చెట్ల పొదల్లో పసికందును పడేసి వెళ్లిపోయిందా తల్లి.. చీమలు కుట్టడంతో గుక్కపట్టి ఏడ్చిన పాప.. చివరకు..

ABN , First Publish Date - 2021-08-05T16:20:27+05:30 IST

అప్పుడే పుట్టిన బిడ్డను ఎంతో ప్రేమగా దగ్గరకు తీసుకోవాల్సిన ఆ తల్లి మాతృత్వానికి మాయని మచ్చగా నిలిచింది..

చెట్ల పొదల్లో పసికందును పడేసి వెళ్లిపోయిందా తల్లి.. చీమలు కుట్టడంతో గుక్కపట్టి ఏడ్చిన పాప.. చివరకు..

అప్పుడే పుట్టిన బిడ్డను ఎంతో ప్రేమగా దగ్గరకు తీసుకోవాల్సిన ఆ తల్లి మాతృత్వానికి మాయని మచ్చగా నిలిచింది.. ఆడ పిల్ల అనే కారణంతో రోజు వయసు కూడా లేని బిడ్డను చెట్ల పొదల్లో పడేసి వెళ్లిపోయింది.. అక్కడ చీమలు కుట్టడంతో ఆ చిన్నారి గుక్కపట్టి ఏడ్చింది.. మేకలు కాసుకునే కుర్రాళ్లు ఆ ఏడుపు విని పాపను రక్షించారు.. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 


వారణాసికి సమీపంలోని చందౌలీ పరిధిలోని మెహ్రుడా గ్రామ శివారులో మేకలు కాసుకునే కుర్రాళ్లకు మంగళవారం మధ్యాహ్నం పొదల నుంచి ఓ చిన్నారి ఏడుపు వినిపించింది. వెళ్లి చూస్తే చీమల మధ్య ఓ బాలిక కనిపించింది. చీమలు కుడుతుండడంతో ఆ చిన్నారి గుక్కపట్టి ఏడుస్తోంది. దీంతో వారు ఆ బాలికను రక్షించి గ్రామస్తులకు అప్పగించారు. వారు ఆమె శరీరాన్ని శుభ్రం చేసి చందౌలీ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. 


అప్పటికే ఆ పాప శరీరం చీమలు కుట్టడంతో బాగా వాచిపోయింది. దీంతో పోలీసులు ఆ చిన్నారిని ఆస్పత్రిలో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు. ఆ పాప మరొక్క గంట చీమల మధ్యే ఉండుంటే చనిపోయి ఉండేదని వైద్యులు చెబుతున్నారు. కాగా, ఆ చిన్నారిని అక్కడ పడేసిన మహిళ గురించి పోలీసులు అన్వేషణ సాగిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలోనే ఆమె ఈ దారుణానికి పాల్పడి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-08-05T16:20:27+05:30 IST