కొత్త పార్లమెంటు భవనం గడువులోగానే పూర్తి

ABN , First Publish Date - 2021-09-17T08:42:59+05:30 IST

సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన నూతన పార్లమెంటు భవన నిర్మాణ పనులు సకాలంలో పూర్తవుతాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

కొత్త పార్లమెంటు భవనం గడువులోగానే పూర్తి

  • రక్షణ శాఖ కోసం కొత్త భవనాలు 
  • అవి చూశాక ‘సెంట్రల్‌ విస్టా’ 
  • విమర్శకుల నోళ్లు మూతపడతాయి
  • ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు
  • సెంట్రల్‌ విస్టా సకాలంలో పూర్తి: మోదీ


న్యూఢిల్లీ, సెప్టెంబరు 16: సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన నూతన పార్లమెంటు భవన నిర్మాణ పనులు సకాలంలో పూర్తవుతాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుపై వస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. కస్తూర్బా గాంధీ మార్గ్‌, ఆఫ్రికా అవెన్యూలో సుమారు 7 వేల మంది సిబ్బంది కోసం రక్షణ మంత్రిత్వ శాఖ నిర్మించిన కొత్త కార్యాలయ భవనాల సముదాయాన్ని గురువారం ప్రారంభిం చిన సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనం నిర్దేశిత గడువులోగా పూర్తవుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టును విమర్శిస్తున్న వారిపైనా మోదీ విమర్శలు గుప్పించారు. ‘ఈ ప్రాజెక్టును మొదలుపెట్టినపుడు అనేక మంది విమర్శించారు. దీన్నో డబ్బు దండగ ప్రాజెక్టు అన్నారు. అపోహలు, అసత్యాలను వ్యాప్తి చేయడమే వారిపని. సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు కింద ఇప్పుడు మనం ఏంచేస్తున్నామో దేశ ప్రజలంతా చూస్తున్నారు.


ఇక్కడ ప్రారంభించిన రక్షణ రంగ భవనాలను చూసిన తర్వాత వారి నోళ్లు తప్పకుండా మూతపడతాయి’ అన్నారు. మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించ తలపెట్టిన సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టును ప్రతిపక్ష కాంగ్రె్‌సతోపాటు ఇతర పార్టీలు తీవ్రస్థాయిలో విమర్శించాయి. దీన్ని ‘క్రిమినల్‌ వేస్టేజ్‌’గా అభివర్ణించాయి. రాష్ట్రపతి భవన్‌ నుంచి ఇండియా గేట్‌ వరకు విస్తరిస్తున్న సెంట్రల్‌ విస్టా అవెన్యూ పునర్నిర్మాణ పనులు మరో రెండున్నర నెలల్లో పూర్తవుతాయని, వచ్చే ఏడాది రిపబ్లిక్‌ డే వేడుకలకు ఇది సిద్ధంగా ఉంటుందని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి తెలిపారు.

Updated Date - 2021-09-17T08:42:59+05:30 IST