కానిస్టేబుల్‌ కుటుంబంలో పదిమందికి పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-06-03T10:32:08+05:30 IST

గ్రేటర్‌లో కరోనా దాడి కొనసాగుతూనే ఉంది. కానిస్టేబుల్‌ కుటుంబంలో పదిమందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మంగళవారం మొత్తం 70

కానిస్టేబుల్‌ కుటుంబంలో పదిమందికి పాజిటివ్‌

 గ్రేటర్‌లో కొనసాగుతున్న కరోనా దాడి


ఎర్రగడ్డ/రాంనగర్‌/ముషీరాబాద్‌/సికింద్రాబాద్‌/మంగళ్‌హాట్‌/ మౌలాలి/ కుత్బుల్లాపూర్‌/ మదీన/ చాదర్‌ఘాట్‌/అంబర్‌పేట్‌/రామంతాపూర్‌/ అల్వాల్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌లో కరోనా దాడి కొనసాగుతూనే ఉంది. కానిస్టేబుల్‌ కుటుంబంలో పదిమందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మంగళవారం మొత్తం 70 కరోనా కేసులు నమోదయ్యాయి.


ఆయుర్వేద ఆస్పత్రిలో 24 మందికి.. 

ఎర్రగడ్డ ఆయుర్వేద ఆస్పత్రిలో మంగళవారం 24 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్‌ వచ్చిన వారికి ఆస్పత్రిలోనే చికిత్స చేస్తున్నామని సూపరింటెండెంట్‌ పరమేశ్వర్‌ నాయక్‌ తెలిపారు. 19 మందికి నెగెటివ్‌ రావడంతో మంగళవారం డిశ్చార్జి చేశామన్నారు.  


ఆర్‌ఎంపీ డాక్టర్‌, వృద్ధుడికి పాజిటివ్‌

ముషీరాబాద్‌ పఠాన్‌బస్తీకి చెందిన ఆర్‌ఎంపీ డాక్టర్‌ (40) భోలక్‌పూర్‌ బడీ మసీదు సమీపంలో క్లినిక్‌ నిర్వహిస్తున్నాడు. ఇటీవల అనారోగ్యానికి గురవడంతో ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ రావడంతో డిశ్చార్జి చేశారు. మరలా అనారోగ్యానికి గురవడంతో జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చింది. ముషీరాబాద్‌కు చెందిన వృద్ధుడి(73)కి కరోనా పాజిటివ్‌ వచ్చింది. అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. 


అడిక్‌మెట్‌, రాంనగర్‌లో ఇద్దరికి కరోనా

ముషీరాబాద్‌ నియోజకవర్గంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా అడిక్‌మెట్‌ స్ట్రీట్‌ నంబర్‌ 16లో నివసిస్తున్న వ్యక్తి(42)కి, రాంనగర్‌ చౌరస్తా సమీపంలో నివసిస్తున్న మరో వ్యక్తికి పాజిటివ్‌ వచ్చింది. కేసులు విస్తరిస్తున్న ప్రాంతాల్లో అధికారులు కట్టడి చేయడం లేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నియోజకవర్గంలో పాజిటివ్‌ వచ్చిన కేసుల ప్రైమరీ కాంటాక్ట్‌ సభ్యులకు వైద్యాధికారులు పరీక్షలు చేయడంలేదు. వైద్య సిబ్బంది వచ్చి అనారోగ్యానికి గురయ్యారా అని అడిగి వెళ్తున్నారే తప్ప పరీక్షలు చేయడం లేదని బాకారంలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యులు ‘ఆంధ్రజ్యోతి’తో వాపోయారు. 


డాక్టర్‌ కుటుంబంలో నలుగురికి..

కార్ఖానా పీ అండ్‌ టీ కాలనీలో ఓ డాక్టర్‌ కుటుంబంలో నలుగురికి కరోనా సోకింది. కంటోన్మెంట్‌ బోర్డు సిబ్బంది ఆయన నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌ను శానిటైజ్‌ చేశారు.


ఏడుగురు వైద్య విద్యార్థులకు..

ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో కరోనా కేసులు పెరుగుతుండడంతో వైద్య విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. మూడు రోజుల క్రితం ఇద్దరికి, మరుసటి రోజు మరో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. మంగళవారం మరో ఏడుగురికి పాజిటివ్‌ వచ్చింది. మంగళవారం 96 మంది విద్యార్థుల నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించామని.. సాయంత్రం వచ్చిన రిపోర్టులో వారికి నెగెటివ్‌ వచ్చిందని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శశికళారెడ్డి తెలిపారు.  


