ఇరవై నాలుగు గంటల కరెంటుపై దృష్టి

ABN , First Publish Date - 2020-03-29T10:25:52+05:30 IST

కరోనా ఎఫెక్ట్‌తో విద్యుత్‌శాఖ అప్రమత్తమైంది. ఇరవై నాలుగు గంటలు కరెంటు సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించింది.

ఇరవై నాలుగు గంటల కరెంటుపై దృష్టి

కొత్త సబ్‌స్టేషన్‌ ప్రారంభం

పలు ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంపు

ప్రతి సబ్‌స్టేషన్‌ పరిధిలో ప్రత్యేక బృందం

కరోనా ఎఫెక్ట్‌తో విద్యుత్‌ శాఖ అప్రమత్తం


కడప (సిటి), మార్చి 28 : కరోనా ఎఫెక్ట్‌తో విద్యుత్‌శాఖ అప్రమత్తమైంది. ఇరవై నాలుగు గంటలు కరెంటు సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించింది. విద్యుత్‌ సరఫరాలో ఎటువంటి అంతరాయాలు, అవాంతరాలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. రాజంపేట నియోజకవర్గ పరిధిలో శ్రీరంగరాజపురంలో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. జిల్లాలో పలు ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచుతున్నారు. వీటితో పాటు సేవలకు అందుబాటులో ఉండేలా ప్రతి సబ్‌స్టేషన్‌ పరిధిలో నలుగురు సభ్యులు గల బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఎక్కడ నుంచి ఏ ఫిర్యాదు వచ్చినా ఈ బృందం తక్షణం స్పందించేలా అధికారులు ఆదేశాలు, సూచనలు జారీ చేశారు. 


ఆర్భాటం లేకుండా సబ్‌స్టేషన్‌ ప్రారంభం

జిల్లాలో 33/11 కేవీ సామర్థ్యం గల సబ్‌స్టేషన్లు 270 ఉన్నాయి. మరో 6 ప్రతిపాదనల్లో ఉన్నాయి. అయితే రాజంపేట నియోజకవర్గ పరిధిలోని శ్రీరంగరాజపురంలో నిర్మించిన సబ్‌స్టేషన్‌ దాదాపు అన్ని పనులు పూర్తయ్యాయి. కొన్ని చిన్న చిన్న పనులు పెండింగులో ఉండేవి. కరోనా ఎఫెక్ట్‌తో ఆ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రారంభించారు. ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండానే ప్రారంభించడం గమనార్హం.


12 ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంపు

సాధారణంగా విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు 3, 15, 5, 8, 10 ఎంవీఏ (మెగా ఓల్ట్స్‌ ఆంపిషియన్‌) సామర్థ్యంతో పనిచేస్తుంటాయి. అయితే డిమాండ్‌ను బట్టి వాటి సామర్థ్యం పెంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం సామర్థ్యం పెంచాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో రాజంపేట సమీపంలోని మన్నూరులో 5 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ సామర్థ్యాన్ని 8 ఎంవీఏకి పెంచారు. ఇది కాక పులివెందుల, కడప, రాయచోటి, ప్రొద్దుటూరు, మైదుకూరు నియోజకవర్గ పరిధిల్లో మరో 12 ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థాన్ని 5 ఎంవీఏ నుంచి 8 ఎంవీఏకు పెంచేందుకు చర్యలు చేపట్టారు. డిమాండ్‌ ఉన్న ప్రాంతాల్లో సామర్థ్యం పెంపుపై అధికారులు దృష్టి సారించారు. 


నిరంతర సేవలకు సిద్దంగా ఉన్నాం

కరోనా నేపధ్యంలో వినియోగదారులకు ఎటువంటి అంతరాయం లేని విద్యుత్‌ను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎస్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ ఎన్‌.శ్రీనివాసులు స్పష్టం చేశారు. ప్రతి సబ్‌స్టేషన్‌ పరిధిలో ప్రత్యేక బృందాలను అందుబాటులో ఉంచామని ఫిర్యాదు రాగానే ఈ బృందాలు స్పందిస్తాయన్నారు. ఇరవై నాలుగు గంటల కరెంటు సరఫరా లక్ష్యంగా తమ సిబ్బంది ముందుకెళుతున్నారన్నారు. వారు కూడా కరోనా నియంత్రణ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


Updated Date - 2020-03-29T10:25:52+05:30 IST