నష్టం రూ.1,320.67 కోట్లు

ABN , First Publish Date - 2021-11-28T05:49:57+05:30 IST

జవాద్‌ తుఫాను వల్ల జిల్లాలో సంభవించిన భారీ వర్షాలు, వరదలు, ప్రభుత్వ, ప్రజల ఆస్తులకు ఏర్పడిన నష్టాలు, నష్టపరిహార అంచనా వేసేందుకు శనివారం కేంద్రబృందం జిల్లాకు వచ్చింది.

నష్టం రూ.1,320.67 కోట్లు
పులపత్తూరులో వరద విధ్వంసాన్ని పరిశీలిస్తున్న కేంద్ర బృంద సభ్యులు






జిల్లాను ఆదుకోండి

కేంద్ర కమిటీకి వివరించిన కలెక్టర్‌ 

తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన కేంద్ర కమిటీ సభ్యులు 


‘‘జవాద్‌ తుఫాను జిల్లాకు తీవ్ర నష్టం చేకూర్చింది. తుఫాను ప్రభావంతో జిల్లా అన్ని విధాలా నష్టపోయింది. సుమారు రూ.1320.67 కోట్ల  నష్టం వాటిల్లింది. విశాల హృదయంతో జిల్లాను ఆదుకోండి’’ అని కలెక్టర్‌ వి.విజయరామరాజు కేంద్ర అధ్యయన బృందానికి నివేదించారు. 


కడప, నవంబరు 27(ఆంద్రజ్యోతి): జవాద్‌ తుఫాను వల్ల జిల్లాలో సంభవించిన భారీ వర్షాలు, వరదలు, ప్రభుత్వ, ప్రజల ఆస్తులకు ఏర్పడిన నష్టాలు, నష్టపరిహార అంచనా వేసేందుకు శనివారం కేంద్రబృందం జిల్లాకు వచ్చింది. వీరు రాజంపేటలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం కడపలోని ఆర్‌అండ్‌బీ అతిఽథి గృహానికి చేరుకున్నారు. ఇక్కడ పవర్‌పాయింట్‌ ద్వారా కేంద్ర బృందానికి జిల్లాలో జరిగిన వరద నష్టాన్ని కలెక్టర్‌ వివరించారు.

నవంబరు 16 నుండి 19 వరకు నాలుగు రోజుల్లో.. దాదాపు 142.7 మి.మీ మేర వర్షపాతం నమోదైందన్నారు. భారీ వర్షాలతో అన్ని ప్రాజెక్టులకు సామర్థ్యానికి మించి నీటి ప్రవాహం వచ్చిందన్నారు. ఊహించని రీతిలో దాదాపు 3,20,000 క్యూసెక్కుల వరద ప్రవాహంతో అన్నమయ్య  ప్రాజెక్టు దెబ్బతిని కుడి వైపు ఎర్త్‌ డ్యామ్‌ కట్ట తెగిపోవడంతో ఆ వరద లోతట్టు ప్రాంతాలను ముంచెత్తిందని వివరించారు. నవంబరు మాసంలో 1 నుంచి 19 వరకు సాధారణ వర్షపాతం 78.5 మి.మీ కాగా 304.6 మి.మీ మేర వర్షం కురిసి 288.7 శాతం మేర అధిక వర్షపాతం నమోదు అయిందన్నారు. ఈ భారీ వర్షంతో జిల్లాలోని అన్ని నదులు, వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంగి ప్రవహించాయన్నారు. కొన్ని చోట్ల బ్రీచెస్‌ ఏర్పడ్డాయన్నారు. అక్టోబర్‌, నవంబర్‌ మాసాలలో సాధారణం 221.2 మి.మీ కాగా 470.5 మి.మీ మేర వర్షం కురిసిందని, నవంబరు 26వ తేదీ వరకు సాధారణం 89.3 మి.మీ కాగా 323.7 మి.మీ. వర్షపాతం నమోదు అయిందని వివరించారు. అంతేకాకుండా ఈ ఏడాది జూన 1 నుండి ఇప్పటి వరకు జిల్లా సాధారణం 614.7 మి.మీ కాగా 947.6 మి.మీ మేర వర్షం పడిందని, దాదాపు 54.2 శాతం అధిక వర్షపాతం కురిసిందన్నారు. అత్యధిక వర్షపాతం కారణంగా జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల నష్టాలు ఏర్పడ్డాయని, ప్రధానంగా రాజంపేట నియోజకవర్గంలో బ్రిడ్జీలు, రహదారులు, పంట పొలాలు, ప్రాణ, పశు నష్టం జరిగిందని కలెక్టర్‌ వివరించారు.


