చిన్నారిని బలిగొన్న నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2021-02-27T06:08:00+05:30 IST

అధికారులు, కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం ఓ చిన్నారి ప్రాణాన్ని బలిగొంది. కనీస ప్రమాణాలు లేకుండా అంగన్‌వాడీ కేంద్రానికి నిర్మించిన ప్రహారీ గోడ కూలిపోవడంతో నాలుగేళ్ల బాలుడి ఊపిరి ఆగిపోయింది.

చిన్నారిని బలిగొన్న నిర్లక్ష్యం
దుంగల సాయి దీక్షిత్‌ (ఫైల్‌)

అంగన్‌వాడీ ప్రహారీ గోడ కూలి బాలుడి మృతి

రోలుగుంట మండలం ఎన్‌.కొత్తూరులో ఘటన

కాంట్రాక్టర్‌, అధికారుల నిర్లక్ష్య ఫలితం..

కనీస ప్రమాణాలు లేకుండా గోడ నిర్మాణం

శోకసంద్రంలో కుటుంబ సభ్యులు


రోలుగుంట, ఫిబ్రవరి 26: అధికారులు, కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం ఓ చిన్నారి ప్రాణాన్ని బలిగొంది. కనీస ప్రమాణాలు లేకుండా అంగన్‌వాడీ కేంద్రానికి నిర్మించిన ప్రహారీ గోడ కూలిపోవడంతో నాలుగేళ్ల బాలుడి ఊపిరి ఆగిపోయింది. ఈ హృదయవిదారక సంఘటన విశాఖపట్నం జిల్లా రోలుగుంట మండలం ఎన్‌.కొత్తూరు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. 


ఎన్‌.కొత్తూరు గ్రామానికి చెందిన దుంగల వెంకటలక్ష్మి, ఎర్రంనాయుడులకు ఇద్దరు సంతానం. వారి నాలుగేళ్ల కుమారుడు సాయిదీక్షిత్‌ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో చదువుతున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లాడు. తోటి పిల్లలతో అక్కడే ఆడుకుంటున్నాడు. చిన్నారులను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అంగన్‌వాడీ కార్యకర్త రెడ్డి లక్ష్మి, సహాయకురాలు రాజాన రమణమ్మ సొంత పనుల్లో ఉండిపోవడంతో అక్కడ లేరు. సాయిదీక్షిత్‌ ఆడుకుంటూ అంగన్‌వాడీ కేంద్రం ప్రహారీ గోడ పక్కకు వెళ్లగా, అదే సమయంలో ప్రమాదశాత్తు గోడ ఒక్కసారిగా కూలిపోయింది.  దీంతో సాయిదీక్షిత్‌ ఊపిరి ఆడక అక్కడిక్కడే మృతి చెందాడు. తల్లి వెంకటలక్ష్మి బంధువుల సాయంతో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో కన్న పేగు తల్లడిల్లిపోయింది. కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పీడీ కనకమహాలక్ష్మి, సీడీపీవో రమణి గ్రామానికి చేరుకుని ఘటనకు కారణాలను తెలుసుకున్నారు.


గచ్చుపైనే నిర్మించిన గోడ

కూలిపోయిన అంగన్‌వాడీ ప్రహారీ గోడను చూస్తే అధికారులు, కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎటువంటి బేస్‌మెంట్‌ లేకుండా.. గోడలకు జాయింట్‌ చేకుండా.. కనీస నాణ్యతాప్రమాణాలు పాటించకుండా గచ్చుపైనే తూతూమంత్రంగా నిలబెట్టినట్టు నిర్మించిన ఈ గోడ ప్రమాదకరంగా కనిపిస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. అదే చిన్నారి ప్రాణం మీదకు తెచ్చిందని సాయిదీక్షిత్‌ బంధువులు, గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే అంగన్‌వాడీ కార్యకర్త, సహాయకురాలు నిర్లక్ష్యం కూడా ప్రమాదానికి కారణంగా వారు చెబుతున్నారు.





Updated Date - 2021-02-27T06:08:00+05:30 IST