Advertisement
Advertisement
Abn logo
Advertisement

మధ్యే మార్గం

నీట్పీజీ కౌన్సిలింగ్ నేటి నుంచి ఆరంభం కాబోతున్నది. కరోనామీద దేశం చేస్తున్న పోరాటానికి కౌన్సిలింగ్ ఆరంభంతో మరింత బలం చేకూరనుందని కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. కౌన్సిలింగ్ కోసం ఎంతోకాలంగా పోరాడుతున్న వైద్యవిద్యార్థులు ఇంతకాలం మొత్తుకున్నది కూడా అదే. 2021–22 సంవత్సరానికి నీట్ పీజీ కౌన్సిలింగ్ నిర్వహించుకోమంటూ సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతించి దీర్ఘకాల అనిశ్చితికి తెరదించింది. ఆల్ ఇండియా కోటాలో ఓబీసీలకు 27శాతం, ఈడబ్ల్యుఎస్‌లకు 10శాతం రిజర్వేషన్ల చెల్లుబాటును సమర్థించడం ద్వారా సుప్రీంకోర్టు కౌన్సిలింగ్‌కు మార్గాన్ని సుగమం చేసింది.


కరోనా మనలను మళ్ళీ మళ్ళీ కమ్మేస్తున్న కాలంలో, జూనియర్ డాక్టర్ల అవసరం ఎంతో ఉండగా, కౌన్సిలింగ్ అనేక నెలలుగా నిలిచిపోవడం బాధాకరం. కౌన్సిలింగ్ వెంటనే ఆరంభం కావడానికి వీలుగా సుప్రీంకోర్టు ఓబీసీలకు కేంద్రం ఆల్ ఇండియా కోటాలో ప్రకటించిన 27శాతం రిజర్వేషన్లను సమర్థించింది. ఈ అంశంలో ఇక ఎటువంటి చర్చకూ తావులేదన్నది. ఇక, రూ.8 లక్షల ఆదాయపరిమితి సహా ఈడబ్ల్యు ఎస్ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై మాత్రం తుదివాదనలను విని మార్చి మూడోవారంలో ఏ నిర్ణయాన్నీ ప్రకటించబోతున్నట్టు న్యాయమూర్తులు మధ్యంతర ఉత్తర్వుల్లో చెప్పారు. ఓబీసీ రిజర్వేషన్ల చట్టబద్ధతను పూర్తిగా సమర్థించిన న్యాయస్థానం, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల 10శాతం రిజర్వేషన్ అంశాన్ని మాత్రం మార్చిలో పూర్తిగా తేలుస్తానన్నది. అప్పుడు చెప్పబోయే తీర్పు భవిష్యత్తుకే కాదు, ఇప్పటి అడ్మిషన్లకు కూడా వర్తిస్తుంది. నీట్ పీజీ కౌన్సిలింగ్ వ్యవహరాన్ని సత్వరమే ముందుకు తీసుకుపోవలసి రావడం తన నిర్ణయానికి కారణంగా న్యాయస్థానం చూపుతోంది.


పలుమార్లు న్యాయస్థానంలో వాదోపవాదాలు జరిగి, నిపుణుల కమిటీ ఒకటి ఏర్పడిన తరువాత కూడా పదిశాతం ఈడబ్ల్యుఎస్ కోటా వివాదాన్ని అమీతుమీ తేల్చలేకపోవడం విచిత్రమే. నీట్ జాతీయస్థాయి కోటాలో ఓబీసీ 27శాతం, ఈడబ్ల్యుఎస్ 10శాతం రిజర్వేషన్లను 2021–22 విద్యాసంవత్సరం నుంచే అమలులోకి తెస్తూ కేంద్రప్రభుత్వం గత ఏడాది జులై 29న నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. తమ నిర్ణయం వల్ల ఎంబీబీఎస్‌లో ఏటా 1500మంది, పీజీలో 2500 మంది ఓబీసీ విద్యార్థులకు ప్రయోజనం కలుగు


తుందని ప్రభుత్వం పేర్కొంది. అలాగే, ఈడబ్ల్యుఎస్ విభాగంలో 500మంది ఎంబీబీఎస్, పీజీలో వెయ్యిమందికి అవకాశం లభిస్తుందని ప్రకటించింది. తమ ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రక నిర్ణయంతో ఏటా వేలాదిమంది యువతీయువకులకు అభివృద్ధి అవకాశాలు దక్కడమే కాక, దేశంలో సామాజిక న్యాయం కొత్తరూపు సంతరించుకుంటుందని మోదీ ట్వీట్ చేశారు. ఈ నోటిఫికేషన్ ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో గత ఏడాది అక్టోబరు చివర్లోనే ప్రభుత్వం అడ్మిషన్ ప్రక్రియను నిలిపివేసింది. న్యాయస్థానంలో వాదప్రతివాదాలు సాగుతున్న సందర్భంలో ఈడబ్ల్యుఎస్ కోటాలో వార్షికాదాయపరిమితిని 8 లక్షల రూపాయలుగా నిర్ణయించడంపైన న్యాయస్థానం కఠిన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఓబీసీల రిజర్వేషన్ అర్హతను నిర్థారించే ఆర్థికపరిమితినే ఈడబ్ల్యుఎస్‌కూ వర్తింపచేయడమేమిటని న్యాయమూర్తులు ఆశ్చర్యపోయారు. దీనితో, విపరీతమైన మేథోమథనం తరువాతే ఈ పరిమితిని నిర్థారించామంటూ అక్టోబరు 26న ప్రభుత్వం ఒక అఫిడవిట్‌లో నిర్ణయాన్ని సమర్థించుకుంది. కానీ, నెలరోజుల తరువాత దీనిని పునఃపరిశీలించబోతున్నామనీ, నాలుగువారాలు సమయం ఇవ్వాలనీ న్యాయస్థానాన్ని కోరింది. నవంబరు 30న ఏర్పడిన పాండేకమిటీ డిసెంబరు 31న ఇచ్చిన రిపోర్టులో రూ.8 లక్షల వార్షికాదాయాన్ని ఎత్తిపట్టి, అర్హత నిర్థారణల్లో కొన్ని సవరణలు చేసింది. ఈ నీట్ ప్రవేశాలను 2019 జనవరి నోటిఫికేషన్‌లో నిర్థారించిన ఆదాయపరిమితికి లోబడి, 2021 జులై నోటిఫికేషన్ ప్రకారమే కానివ్వాలని పాండే పానెల్‌తో పాటు, న్యాయస్థానంలో దానిని సమర్థించిన ప్రభుత్వం కూడా కోరింది. వైద్యవిద్యార్థుల ఉద్యమాలు, కరోనా కష్టాలు తరుముకొచ్చి ప్రభుత్వం విజ్ఞప్తిమేరకు న్యాయస్థానం తాత్కాలికంగానైనా ఈ వివాదాన్ని గాడినపెట్టినందుకు సంతోషించాల్సిందే. కానీ, రూ.8 లక్షల వార్షికాదాయపరిమితిని ముందుగా సమర్థించుకున్న ప్రభుత్వం ఆ తరువాత సమీక్షిస్తానని ఎందుకు అన్నదో, ఒక కమిటీ వేసి అనేక నెలలు గడిచాక ఇప్పుడు అదే పరిమితిని ఎందుకు వెనకేసుకొచ్చిందో అర్థంకాదు.

Advertisement
Advertisement