దెబ్బతిన్న నీటి ప్రాజెక్టులు 

జిల్లాలో అన్నమయ్య, పింఛా ప్రాజెక్టు, బాహుదా, మాండవ్య, బుగ్గవంక... మొదలైన చిన్న, మధ్య తరహా ప్రాజెక్టుల పైన కూడా జవాద్‌ ప్రభావం పడిందన్నారు. 

- అన్నమయ్య ప్రాజెక్టు : నవంబరు 18న ఉదయం నుంచి రాజంపేటలో వర్షాలు ప్రారంభమయ్యాయి. చిత్తూరు జిల్లానుంచి అన్నమయ్య ప్రాజెక్టుకు, రాయచోటి ప్రాంతాలలో వరద ప్రవాహం కొనసాగింది. మొదట్లో దాదాపు 9,800 క్యూసెక్కుల ఇనఫ్లో వచ్చింది. 18న సాయంత్రం 6.30 గంటల వరకు ఇనఫ్లో క్రమంగా 42,000 క్యూసెక్కులకు పెరిగింది. 19న రెండు గంటల వ్యవధిలో ఉదయం 6.30 గంటలకు ఇనఫ్లో అకస్మాత్తుగా 3,20,000 క్యూసెక్కులకు పెరిగింది. ఈ సమయంలో రిజర్వాయర్‌ స్థాయి కూడా క్షీణించింది. ఆగకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాలలో చెరువులు, బ్రీచ కావడం, ఎగువన ఉన్న పింఛా ప్రాజెక్టు, బాహుదా మరియు మాండవ్యలో ఇనఫ్లో పెరగడంతో 3,20,000 వరకు ఆకస్మిక ఇనఫ్లోకు కారణమయ్యాయి. అన్నమయ్య సాగర్‌ గేట్లను వాటి పూర్తి సామర్థ్యం మేరకు ఎత్తి 1,46,056 క్యూసెక్కులను వదిలిపెట్టారు. స్పిల్‌వే సామర్థ్యంతో పోలిస్తే... రిజర్వాయర్‌ ఎగువ నుంచి వచ్చిన అధిక ఇనఫ్లో కారణంగా 19న ఉదయం ప్రాజెక్టు మట్టికట్ట గోడను అధిగమించి 01.00 మీటర్ల ఎత్తు వరకు నీరు ప్రవహించింది. దీంతో ఒక గంట వ్యవధిలో అన్నమయ్య ప్రాజెక్టు ఆనకట్ట మట్టిగట్టు పూర్తిగా కోతకు గురై కొట్టుకుపోయింది. డ్యామ్‌ స్పిల్‌ వే భాగం మాత్రం చెక్కుచెదరకుండా ఉందని కలెక్టర్‌ వివరించారు. 

- పింఛా ప్రాజెక్టు : సామర్థ్యం 0.327 టీఎంసీలు కాగా.. తుఫాను ప్రభావంతో 16 నుంచి వచ్చిన వర్షాలతో 18వ తేదీన ఊహించని విధంగా 1,35,000 క్యూసెక్కులు, 19వ తేదీన 1,27,678 క్యూసెక్కుల భారీ ఇనఫ్లో వచ్చింది. 48,000 క్యూసెక్కులు మాత్రమే వదలగలిగిన సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టుకు అధిక ఇనఫ్లో కారణంగా తాత్కాలిక రింగ్‌ బండ్‌ పై క్రమక్రమంగా కొట్టుకుపోయింది. ప్రాజెక్టుకు శాశ్వత పునరుద్ధరణ పనులు చేపట్టామని వివరించారు. 

