మాయని మచ్చ

ABN , First Publish Date - 2020-03-18T06:05:54+05:30 IST

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ని మోదీ ప్రభుత్వం రాజ్యసభలో కూచోబెట్టడం అనేకులకు ఆశ్చర్యాన్నీ, పలువురు మాజీ న్యాయమూర్తులకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది...

మాయని మచ్చ

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ని మోదీ ప్రభుత్వం రాజ్యసభలో కూచోబెట్టడం అనేకులకు ఆశ్చర్యాన్నీ, పలువురు మాజీ న్యాయమూర్తులకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. నాలుగునెలల క్రితం దాకా న్యాయపెద్దగా ఉన్న గొగోయ్‌ ఇక పెద్దల సభలో కూచోబోతున్నారు. అవసరమనుకుంటే ఆర్నెల్లలోగా ఆయన ఓ రాజకీయపక్షంతో జతకూడిపోవచ్చు కూడా. వివిధ రంగాల్లో నిపుణులు, నిష్ణాతుల సేవలు సమాజానికి మరింత ఉన్నదని భావించిన పక్షంలో అధికారపక్షం సూచనమేరకు రాష్ట్రపతి రాజ్యసభలో నామినేట్‌ చేయడం సంప్రదాయం. కానీ, ఎన్నడూలేని స్థాయిలో గొగోయ్‌ నియామకం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నది, ఇచ్చినవారికీ పుచ్చుకున్నవారికీ కూడా అప్రదిష్ట తెచ్చిపెడుతున్నది.


రిటైర్మెంట్‌ అనంతరం ప్రభుత్వం ఇచ్చే పదవులకు న్యాయమూర్తులు కక్కుర్తిపడటం న్యాయవ్యవస్థ స్వతంత్రతకు మాయనిమచ్చ అన్న మాటలు గొగోయ్‌ నోట రెండేళ్ళక్రితం విని దేశం ఎంతో ముచ్చటపడింది. ప్రధాన న్యాయమూర్తిగా లైంగికవేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సందర్భంలో, ‘న్యాయ మూర్తులకు చివరికి మిగిలేది కీర్తి ప్రతిష్ఠలే’ అంటూ, తన అతితక్కువ బ్యాంకు బాలెన్స్‌ని సౌశీల్యానికి నిదర్శనంగా చూపించారు కూడా. ఆర్థికపరమైనది మాత్రమే అవినీతి కాదనీ, దానికి అనేక అవతారాలున్నాయని ఈ న్యాయకోవిదునికి తెలియనిదేమీ కాదు. దేశచరిత్రలో తొలిసారిగా ప్రధాన న్యాయమూర్తి మీద తిరుగుబాటు చేసిన న్యాయమూర్తుల బృందంలో ఉంటూ గొగోయ్‌ చేసిన ఆరోపణలు, వల్లించిన ఆదర్శాలు కూడా దేశం విన్నది. కీలకమైన కేసులను దీపక్‌మిశ్రా మిగతావారికి పంచకపోవడం వెనుక చాలా లెక్కలూ లాలూచీలూ ఉన్నాయన్నది ఈ తిరుగుబాటు సారాంశం. గొగోయ్‌ వల్లించిన ఆదర్శాలు, చెప్పిన విలువలన్నీ ఈ నామినేషన్‌ దెబ్బకు కొట్టుకుపోయాయి. రిటైర్మెంట్‌ అనంతర ఉపాధి ద్వారా ఆయన ప్రస్తుత న్యాయమూర్తులకు ఓ సందేశాన్ని ఇస్తున్నారు, రాజమార్గాన్ని చూపిస్తున్నారు. సీల్డు కవర్ల న్యాయమూర్తిగా ప్రసిద్ధిచెందిన గొగోయ్‌ తన పదమూడు నెలల కాలంలో ఇచ్చిన తీర్పుల్లో అత్యధికం అధికారపక్షానికి అనుకూలంగానే ఉన్నాయన్న విపక్షాల విమర్శ కాదనలేనిది. రాఫెల్‌ యుద్ధవిమానాల బాగోతం, సిబీఐ డైరక్టర్‌ వివాదం, అసోం ఎన్‌ఆర్‌సి, ఆర్టికల్‌ 370, అయోధ్య తీర్పు... ఇది క్విడ్‌ ప్రోకో కాదా? అన్న విపక్షాల ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టం.