కింగ్‌కోఠి ఆస్పత్రిలో 15 కేసులు 

కింగ్‌కోఠి ఆస్పత్రిలో మంగళవారం 15 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరందరినీ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కింగ్‌కోఠి ఆస్పత్రిలో 115 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. వీరి రక్తనమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. రిపోర్టులు రావాల్సి ఉంది.   


వైద్యుడి ఇంట్లో పనిచేసే మహిళకు...

మల్కాజిగిరి సర్కిల్‌ గౌతంనగర్‌, రామాంజనేయనగర్‌లో ఓ మహిళకు కరోనా సోకింది. కొద్ది రోజుల క్రితం తుకారాంగేట్‌లో నివసిస్తున్న వైద్యుడు కరోనా బారిన పడ్డాడు. వైద్యుడి ఇంట్లో పనిచేస్తున్న ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ రావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇంటి యజమానితోపాటు ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్న మరో తొమ్మిదిమందిని హోం క్వారంటైన్‌ చేశారు.


కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌లో నలుగురికి..

కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ వాణీనగర్‌లో ఇటీవల ఓ వ్యక్తి(37)కి కరోనా వైరస్‌ సోకింది. అతడి ఇంటి పక్కనే ప్రాథమిక కాంటాక్ట్‌గా ఉన్న ఓ మహిళ(34)కు మంగళవారం పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు. గతనెల 27వ తేదీన జ్వరం రావడంతో వివేకానందనగర్‌లో తెలిసిన డాక్టర్‌ను ఇంటికి పిలిపించుకొని వైద్యం చేయించుకోగా డెంగీ లక్షణాలు ఉన్నట్లు డాక్టర్‌ చెప్పారు. సృజన ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ బెడ్లు ఖాళీ లేకపోవడంతో ఓమ్నీ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడా బెడ్లు ఖాళీగా లేకపోవడంతో జూన్‌ ఒకటో తేదీన యశోద ఆస్పత్రికి వెళ్లింది. వైద్యులు అడ్మిట్‌ చేసుకొని రక్త నమూనాలు సేకరించి పరీక్షకు పంపించారు. మంగళవారం వచ్చిన రిపోర్టులో కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు నిర్ధారణ కావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అధికారులు ఆమె కుమార్తెను హోం క్వారంటైన్‌ చేసి వారి ఇంటిని కట్టడి ప్రాంతంగా ప్రకటించారు. ఆమె ఇంటి పక్కన ఉండే మరో వ్యక్తి దగ్గుతో బాధపడుతూ కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షల నిమిత్తం అతడిని నేచర్‌క్యూర్‌ ఆస్పత్రికి తరలించారు.  


సాయిబాబానగర్‌లో..

సాయిబాబానగర్‌ పాండు బస్తీలో ఓ వృద్ధురాలి(66)కి కరోనా సోకింది. ఆమె కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది. స్థానికంగాగల క్లినిక్‌లో వైద్యం చేయించుకున్నా నయం కాకపోవడంతో సోమవారం గాంధీ ఆస్పత్రికి వెళ్లింది. వైద్యులు ఆమె రక్త నమూనాలు సేకరించి పరీక్షకు పంపించారు. మంగళవారం వచ్చిన రిపోర్టులో పాజిటివ్‌గా తేలింది. అధికారులు ఆమె నలుగురు కుటుంబ సభ్యులతోపాటు అదే భవనంలో ఉంటున్న మరో 8 మందిని హోం క్వారంటైన్‌ చేసి ఇంటిని కట్టడి ప్రాంతంగా ప్రకటించారు. 


శివానగర్‌లో..