- బుగ్గవంక ప్రాజెక్టు : 0.506 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న బుగ్గవంక ప్రాజెక్టులో 20వ తేదీకి సామర్థ్యానికి మించి 11,500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరడంతో 4 గేట్లు ఎత్తి నీటిని దిగువ ప్రాంతాలకు వదిలారు. కడప నగరం గుండా నాలుగు కి.మీ మేర బుగ్గవంక రక్షణ గోడ ఉంది. ఈ కట్టడం రక్షణ గోడల మధ్య అక్కడక్కడ ఉన్న 22 గ్యాప్‌లలో వరద నీరు బయటకి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పినా, నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బుగ్గవంకకు సంబంధించి రక్షణ గోడ గ్యాప్స్‌ ఉన్న ప్రాంతాలలో సేఫ్టీ వాల్‌ త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు ప్రభుత్వం ద్వారా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 

- వెలిగల్లు ప్రాజెక్టు : 4.640 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న వెలిగల్లు ప్రాజెక్టులో 4.4 టీఎంసీల నీరు స్టోరేజ్‌ ఉండగానే 20వ తేదీన సామర్థ్యానికి మించి 77,300 క్యూసెక్కుల ఇనఫ్లో చేరి రిటర్న్‌ వాల్‌ దెబ్బతినడంతో గేటు ఎత్తి నీటిని దిగువ ప్రాంతాలకు వదలాల్సి వచ్చింది. ప్రాజెక్టులో 3 స్పిల్‌ వే గేట్లు పనిచేస్తున్నాయి. దెబ్బతిన్న రిటర్న్‌ వాల్‌కు శాశ్వత పునరుద్ధరణ చేయాల్సిన అవసరం ఉంది.

- జిల్లాలో మొత్తం 182 యూనిట్ల మైనర్‌ ఇరిగేషన సోర్సెస్‌ దెబ్బతినడంతో నష్టం ఏర్పడింది. అలాగే 13 మధ్య తరహా, 6 ప్రాజెక్టులకు నష్టం వాటిల్లింది.

- 371 గామీణ నీటి సరఫరా సంబంధిత పనులు, 101 పంపింగ్‌ మిషన్లు, 96 ఇంటెక్‌ స్ట్రక్చర్లు, 174 కి.మీ మేర పైపులైన్లు దెబ్బతిన్నాయి. 

- మున్సిపల్‌ అడ్మినిస్ర్టేషన ప్రజారోగ్య విభాగానికి సంబంధించి జిల్లాలో 9 యూఎల్‌బీలు ప్రభావితమయ్యాయి. 7.715 కి.మీ పొడవైన రోడ్లు, 4.82 కి.మీ పొడవు ఓపెన డ్రైన్లు, 9.545 కి.మీ పొడవు నీటి సరఫరా పైపులైన్లు దెబ్బతిన్నాయి. 

- ఏపీఎ్‌సపీడీసీఎల్‌కు సంబంధించి 36 సబ్‌ స్టేషన్లు, 14 ఫీడర్లు, 33 కేవీ స్తంభాలు 125 దెబ్బతిన్నాయి. తద్వారా 231 గ్రామాల్లో విద్యుత సరఫరా నిలిచిపోయింది.


వ్యవసాయ, ఉద్యాన పంటలపై ప్రభావం..

జిల్లాలోని మొత్తం 51 మండలాల్లో.. వ్యవసాయ, ఉద్యాన పంటలపై జవాద్‌ తుఫాను ప్రభావాన్ని చూపిందని ఇందులో 1,42,949 హెక్టార్లలో ఖరీఫ్‌, రబీ వ్యవసాయ పంటలు, 17,704 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు కలెక్టర్‌ కేంద్ర కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. వ్యవసాయం, ఉద్యాన పంటలలో ప్రభుత్వం కల్పించే రూ.203.40 కోట్ల పెట్టుబడి రాయితీ మొత్తాన్ని సైతం రైతులు కోల్పోయారన్నారు.


పశునష్టం 

జిల్లాలో 1,238 మంది రైతులకు సంబంధించి రూ.171.75 కోట్ల విలువ చేసే పశుసంపద కోల్పోయారన్నారు. ఇందులో అత్యధికంగా 9,638 పౌల్ర్టీ, 2,532 గొర్రెలు, మేకలు, 1382 పెద్ద పశువులు మృత్యువాత పడ్డాయని వివరించారు.


