మాటలకే కఠినం...

ABN , First Publish Date - 2020-04-10T05:52:45+05:30 IST

రాష్ట్రంలోనే గరిష్ఠంగా కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు జిల్లాలో నమోదయ్యాయి. రెండు రోజుల్లో 70 పాజిటివ్‌ కేసులు

మాటలకే కఠినం...

ప్రధాన రహదారులు మాత్రమే ఖాళీ

కాలనీల వీధుల్లో జన సంచారం

కిరాణం దుకాణాల వద్ద రద్దీ

పోలీసులు వారిస్తున్నా వినని వైనం


కర్నూలు, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోనే గరిష్ఠంగా కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు జిల్లాలో నమోదయ్యాయి. రెండు రోజుల్లో 70 పాజిటివ్‌ కేసులు నమోదైనది దక్షిణ భారతదేశంలో ఒక్క కర్నూలు జిల్లాలోనే. ఇదొక విపత్కర పరిస్థితి. చాలా అప్రమత్తంగా ఉంటే తప్ప ఈ స్థితిని అధిగమించడం సాధ్యం కాదు. కానీ ఆ స్థాయిలో జిల్లా యంత్రాంగం, పోలీసులు చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.


పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాలను కంటెయిన్‌మెంట్‌, బఫర్‌ జోన్లుగా అధికారులు ప్రకటించారు. ఇక్కడ లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తామని, ప్రత్యేక పారిశుధ్య పనులు చేపడతామని ప్రకటించారు. కానీ ఈ ప్రాంతాల్లో ప్రజలు యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నారు. అంతర్గత వీధుల్లో గుంపులు గుంపులుగా కనిపిస్తున్నారు. కరోనా వ్యాపించకుండా, ఇళ్లలోనే ఉండి సహకరించాలని ప్రభుత్వం పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే జిల్లాలో వైరస్‌ వ్యాప్తిని అరికట్టడం ఇప్పట్లో సాధ్యపడదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


వీధుల్లో గుంపులు

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలను ఇళ్లకే పరిమితం చేయడం ముఖ్యం. ఇందుకోసం నగరం నలుమూలలా, ప్రతి వీధిలోనూ పోలీసులు, అధికారులు పర్యటించాలి. అవసరం మేరకు సిబ్బందిని ఆ ప్రాంతాల్లో విధుల్లో ఉంచాలి. కానీ పోలీసులు ప్రధాన రహదారుల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. దీంతో మెయిన్‌ రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నా వీధులు కిటకిటలాడుతున్నాయి. ప్రజలు ఆయా కాలనీల వీధుల్లో తిరుగుతున్నారు.


వన్‌టౌన్‌ ఏరియాలోని చిత్తారి వీధి, బుధవార పేట, షరీన్‌ నగర్‌ తదితర ప్రాంతాల్లో మూసేసిన దుకాణాలు, రోడ్లపై ముచ్చట్లు పెడుతున్నారు. కిరాణ దుకాణాల వద్ద భౌతిక దూరం మాటే లేదు. దుకాణదారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు.  ఇరుకుగా ఉండే వీధి దుకాణాల వద్ద గుంపులుగా చేరి సరుకుల కోసం ఎగబడుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో పోలీసులు కర్రలతో ఏర్పాటు చేసిన బారికేడ్లను విరగ్గొట్టి బయటికి వస్తున్నారు. 


Updated Date - 2020-04-10T05:52:45+05:30 IST