ఉద్యోగుల లైన్‌ క్లియర్‌!

ABN , First Publish Date - 2021-01-27T06:43:02+05:30 IST

ఉద్యోగులు పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు లైన్‌ క్లియర్‌ అయింది.

ఉద్యోగుల లైన్‌ క్లియర్‌!

ఎన్నికల విధులకు సిద్ధమేనని నేతల సంకేతాలు

ఉద్యోగ సంఘాల నేతలతో సీఎస్‌ సుదీర్ఘ చర్చలు 

కరోనా వ్యాక్సిన్‌, పీపీఈ కిట్ల కోసం నేతల పట్టు 

మృతి చెందితే రూ.50 లక్షల పరిహారానికి డిమాండ్‌ 

50 ఏళ్లకు పైబడిన వారిని మినహాయించాలని విజ్ఞప్తి 


ఉద్యోగులు పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు లైన్‌ క్లియర్‌ అయింది. రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ దాస్‌ నగరంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు చర్చలు సాగించటంతో ఉద్యోగ సంఘాలు మెత్తబడ్డాయి. చర్చల అనంతరం జేఏసీ నేతలు ఎన్నికలకు తాము సిద్ధంగానే ఉన్నామన్న సంకేతాలను ఇచ్చారు. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనవలసిన అవసరం గురించి చీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ దాస్‌ మంగళవారం ఉద్యోగ సంఘాలతో సుదీర్ఘంగా చర్చించారు. ఆయన రెండు అంశాలపై ప్రధానంగా చర్చించారు. సుప్రీం తీర్పుపై గౌరవం ఉంచి, ఎన్నికలకు సహకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదనే ప్రధాన అంశంతో పాటు, ప్రభుత్వ పరంగా ఉద్యోగులకు రక్షణ కల్పించే అంశాన్ని చర్చించారు. చర్చల అనంతరం సీఎస్‌తో చర్చించిన అంశాలను ఉద్యోగ సంఘాల నేతలు మీడియాకు వివరించారు. ఇదే సమయంలో ఎన్నికలకు తాము సిద్ధంగానే ఉన్నామన్న సంకేతాలను ఇచ్చారు. 


ప్రధాన ఉద్యోగ సంఘాలైన ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌, ఏపీ అమరావతి జాక్‌ల నేతలు తమ నిర్ణయాన్ని బుధవారం అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ నేతలు ఎన్నికలకు సహకరిస్తామని చెప్పేశాయి. ఏపీఎన్జీవో అసోసియేషన్‌ నేత చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ, ఉద్యోగులు ప్రాణభయంతో ఎన్నికలను బహిష్కరించాలని, సమ్మెకు కూడా వెళ్లాలని భావిస్తున్నారని, వారికి నచ్చచెప్పేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఎన్జీవో అసోసియేషన్‌ తమ సభ్య సంఘాల నేతలతో మాట్లాడి, ఉద్యోగులను ఎన్నికల్లో పాల్గొనాలని పిలుపునిచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు ఏపీ అమరావతి ఉద్యోగుల సంఘ జేఏసీ తమ పరిధిలోని 94 సంఘాలతో నగరంలోని ఏపీ రెవెన్యూ భవన్‌లో బుధవారం సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో భవిష్యత్‌ నిర్ణయం ప్రకటిస్తామని జేఏసీ చైర్మన్‌ బొప్పరాజు ప్రకటించారు. 


వ్యాక్సిన్‌, పీపీఈ కిట్ల కోసం పట్టు  

ఉద్యోగ సంఘాలు కరోనా వ్యాక్సిన్‌, పీపీఈ కిట్ల కోసం పట్టు పడుతున్నాయి. ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు తొలుత వ్యాక్సిన్‌ వేయాల్సి ఉండగా, ప్రస్తుతం వైద్య అధికారులు, వైద్య సిబ్బందికి మాత్రమే ఇస్తున్నారు. ఎన్నికల విధులు నిర్వహించే వారిలో ప్రధానంగా రెవెన్యూ, పంచాయతీరాజ్‌, పోలీసులు ఉంటారు. వీరికి వ్యాక్సిన్‌ రెండో విడతలో ఇవ్వాల్సి ఉంటుంది. 

పోలింగ్‌ విధులు నిర్వహించే ఉద్యోగులకు తక్షణం వ్యాక్సిన్‌ ఇవ్వాలని, పీపీఈ కిట్లను అందించాలని, 50 సంవత్సరాలకు పైబడిన ఉద్యోగులను విధుల నుంచి మినహాయించాలని ఉద్యోగ సంఘాల నేతలు సూచించారు. ఎన్నికల విఽధుల్లో ఎవరైనా వైరస్‌ సోకి చనిపోతే, రూ.50 లక్షల పరిహారాన్ని అందించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం నుంచి, ఎన్నికల కమిషన్‌ నుంచి ఆ మేరకు హామీ ఇప్పించాలని కోరారు.

Updated Date - 2021-01-27T06:43:02+05:30 IST