రూ.19 కోట్ల ఖర్చుతో సహాయ కార్యక్రమాలు

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వరద ప్రభావిత ప్రాంతాలలో ఒక్కొక్కరికి రూ.2000 అందజేశామని కలెక్టర్‌ వివరించారు. వరద ప్రవాహంలో మృతి చెందిన 29 మందికి ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు ఆర్థిక సాయం ఇచ్చామన్నారు. ఈ భారీ వర్షాలు, వరదలకు గురైన 7,337 కుటుంబాలకు చెందిన 16,700 మందిని పునరావాస కేంద్రాలలో ఉంచి రూ.19 కోట్ల ఖర్చుతో సహాయ కార్యక్రమాలు, రూ.ఒకకోటి మేర నిత్యావసరాలను అందజేశామన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో రోడ్డు కనెక్టివిటీ, విద్యుత సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, వైద్య శిబిరాల ఏర్పాటు, ప్రాణ, పశు, ఆస్తి నష్టం గణాంకాల సేకరణకు జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన వేగవంతంగా చర్యలు చేపట్టిందని వివరించారు. జవాద్‌ తుఫాను ప్రభావంతో జిల్లాలో ఏర్పడిన నష్టంపై క్షేత్రస్థాయిలో పారదర్శకంగా గణాంకాల అంచనా ప్రకారరం నివేదికలు సమర్పించామని, జిల్లా తీవ్రంగా నష్టపోయిందని.. విశాల హృదయంతో జిల్లాను ఆదుకోవాలని కలెక్టర్‌ కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు.


అధికారుల సేవలను అభినందించిన కేంద్రబృందం

తుఫాను సమయంలో కలెక్టర్‌ వి.విజయరామరాజు ఆధ్వర్యంలో చేపట్టిన తక్షణ సహాయక చర్యలను కేంద్ర బృందం అభినందించింది. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడటంలో అధికారుల స్పందన, యుద్ధప్రాతిపదికన చేపట్టిన సహాయక చర్యలను వారు ప్రశంసించారు. జిల్లాలో జవాద్‌ తుఫాన వల్ల ఏర్పడిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో తాము కూడా స్వయంగా పరిశీలించామని, పవర్‌ పాయింట్‌ ప్రజంటేషనలో అన్ని అంశాలను పొందుపరిచారని, నష్టం జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. నష్టం అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని కేంద్ర బృందం సభ్యులు పేర్కొన్నారు. కాగా.. సమావేశానికి ముందు జవాద్‌ తుఫాన వల్ల జిల్లాలో వివిధ శాఖలలో జరిగిన నష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషనను కేంద్ర అధ్యయన బృందం పరిశీలించింది. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.గౌతమి, ఆర్డీవో పి.ధర్మచంద్రారెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. 


శాఖల వారీగా ఏర్పడిన నష్టం రూ.లక్షల్లో

వ్యవసాయ రంగంలో - 23,102.99

ఉద్యానవనం - 11,022.00

దెబ్బతిన్న గృహాలు - 680.65

పశు నష్టం - 171.75

ఆర్‌ అండ్‌ బీ రహదారులు - 53,795.00

జాతీయ రహదారులు ( బ్రిడ్జిలు) - 7,900.00

పంచాయతీ రాజ్‌ - 10,485.86

మున్సిపల్‌ అడ్మినిస్ర్టేషన (తాత్కాలిక పునరుద్ధరణకు) - 789.80

చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు (తాత్కాలిక, శాశ్వత పునరుద్ధరణకు) - 7,831.30

భారీ ప్రాజెక్టులు మరియు ఇన్ర్ఫాస్ట్రక్చర్‌ ( తాత్కాలిక, శాశ్వత పునరుద్ధరణకు) - 2,395.80

జలవనరులు - 9,945.30

రూరల్‌ వాటర్‌ సప్లై - 2,834.38

వైద్య, ఆరోగ్యం - 44.00

ఏపీఎ్‌సపీడీసీఎల్‌ - 1,068.50

ఆస్తులకు కలిగిన తాత్కాలిక నష్టం అంచనా - 13,308.87

శాశ్వతంగా ఏర్పడిన నష్టం అంచనా - 1,19,041.99

మొత్తం నష్టం అంచనా - 1,32,067.33 లక్షలు 

Updated Date - 2021-11-28T05:49:57+05:30 IST