గాజులరామారం సర్కిల్‌ శివానగర్‌లో కూరగాయల వ్యాపారం చేసే కుటుంబంలోని తల్లి, కుమారుడికి కరోనా సోకింది. కూరగాయల వ్యాపారం చేసే ఓ మహిళ(40) గతనెల 29న దగ్గు, జ్వరం రావడంతో కూకట్‌పల్లి రాందేవ్‌రావ్‌ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి నేచర్‌క్యూర్‌ ఆస్పత్రికి వెళ్లమని సూచించారు. సోమవారం ఆమె రక్త నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. మంగళవారం వచ్చిన రిపోర్టులో కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 


కూరగాయల వ్యాపారం చేసే 40 సంవత్సరాల మహిళకు గత నెల 29వ తేదీ దగు,్గ జ్వరం రావడంతో ఆమెతోపాటు కుమారుడు, కుమార్తెను  కూకట్‌పల్లిలోని రాందేవ్‌రావ్‌ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షలు నిర్వహించి నేచర్‌క్యూర్‌ ఆస్పత్రికి వెళ్లమని సూచించారు. అక్కడ సోమవారం కరోనా పరీక్షల నిమిత్తం నమూనాలు సేకరించి పరీక్షించగా మంగళవారం వచ్చిన ఫలితాల్లో మహిళ, ఆమె కుమారుడికి పాజిటివ్‌ రాగా.. కుమార్తెకు నెగెటివ్‌ వచ్చింది. దీంతో అధికారులు ఆమె కుటుంబ సభ్యులతోపాటు అదే భవనంలో అద్దెకు ఉంటున్న మరో రెండు కుటుంబాలను హోం క్వారంటైన్‌ చేసి ఆ ఇంటిని కట్టడి ప్రాంతంగా ప్రకటించారు. 


కానిస్టేబుల్‌ కుటుంబ సభ్యులకు..

బాలాగంజ్‌కు చెందిన ట్రాఫిక్‌ విభాగంలో పనిచేసే కానిస్టేబుల్‌కు నాలుగు రోజుల క్రితం పాజిటివ్‌ సోకింది. దీంతో అధికారులు అతడి కుటుంబసభ్యులకు వైద్యపరీక్షలు నిర్వహించగా భార్య, కుమారులు, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లకు మొత్తం 10 మందికి కరోనా వైరస్‌ సోకినట్లుగా అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారంతా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.


కిషన్‌బాగ్‌లో మహిళకు..

కిషన్‌బాగ్‌ అసద్‌బాబానగర్‌కు చెందిన మహిళ(62) కు మంగళవారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఆమె కుటుంబ సభ్యులను అధికారులు హోం క్వారంటైన్‌ చేశారు. ఆమెకు వైరస్‌ ఎలా సోకిందనే విషయం నిర్ధారణ కాలేదు. 


మలక్‌పేటలో ఆరుగురికి.. 

మలక్‌పేటలో వేర్వేరు ప్రాంతాల్లో మంగళవారం ఆరుగురికి కరోనా వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. ఇద్దరు పీజీ వైద్యులు, ఒక స్టాఫ్‌ నర్సు, నాలుగేళ్ల బాలుడు కొవిడ్‌ బారిన పడిన వారిలో ఉన్నారు. పేట్లబురుజు ఆస్పత్రిలో పనిచేస్తూ మలక్‌పేట పల్టన్‌లో నివసిస్తున్న పీజీ వైద్యురాలు(25), అదే ఆస్పత్రిలో పనిచేస్తూ జడ్జెస్‌ కాలనీలో నివసిస్తున్న గైనకాలజి్‌స్ట(23)కు ఆదివారం తీవ్రమైన జ్వరం వచ్చింది. అదే ఆస్పత్రిలో సోమవారం కరోనా పరీక్షలు చేయించుకున్నారు. మంగళవారం వచ్చిన రిపోర్టులో ఇద్దరికీ పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు వైద్యుల భర్తలను హోం క్వారంటైన్‌ చేశారు. 


అక్బర్‌బాగ్‌లో నివసిస్తున్న ఓ మహిళ(32) ఉస్మానియా ఆస్పత్రిలో స్టాఫ్‌ నర్సుగా పనిచేస్తోంది. ఆమె మూడు రోజుల నుంచి జ్వరంతోపాటు గొంతు నొప్పి, ఒంటి నొప్పులతో బాధపడుతోంది. ఉస్మానియా ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేయించుకోగా వైరస్‌ సోకినట్లు తేలింది. ఆమె భర్త, పిల్లలను క్వారంటైన్‌ చేశారు. 


