లింగన్నా..ఇక సెలవు

ABN , First Publish Date - 2020-08-07T07:05:01+05:30 IST

దుబ్బాక ప్రాంతం దుఃఖ సాగరంలో మునిగింది. కూడవెళ్లి తీరం కన్నీటి సంద్రమైంది.

లింగన్నా..ఇక సెలవు

కన్నీటి సంద్రమైన కూడవెళ్లి తీరం 

ప్రజానాయకుడికి అంతిమ వీడ్కోలు పలికిన ప్రజలు

దుఃఖ సాగరంలో మునిగిన కుటుంబసభ్యులు

సోలిపేటను కడసారి చూసేందుకు తరలివచ్చిన అభిమానులు

కంట తడిపెట్టిన సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు

నివాళులర్పించిన నేతలు, అధికారులు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట/దుబ్బాక/మిరుదొడ్డి ఆగస్టు 6 : దుబ్బాక ప్రాంతం దుఃఖ సాగరంలో మునిగింది. కూడవెళ్లి తీరం కన్నీటి సంద్రమైంది. నిత్యం ప్రజల మధ్య అలుపెరగకుండా తిరిగే నాయకుడు అచేతన స్థితికి చేరడంతో ఆశేష జనం గొల్లుమంది. తమ అభిమాన నాయకుడు లింగన్న భౌతికకాయాన్ని చూసి అందరి హృదయాలు బరువెక్కాయి. సాధారణ రైతు కుటుంబంలో జన్మించి ఉద్యమాలే ఊపిరిగా, ప్రజాసేవే పరమావధిగా సాగిన సోలిపేట రామలింగారెడ్డి ప్రస్థానం ముగిసిపోయింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతిచెందిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అంత్యక్రియలను ఆయన స్వగ్రామం చిట్టాపూర్‌లో నిర్వహించారు. 


కడసారి చూపు కోసం తరలొచ్చిన అభిమానులు

కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఎన్ని మార్గదర్శకాలను సూచించినా కూడా లెక్కచేయకుండా తమ అభిమాన నాయకుడి కడచూపు కోసం వేలాదిగా ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. నిన్నటి వరకు తమ కష్టాలను భుజాన మోసిన నాయకుడు తమను కన్నీటిలో ముంచుతారని అనుకోలేదని శోకించారు. ఉదయం ఏడు గంటలకే రామలింగారెడ్డి పార్థివదేహాన్ని చిట్టాపూర్‌ గ్రామానికి తీసుకుని రాగా ఆయనకు ఎంతగానో ఇష్టమైన స్వగృహం వద్ద ఆయన పార్థివదేహాన్ని సుమారు 8 గంటల పాటు ప్రజల సందర్శనార్థం ఉంచారు. దుబ్బాక నియోజకవర్గ ప్రజలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఆయన మిత్రులు, అభిమానులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తరలివచ్చారు. 

 

సుజాతక్కను చూసి కన్నీటిపర్యంతమై..

ఆదర్శ వివాహంతో ఒక్కటైన రామలింగన్న, సుజాతక్క దంపతులు అంటే నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలకు చిరపరిచితులు. రామలింగారెడ్డి భౌతికకాయం వద్ద విలపిస్తున్న సుజాతక్కను చూసిన వారంతా కన్నీటి పర్యంతమయ్యారు. మంత్రి హరీశ్‌రావు సైతం దుఃఖసాగరంలో మునిగారు. ఆమెను ఓదార్చడం ఎవరి వల్లా కాలేకపోయింది. మంత్రి, ఎంపీ సముదాయించే ప్రయత్నం చేశారు. తనతో, ప్రజలతో పెనవేసుకున్న బంధాన్నీ జ్ఞాపకం చేసుకుంటూ దుఃఖించారు. సీఎం కేసీఆర్‌ వచ్చిన సమయంలోనూ ఆమెను పరామర్శించగా బోరున విలపించింది. ఆమె వేదనను చూసి కేసీఆర్‌ సైతం విషాదంలో మునిగారు. 


