Abn logo
Oct 19 2021 @ 00:53AM

ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతోనే విద్యుత్‌ సంక్షోభం

సమావేశంలో మాట్లాడుతున్న తాతయ్యబాబు

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి తాతయ్యబాబు


బుచ్చెయ్యపేట, అక్టోబరు 18: వైసీపీ ప్రభుత్వ అనాలోచిన నిర్ణయాల కారణంగానే రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభం ఏర్పడిందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు ఆరోపించారు. తన స్వగృహంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు సీఎం జగన్‌ ప్రధానికి లేఖ రాశారన్నారు. చంద్రబాబు హయాంలో చేసుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు తప్పయితే, వైపీపీ ప్రభుత్వం అదానీ సంస్థ నుంచి పది వేల మెగావాట్ల విద్యుత్‌ ఎందుకు కొంటుందని ప్రశ్నించారు. ఏపీలో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్న హిందూజా సంస్థను మూతపడేలా చేసిన రాష్ట్ర ప్రభుత్వం, అదానీ సంస్థ నుంచి అధిక ధరకు విద్యుత్‌ ఎందుకు కొనుగోలు చేస్తుందో సీఎం జగన్‌ ప్రజలకు తెలపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ సంస్థలకు రూ.12 వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా, ఆ భారాన్ని కూడా ట్రూ అప్‌ చార్జీల పేరుతో ప్రజలపై వేసిందని ఆరోపించారు. తమ పాలనా వైఫల్యం కారణంగా తలెత్తిన విద్యుత్‌ సంక్షోభాన్ని యూరప్‌, చైనాలతో పొల్చడాన్ని ఆయన ఆక్షేపించారు. విద్యుత్‌ కోతలకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ సలహాదారులు ప్రజలను హెచ్చరించడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిరంతర విద్యుత్‌ ఇస్తుండగా, సీఎం జగన్‌  కనీసం విద్యుత్‌ ఉత్పత్తిపై అధ్యయనం చేయకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రజలను బాధ్యులను చేయడం ఏమిటని తాతయ్యబాబు ప్రశ్నించారు. రాష్ట్రం విద్యుత్‌ సంక్షోభంలో కూరుకుపోక ముందే వైసీపీ ప్రభుత్వం మేల్కోవాలని తాతయ్యబాబు డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో బుచ్చెయ్యపేట, రావికమతం టీడీపీ మండల అధ్యక్షులు గోకివాడ కోటేశ్వరరావు, కొండనాయుడు, జిల్లా రూరల్‌ తెలుగుయువత ఉపాధ్యక్షుడు శిరిగిరిశెట్టి శ్రీరామూర్తి, డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ కోరుకొండ రవికుమార్‌ పాల్గొన్నారు.