు నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రిన్సిపాల్‌ రాజకుమారి వారితో సంప్రదింపులు చేయలేదు. కళాశాలలో మొత్తం 140మంది వైద్యులు ఉండగా, 57మంది మినహా మిగిలిన వైద్యులు ఓపీ విభాగంలో రోగులను పరీక్షించారు. ఇదిలా ఉండగా, వైద్యులకు ఇచ్చిన మెమోలు ఉపసంహరించుకోవాలని, జరిగిన ఘటనపై విచారణ నిర్వహించాలని, డీఎంఈ రమే్‌షరెడ్డి మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రాజకుమారికి ఆదేశాలు జారీచేశారు.

Updated Date - 2022-05-27T06:52:43+05:30 IST