చిన్నబోయిన చిట్టాపూర్‌

రామలింగారెడ్డి స్వగ్రామమైన చిట్టాపూర్‌ ఒక్కసారిగా చిన్నబోయింది. తమ ఊరి బిడ్డ నాలుగు దశాబ్దాల పాటు ఉద్యమాల్లో, ప్రజాసేవలో ఉండడాన్ని చూసి గర్వంగా తలెత్తుకున్న ఆ గ్రామ పరిసరాలన్నీ మూగబోయాయి. ఇన్నాళ్లు లింగన్నా జిందాబాద్‌.. ఆర్‌ఎల్‌ఆర్‌ నాయకత్వం వర్ధిల్లాలి అనే నినాదాలను విన్న గ్రామ ప్రజలు లింగన్నా అమర్‌ రహే.. ఆర్‌ఎల్‌ఆర్‌ జోహార్‌ అంటూ నినదిస్తూ అంతిమయాత్ర సాగుతుంటే ఆవేదనకు లోనయ్యారు. చిట్టాపూర్‌లోని కూడవెళ్లి వాగు తీరంలో రామలింగారెడ్డి దహన సంస్కారాలను చూసి తమ పల్లె జ్యోతి ఆరిపోయిందని వెక్కివెక్కి ఏడ్చారు. 


గొల్లుమన్న కూడవెళ్లి తీరం

కూడవెళ్లి రామలింగేశ్వరస్వామి కొలువుదీరిన కూడవెళ్లి వాగు తీరాన రామలింగారెడ్డి మృతదేహానికి అంత్యక్రియలను నిర్వహించారు. తన పేరు పెట్టుకొని జీవితానికి సార్ధకత చేసుకొని ప్రజానాయకుడిగా వెలిగిన సోలిపేటను రామలింగేశ్వర స్వామి తనలో ఐక్యం చేసుకున్నారని కన్నీరుమున్నీరయ్యారు.  చిట్టాపూర్‌ గ్రామం నుంచి సుమారు 3 కిలోమీటర్లు అంతిమయాత్రను నిర్వహించి వారి వ్యవసాయ భూమిలో అంత్యక్రియలు జరిపారు. రామలింగారెడ్డి కుమారుడు సతీశ్‌రెడ్డి తలకొరివి పెడుతున్న క్రమంలో ఒక్కసారిగా అభిమానులంతా గొల్లుమన్నారు. లింగన్నా వెళ్లిపోతున్నావా అంటూ శోకించారు. తమ అభిమాన నేతను ఆఖరి చూపు చూసుకొని తల్లడిల్లిపోయారు.  


సీఎం కేసీఆర్‌ కన్నీటి వీడ్కోలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిట్టాపూర్‌ చేరుకొని కన్నీటి వీడ్కోలు పలికారు. రామలింగారెడ్డితో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకొని కన్నీరు పెట్టుకున్నారు. రామలింగారెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అందరూ ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. కేసీఆర్‌తో పాటు మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, పువ్వాడ అజయ్‌, సత్యవతి రాథోడ్‌, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్‌, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, బాల్క సుమన్‌, మదన్‌రెడ్డి నివాళులర్పించారు.


పాడే మోసిన హరీశ్‌రావు, కేపీఆర్‌

దుబ్బాక : తనతో ఉద్యమ సహచరుడిగా ప్రస్థానం సాగించిన సోలిపేట రామలింగారెడ్డి అంత్యక్రియలను మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఆయనతో పాటు మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి సోలిపేట అంతిమ యాత్రలో పాడే మోశారు. తన ఉద్యమ సహచరుడిని కోల్పోయాననే విషాదవదనంతో మంత్రి కంటతడి పెట్టారు. సోలిపేట అనారోగ్యం పాలైన నాటి నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న మంత్రి గురువారం అంత్యక్రియలు చివరి వరకు నిలబడి వీడ్కోలు చెప్పారు. 

Updated Date - 2020-08-07T07:05:01+05:30 IST