కంభళా వీరులు

ABN , First Publish Date - 2020-02-20T10:07:24+05:30 IST

కంబళ’... పరుగుల ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న పేరిది! బెంగళూరులో జరిగే ఈ సంప్రదాయ దున్నపోతుల పోటీలో శ్రీనివాస గౌడ్‌ అనే యువకుడు

కంభళా వీరులు

బోల్ట్‌ కంటే మిన్నగా పరుగులు.. మొన్న శ్రీనివాస.. నేడు నిషాంత్‌

కంబళ పోటీల్లో రికార్డుల మోత

బోల్ట్‌ వరల్డ్‌ రికార్డు టైమింగ్‌ బ్రేక్‌

సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌

గ్రామీణ క్రీడకు అంతర్జాతీయ గుర్తింపు


బెంగళూరు, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ‘కంబళ’... పరుగుల ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న పేరిది! బెంగళూరులో జరిగే ఈ సంప్రదాయ దున్నపోతుల పోటీలో శ్రీనివాస గౌడ్‌ అనే యువకుడు స్ర్పింట్‌ దిగ్గజం ఉసేన్‌ బోల్ట్‌ను మించిన వేగంతో పరిగెత్తి ఔరా అనిపిస్తే.. తాజాగా బజగోళి జోగిబెట్టు ప్రాంతానికి చెందిన నిషాంత్‌ శెట్టి అనే మరో యువకుడు ఆ రికార్డును బ్రేక్‌ చేసి మరో సంచలనానికి తెరలేపాడు. శ్రీనివాస 143 మీటర్ల దూరాన్ని 13.68 సెకన్లలో పరిగెత్తితే..


నిషాంత్‌ ఇదే దూరాన్ని 13.62 సెకన్లలో పూర్తి చేశాడు. ఈ ఇద్దరి వేగాన్ని 100 మీటర్లతో పోల్చినపుడు ఒలింపిక్స్‌లో దిగ్గజ స్ర్పింటర్‌ ఉసేన్‌ బోల్ట్‌ నెలకొల్పిన ప్రపంచ రికార్డు (9.58 సెకన్లు) టైమింగ్‌ కంటే తక్కువ. అంటే శ్రీనివాస గౌడ 100 మీటర్లను 9.55 సెకన్లలో పూర్తిచేస్తే.. నిషాంత్‌ 9.51 సెకన్లలోనే దాన్ని అధిగమించినట్టన్నమాట! అలాగే ఆనంద్‌ (9.57), సురేశ్‌ శెట్టి (9.57) అనే మరో ఇద్దరు కూడా బోల్ట్‌ టైమింగ్‌లోపే 100 మీటర్ల రేసును పూర్తిచేయడం విశేషం. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో సింథటిక్‌ ట్రాక్‌పై నిర్వహించే రేసుతో... బురదలో నిర్వహించే ఇలాంటి సంప్రదాయ క్రీడను పోల్చడం సరైనదా.. కాదా అనే అంశాన్ని పక్కనబెడితే... శ్రీనివాస గౌడ, నిషాంత్‌ శెట్టి పరిగెత్తిన విధానం చూసి స్ర్పింట్‌ కింగ్‌ బోల్ట్‌ను మించిన మొనగాళ్లంటూ సోషల్‌ మీడియాలో బ్రహ్మరథం పడుతున్నారు.


జానపద క్రీడ కంబళ

కర్ణాటక కోస్తా తీరంలో కంబళ ఒక జానపద క్రీడ. బలిష్టంగా ఉండే దున్నపోతులను బురద నేలల్లో పరుగెత్తించి వాటితో పాటే పరుగెత్తే ఈ క్రీడ దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాల్లో బహుళ ప్రాచుర్యం పొందింది. జానపద నేపథ్యం కల్గిన కంబళ కోస్తారైతుల జీవితాల్లో విడదీయరాని భాగమైంది. పంట కోతల అనంతరం రైతులు వినోదం కోసం దీన్ని ఎన్నో సంవత్సరాలుగా నిర్వహిస్తూ వస్తున్నారు. రెండు బలిష్ఠమైన దున్నపోతుల మెడలకు తాడుకట్టి వాటిని పరుగెత్తించడం ఈ క్రీడలో ప్రధానాంశం. కంబళకు వందల ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. నవంబరు, డిసెంబరు అనంతరం చలికాలంలో కోస్తాలో కంబళ పోటీలు ప్రారంభమై మార్చి చివరి వరకు జరుగుతుంటాయి. పోటీలను చూసేందుకు వేల సంఖ్యలో రైతులు గుమిగూడుతుంటారంటే దీని ప్రాచుర్యాన్ని అర్థం చేసుకోవచ్చు. 


 పేరెలా వచ్చిందంటే..

తుళు భాషలో కంప అంటే బురద లేదా మురికి అనే అర్థం. బురద నేలలో దున్నపోతులను పరుగులు తీయిస్తారు కాబట్టి కాలక్రమంలో ఇది కంబళగా మారిందని చరిత్రకారులు చెబుతున్నారు. కోతల అనంతరం బీడుబడిన, ఉపయోగించని పొలాలనే ఈ పోటీ కోసం ఎంచుకుంటారు. 200 మీటర్ల మేరకు మార్గాన్ని ఇసుక వేసి జారిపోకుండా సిద్ధం చేస్తారు. కంబళకు రకరకాల పేర్లు ఉన్నాయి. ఒక్క దున్నపోతుతో జరిపే పోటీని ఒంటిగద్దె కంబళ, రెండు దున్నపోతులతో పోటీని జోడిగద్దె కంబళ, సూర్యచంద్ర, లవకుశ, జయవిజయ, విజయవిక్రమ, వీరవిక్రమ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. నేత్రావతి ఫల్గుణి నదుల పేర్లతోనూ వీటిని పిలుస్తారు. కంబళలో పాల్గొనేందుకు బలిష్టమైన ఆరోగ్యవంతమైన దున్నపోతులను ఎంపిక చేసి వాటికి నాణ్యమైన గడ్డి తినిపిస్తారు. నూనెతో వారానికోసారి మర్దన చేయిస్తారు. పోటీలు ప్రారంభమయ్యే రోజు ముందుగా వీటితో రిహార్సల్స్‌ నిర్వహిస్తారు. 


100 మీటర్లలో ఎవరెలా..

పేరు 100 మీ.రికార్డు పరిగెత్తిన దూరం

ఉసేన్‌ బోల్ట్‌ 9.58 సెకన్లు --

శ్రీనివాస గౌడ 9.55 సెకన్లు 143 మీటర్లు (13.68)

నిషాంత్‌ శెట్టి 9.51 సెకన్లు 143 మీటర్లు (13.62)


పోటీల్లోనూ రకాలు

కంబళ పోటీలు కూడా పలురకాలుగా ఉంటాయి. రెండు దున్నపోతుల మెడలకు తాళ్లు కట్టి వాటిని పట్టుకొని పరుగులుదీసే పోటీ ఒకరకం కాగా రెండు  దున్నలకు నాగలికట్టి పరుగులు పట్టించేది మరోరకం. ఇదిలావుండగా వేగంగా పరుగెడుతున్న దున్నపోతులను మధ్యలో అడ్డుకోవడం మరోరకమైన పోటీ. తమిళనాడులో దీనిని జల్లికట్టు అని కూడా పిలుస్తారు. అయితే ఈ రెండింటికీ బాగా వ్యత్యాసం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.

Updated Date - 2020-02-20T10:07:24+05:30 IST