ఈ తరహా నియామకాలు కొత్తేమీకాదు. నెహ్రూ కాలం నుంచి, మరీ ముఖ్యంగా ఇందిర హయాంలో నిరాఘాటంగా సాగినవే. కానీ, గొగోయ్‌ నామినేషన్‌ కాలాన్నీ, దూరాన్నీ చెరిపేసి, అన్ని మొహమాటపు తెరలను నిర్లజ్జగా చింపేసింది. సిక్కుల ఊచకోత ఘటనకు కొందరు కాంగ్రెస్‌ నాయకులను మాత్రమే బాధ్యులను చేస్తూ పార్టీని రక్షించినందుకు జస్టిస్‌ రంగనాథ్‌ మిశ్రాకు రాజ్యసభ సభ్యత్వం దక్కిందని బీజేపీ విమర్శిస్తూంటుంది. రిటైరయిన ఎనిమిదేళ్ళకు, అదీ కాంగ్రెస్‌ విపక్షంలో ఉండగా ఆయన పార్టీ తరఫున ఎన్నిక కావడానికీ, ఇప్పుడు రిటైరైన నాలుగునెలల్లోనే గొగోయ్‌ నామినేట్‌ కావడానికీ హస్తిమశకాంతరం ఉన్నది. గొగోయ్‌ మొన్నటివరకూ అనుభవించిన హోదాతో, అందుకున్న గౌరవంతో పోల్చితే ఈ కొత్త పదవి గొప్పదేమీ కాదు. కానీ, కొలీజియం విధానంమీద కక్షతో ఉన్న ప్రభుత్వానికి ఈ న్యాయకోవిదుడు రాజ్యసభలో కాలూనడం అవసరం. 2015లో మోదీ ప్రభుత్వం నేషనల్‌ జుడీషియల్‌ అపాయిట్‌మెంట్స్‌ కమిటీ ఏర్పాటు ద్వారా న్యాయమూర్తుల నియామకాలను గుప్పిట్లోకి తీసుకోబోతే సుప్రీంకోర్టు మోకాలడ్డిన విషయం తెలిసిందే. జాతి నిర్మాణం కోసం శాసన కార్యనిర్వాహక వ్యవస్థలు కలసి


కట్టుగా పనిచేయాలని గొగోయ్‌ ఇప్పుడు ఎందుకంటున్నారో త్వరలోనే తేలిపోతుంది. రాజ్యసభలో అధికారపక్షానికి సంఖ్యాబలం కూడా హెచ్చుతుంది. ‘అద్భుతమైన వ్యక్తిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన..’ అంటూ మొన్న ఫిబ్రవరిలో జరిగిన అంతర్జాతీయ న్యాయసదస్సులో జస్టిస్‌ అరుణ్‌మిశ్రా మోదీమీద కురిపించిన ప్రశంసలు చూశాం. కార్యనిర్వాహక వ్యవస్థ నిర్ణయాలు రాజ్యాంగ విహితమైనవో కాదో నిగ్గుతేల్చుతూ, న్యాయవ్యవస్థ స్వతంత్రతను పరిరక్షిస్తూ, ప్రజల్లో ఎటువంటి అపోహలకు తావివ్వకుండా నడుచుకోవాల్సిన వారే అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి ప్రతీ నియామకం న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని చంపేస్తుంది, గత తీర్పులపై అనుమానాలు రేకెత్తిస్తుంది. గొగోయ్‌ ఇచ్చిన తీర్పులు ఎంత వివాదాస్పదమైనా, ఎన్ని విమర్శలు వచ్చినా దీపక్‌మిశ్రా తరహాలో తిరుగుబాటు ఎదుర్కోలేదు. కనీసం ఇప్పటికైనా, రిటైర్మెంట్‌ అనంతర నియామకాలమీద సుప్రీంకోర్టు కట్టడి విధిస్తే న్యాయవ్యవస్థ స్వతంత్రత కాస్తంతైనా నిలబెట్టుకోవచ్చు.

Updated Date - 2020-03-18T06:05:54+05:30 IST