చంచల్‌గూడ బాగే జహరాలో నివసిస్తున్న ఓ వ్యక్తి(35) మూడు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. పాతబస్తీ అస్రా ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నా నయం కాలేదు. గాంధీ ఆస్పత్రిలో సోమవారం కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. మంగళవారం వచ్చిన రిపోర్టులో పాజిటివ్‌ వచ్చింది. అతడికి ప్రైమరీ కాంటాక్టులో ఉన్న ఏడుగురు కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. 

నూర్‌ఖాన్‌ బజార్‌ ఆగా టవర్స్‌లో నివసిస్తున్న ఓ మహిళ(47) గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్‌ కోసం మారేడ్‌పల్లిలోని షెనాయ్‌ నర్సింగ్‌ హోంకు వెళ్లింది. ఆపరేషన్‌కు ముందు కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష చేయగా కరోనా వైరస్‌ సోకినట్లు బయటపడింది. ఆమె అత్త, భర్త, మరదలు, కుమారుడిని క్వారంటైన్‌కు తరలించారు. 


ముసారాంబాగ్‌ బస్తీలో మసీదు సమీపంలో నివసిస్తున్న నాలుగేళ్ల బాలుడికి కరోనా వైరస్‌ సోకింది. బాలుడి తండ్రి అగ్నిమాపక శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు ఆదివారం కరోనా పాజిటివ్‌ వచ్చింది. అతడికి ప్రైమరీ కాంటాక్టులో ఉన్న కుమారుడి(4)కి కరోనా సోకింది. మిగతా ముగ్గురు కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ వచ్చింది.


అంబర్‌పేటలో ముగ్గురికి..

అంబర్‌పేట్‌లో మంగళవారం మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. బాగ్‌ అంబర్‌పేట్‌ రెడ్‌ బిల్డింగ్‌ వద్ద నివసిస్తూ ఇంజనీరింగ్‌ చదువుతున్న యువకుడు(26), తురాబ్‌నగర్‌లో కిరాణాషాప్‌ నిర్వాహకుడు(42), చెన్నారెడ్డినగర్‌లో కిరాణాషాపు నిర్వహిస్తున్న మరో వ్యక్తి(42) వైరస్‌ బారిన పడ్డారు. అధికారులు ముగ్గురినీ గాంధీ ఆస్పత్రికి తరలించారు.


అల్వాల్‌లో ముగ్గురికి.. 

అల్వాల్‌లో మరో ముగ్గురు కరోనా వైరస్‌ బారిన పడ్డారు. ఫాదర్‌ బాలయ్య ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న మహిళ(62) అనారోగ్యంతో బాధపడుతుండగా ఆస్పత్రిలో చేర్పించారు. కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌ రావడంతో ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆమె భర్త(67), కుమారుడి(31)ను హోం క్వారంటైన్‌కు తరలించారు. 


అల్వాల్‌లో మరో ప్రాంతానికి చెందిన వ్యక్తి(48)కి పాజిటివ్‌ రావడంతో అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడి భార్య(41), కుమారుల (17), (13)ను హోం క్వారంటైన్‌కు తరలించారు. మచ్చబొల్లారంలో ఓ ప్రాంతానికి చెందిన వ్యక్తి(55)కి పాజిటివ్‌ వచ్చింది. అతడిని కూడా గాంధీ ఆస్పత్రికి, భార్యను హోం క్వారంటైన్‌కు తరలించారు. 


ఉస్మానియా హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌కు..

మంగళ్‌హాట్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా ఆస్పత్రిలో పనిచేస్తున్న హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌(46)కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. రంజాన్‌ సందర్భంగా తన సొంతూరు మహబూబ్‌నగర్‌ జిల్లా వెళ్లి వచ్చాడు. అప్పటి నుంచి జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నాడు. వైద్యులు సోమవారం రక్త నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. మంగళవారం వచ్చిన రిపోర్టులో అతడికి కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిమ్స్‌లో రెసిడెంట్‌ డాక్టర్లు నలుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. 


ఎస్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌కు..

రామంతాపూర్‌, హబ్సిగూడలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 15 కేసులు నమోదు కాగా.. ఒకరు మృతి చెందారు. తాజాగా మరొకరికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది.  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ)లో స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఎస్‌పీఎఫ్‌) కానిస్టేబుల్‌ ఒకరికి కరోనా పాజిటివ్‌గా పరీక్షల్లో తేలింది. 


Updated Date - 2020-06-03T10:32:08+05:30 IST