ఇక మెరుగైన వైద్యం

ABN , First Publish Date - 2022-05-27T05:21:47+05:30 IST

ఇక మెరుగైన వైద్యం

ఇక మెరుగైన వైద్యం
మెదక్‌లో ప్రారంభానికి సిద్ధమైన మాతా శిశు సంరక్షణ కేంద్రం

మాతా శిశు సంరక్షణకు మంచి రోజులు

మెదక్‌లో సిద్ధమైన ‘ఎంసీహెచ్‌’

100 పడకలతో పాటు, సకల సౌకర్యాలు

మెదక్‌తో పాటు, కామారెడ్డి జిల్లావాసులకు అనుకూలం

నేడు ఆసుపత్రిని ప్రారంభించనున్న మంత్రిహరీశ్‌రావు


ఆంధ్రజ్యోతిప్రతినిధి, మెదక్‌, మే 26: పేదలకు మెరుగైన ప్రసూతి సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మెదక్‌లో నిర్మించిన ఎంసీహెచ్‌ దవాఖాన ప్రారంభానికి సిద్ధమైంది. ఎంసీహెచ్‌లో కార్పొరేట్‌స్థాయి వైద్యం అందించేందుకు సకల సౌకర్యాలు కల్పించారు. శుక్రవారం రాష్ట్ర ఆర్థిక, వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లూ పూర్తిచేశారు. 

  మెదక్‌ పట్టణ పరిధిలోని పిల్లికొట్టాల్‌ శివారులో ఐదు ఎకరాల స్థలంలో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆధునిక హంగులతో ఆసుపత్రిని నిర్మించారు. 2018లో తెలంగాణ రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ(టీఎంఐడీసీ) ఆధ్వర్యంలో ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అప్పటి వైద్యఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 100 పడకల సామర్థ్యంతో నిర్మించిన ఆసుపత్రికి రూ.17 కోట్లు ఖర్చు చేశారు. 150కి పైగా గదులు, అత్యాధునిక వసతులతో ఎంసీహెచ్‌ రూపుదిద్దుకుంది. ఆసుపత్రి దగ్గర సీసీ రోడ్డు కోసం రూ.1.20 కోట్లు, భవనం చుట్టు ప్రహరీకి మరో రూ.80 లక్షలను ప్రభుత్వం మంజూరీ చేసింది. మూడు ఆపరేషన్‌ థియేటర్లు, నెలలోపు ఉన్న చిన్నారులకు వైద్యం అందించేందుకు (ఎన్‌ఎ్‌ససీయూ), పరిస్థితి విషమంగా ఉండే గర్భిణులకు (హెచ్‌డీయూనిట్‌), చిన్న పిల్లలకు వైద్యం అందించేందుకు (పీఐసీయూ), 10 పడకల ఫొటోథెరఫి, పది పడకల వార్మర్స్‌, స్కానింగ్‌, ఎక్స్‌ రే, టీకాలు, ఈసీజీ, అత్యవసర రక్తనిధి, కేసీఆర్‌ కిట్‌, ఆరోగ్యశ్రీలకు ప్రత్యేక గదులు కేటాయించారు. ప్రత్యేకంగా ఎమర్జెన్సీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. 


రెండు జిల్లాల ప్రజలకు..అందుబాటులోకి వైద్యసేవలు

మెదక్‌ శివారులోని పిల్లికొట్టాల్‌ దగ్గర నిర్మించిన ఎంసీహెచ్‌ ఆసుపత్రి వల్ల రెండు జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. మెదక్‌ జిల్లాతో పాటు పక్కనే ఉన్న కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట మండలాల ప్రజలకు కార్పొరేట్‌ స్థాయిలో వైద్య సేవలు అందనున్నాయి. ప్రసూతి సేవలను మెరుగు పర్చడం, శిశువుల సంరక్షణను బలోపేతం చేయడం ఎంసీహెచ్‌ లక్ష్యం. ఇక అమ్మఒడి, కేసీఆర్‌ కిట్‌ వంటి పథకాలను అమలు చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీల సంఖ్య పెరిగే విధంగా ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం మెదక్‌లోని జిల్లా ఆసుపత్రిలో యేటా 3 వేలకు పైగా డెలివరీలు చేస్తున్నారు. అయితే జిల్లా ఆసుపత్రిలో సరైన వసతి, సౌకర్యాలు లేక గర్భిణులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 


వైద్యులు, సిబ్బంది వస్తేనే..!

అన్ని హంగులతో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ, పూర్తిస్థాయిలో వైద్యులు, సిబ్బంది నియామకం జరిగితేనే పూర్తి స్థాయిలో సేవలు అందుతాయి. ఆసుపత్రి స్థాయి, డెలివరీల సంఖ్యలకు అనుగుణంగా సరిపడినంత మంది గైనకాలజి్‌స్టలు, పీడీయాట్రిషియన్లు, తదితర విభాగాలకు సంబందించిన డాక్టర్లతో పాటు, పారామెడికల్‌ సిబ్బంది నియామకాలు చేపట్టాలి. పేదలకు ప్రయోజనం చేకూరినప్పుడే ప్రభుత్వ లక్ష్యం కూడా నెరవేరుతుంది. 

Updated Date - 2022-05-27T05:21:47+05:30 IST