కొలువుదీరిన విక్రమసింఘే కేబినెట్‌

ABN , First Publish Date - 2022-05-15T08:19:29+05:30 IST

శ్రీలంక కొత్త ప్రధాని విక్రమ సింఘే ప్రభుత్వంలో నలుగురు మంత్రులు కొలువుదీరారు. అధికార పార్టీ ఎస్‌ఎల్‌పీపీ(శ్రీలంక పొదుజన పెరమున)కి చెందిన జీఎల్‌ పీరి్‌సను విదేశాంగ మంత్రిగా, దినేశ్‌ గునవర్దెనెను పబ్లిక్‌ అడ్మినిస్ర్టేషన్‌ మంత్రిగా, ప్రసన్న రణతుంగను

కొలువుదీరిన విక్రమసింఘే కేబినెట్‌

  • అధికార పార్టీ నుంచి నలుగురు మంత్రుల నియామకం
  • మద్దతుపై ప్రధాన ప్రతిపక్ష నేత ప్రేమదాస సానుకూలత
  • 65 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా ఎగుమతికి భారత్‌ హామీ
  • ఈనెలలోనే విక్రమసింఘే భారత పర్యటన
  • శ్రీలంకకు ఆర్థిక సాయంపై మోదీతో చర్చలు


కొలంబో, మే 14: శ్రీలంక కొత్త ప్రధాని విక్రమ సింఘే ప్రభుత్వంలో నలుగురు మంత్రులు కొలువుదీరారు. అధికార పార్టీ ఎస్‌ఎల్‌పీపీ(శ్రీలంక పొదుజన పెరమున)కి చెందిన జీఎల్‌ పీరి్‌సను విదేశాంగ మంత్రిగా, దినేశ్‌ గునవర్దెనెను పబ్లిక్‌ అడ్మినిస్ర్టేషన్‌ మంత్రిగా, ప్రసన్న రణతుంగను పట్టణాభివృద్ధి మంత్రిగా, కాంచన విజయశేఖరను విద్యుత్‌, ఇంధనశాఖల మంత్రిగా దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స శనివారం నియమించారు. కేబినెట్‌లోకి మొత్తం 20 మందిని మాత్రమే తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజకీయ సంక్షోభం నేపథ్యంలో యూఎన్‌పీ(యునెటెడ్‌ నేషనల్‌ పార్టీ) నేత విక్రమ సింఘే గురువారం నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. యూఎన్‌పీకి పార్లమెంటులో విక్రమ సింఘే ఏకైక సభ్యుడు. 225 మంది సభ్యులున్న పార్లమెంటులో బల నిరూపణకు కనీసం 113 మంది సభ్యుల మద్దతు అవసరం. దీంతో 114 మంది సభ్యులున్న ఎస్‌ఎల్‌పీపీ ఆయనకు మద్దతు ప్రకటించింది. మరోవైపు దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు తనకు మద్దతివ్వాలని కోరుతూ విక్రమ సింఘే రాసిన లేఖపై ప్రధాన ప్రతిపక్షం ఎస్‌జేబీ(సమగి జన బలవెగయ) నేత సాజిత్‌ ప్రేమదాస సానుకూలంగా స్పందించారు. ఆర్థిక సంక్షోభం నుంచి దేశం గట్టెక్కేందుకు బాధ్యతాయుత ప్రతిపక్షంగా ప్రభుత్వానికి మద్దతిస్తామని ప్రేమదాస హామీ ఇచ్చారు.


అయితే , రాజపక్స సోదరులు లేని ప్రభుత్వం కోసం తాము ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు. ఎస్‌జేబీకి పార్లమెంటులో 54 మంది సభ్యులున్నారు. అలాగే, జేవీపీ(జనతా విముక్తి పెరమున) పార్టీకి ముగ్గురు, తమిళ్‌ నేషనల్‌ అలయెన్స్‌కు 10 మంది, స్వతంత్రులు 42 మంది ఉన్నారు. మరోవైపు ఇంధనం, వంటగ్యాస్‌ కొరతపై దేశంలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అనేక రోడ్లను నిరసనకారులు మూసివేశారు. కాగా, శ్రీలంక నూతన ప్రధాని విక్రమ సింఘే ఈనెలలో భారతదేశంలో పర్యటించనున్నారు. ఆర్థిక సాయంపై ప్రధాని మోదీతోపాటు ఇతర ప్రతినిధులతో ఆయన చర్చలు జరపనున్నారని ప్రధాని కార్యాలయ వర్గాలు శనివారం స్థానిక మీడియాకు వెల్లడించాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన శ్రీలంకకు ఈ ఏడాది జనవరి నుంచి రూ.23,445 కోట్ల(3 బిలియన్‌ డాలర్లు)కుపైగా రుణాలు, క్రెడిట్‌ లైన్‌లు, క్రెడిట్‌ స్వాప్‌ సమకూర్చేందుకు భారత్‌ కట్టుబడి ఉంది. అత్యవసర సరుకులు, ఇంధనం దిగుమతి కోసం వచ్చే నెలలో మరో రూ.3,874 కోట్ల(500 మిలియన్‌ డాలర్లు) క్రెడిట్‌ లైన్‌ను భారత్‌ అందించే అవకాశం ఉంది. తమ దేశానికి ఆర్థిక సాయం అందిస్తున్నందుకు భారత ప్రధాని మోదీకి విక్రమ సింఘే ధన్యవాదాలు తెలిపారు. తన పాలనలో శ్రీలంక భారత్‌తో దగ్గరి సంబంధాలు కొనసాగిస్తుందన్నారు. మరోవైపు వరి సాగుకు అవాంతరాలు లేకుండా చూసేందుకు 65 వేల మెట్రిక్‌ టన్నుల యూరియాను శ్రీలంకకు సరఫరా చేస్తామని భారత్‌ హామీ ఇచ్చినట్టు ఢిల్లీలోని శ్రీలంక హైకమిషనర్‌ మిలింద మోరగొడ శనివారం వెల్లడించారు. భారత్‌ నుంచి ఎరువుల ఎగుమతిపై నిషేధం ఉన్నప్పటికీ, తమకు సాయం అందిస్తున్నందుకు భారత ఎరువుల శాఖ కార్యదర్శి రాజేశ్‌ కుమార్‌ చతుర్వేదికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.   

Updated Date - 2022-05-15T08:19:29+05:30 IST