ఎట్టకేలకు ఆశీలు ఖరారు

ABN , First Publish Date - 2021-04-13T05:19:36+05:30 IST

ఆమదాలవలస ముని సిపాలిటీ పరిధిలో మార్కెట్‌, చింతాడ వారపు సంత ఆశీలును ఎట్టకేలకు సోమవారం ఖరారుచేశారు. మునిసిపల్‌ అధికారులు సోమవారం వేలం నిర్వహించారు.

ఎట్టకేలకు ఆశీలు ఖరారు
ఆశీలు వేలంపాట నిర్వహిస్తున్న మునిసిపల్‌ అధికారులు

ఆమదాలవలస : ఆమదాలవలస ముని సిపాలిటీ పరిధిలో మార్కెట్‌, చింతాడ వారపు సంత ఆశీలును ఎట్టకేలకు సోమవారం ఖరారుచేశారు. మునిసిపల్‌ అధికారులు సోమవారం వేలం నిర్వహించారు. 2021-22 ఆర్థిక సంవత్సరం ఆశీలు వసూలుకు తొలుత మార్చి 26న పాట నిర్వహించేందుకు  అధికారులు ప్రకటన జారీ చేశారు. అయితే ఆ రోజు భారత్‌బంద్‌కు పిలుపునివ్వడంతో 27వ తేదీకి వాయిదావేశారు. 27న పాట నిర్వహించినా ఆశించినంత ఆదాయం రాకపోవడంతో 30కి వాయిదా వేశారు. 30న నిర్వహించిన పాటలో మార్కెట్‌ ఆశీలు వసూలును బలివాడ అనుసూయమ్మ, చింతాడ వారపుసంతను గుండ లక్ష్మణరావు దక్కించుకున్నారు. ఆ రోజు మధ్యాహ్నం పాట ఖరారుచేసిన అధికారులు మార్కెట్‌ తగినంత ఆదాయం రాలేదని, చింతాడ వారపుసంతకు సంబంధించి పాటలో ఒక్కరే పాల్గొన్నారని అదేరోజు రాత్రి పాటను రద్దుచేస్తు నోటీసులు జారీచేశారు. తమ అనుయాయులకు మార్కెట్‌ పాట దక్కలేదన్న నెపంతో ఓ నేత ఒత్తిడితోనే రద్దుచేశారన్న ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. ఈ నేపఽథ్యంలో ఈనెల 7న పాట నిర్వహించనున్నట్టు అధికారులు మరోసారి ప్రకటించారు. ప్రాదేశిక ఎన్నికల నోటిఫికేషన్‌ జారీకావడంతో 12న పాట నిర్వహించనున్నట్లు ప్రకటించారు. దీంతో సోమవారం జరిగిన పాటలో మార్కెట్‌ ఆశీలు వసూలుకు సంబందించి నలుగురు పాల్గొనగా బి.దాలినాయుడు స్వీపర్‌ చార్జీలతో కలిపి రూ.18.18 లక్షలకు దక్కించుకున్నారు. చింతాడ వారపు సంతకు సంబంధించి గుండ లక్ష్మణరావు  స్వీపర్‌ చార్జీలతో కలిపి రూ.11,84,800 దక్కించుకున్నారు. వీటికి అదనంగా రిజిస్ట్రేషన్‌ చార్జీలు ఉంటాయని కమిషనర్‌ రవిసుధాకర్‌ తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్‌ మేనేజర్‌ బి.మురళీమోహన్‌ పట్నాయక్‌, ఆర్‌ఐ హారీష్‌  పాల్గొన్నారు.


పన్ను చెల్లిస్తే ఐదు శాతం రిబేట్‌

ఇచ్ఛాపురం : మునిసిపాలిటీలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను ఒకేసారి చెల్లించిన వారికి పన్నులో ఐదు శాతం రిబేట్‌ ఇవ్వనున్నట్టు కమిషనర్‌ ఎల్‌.రామలక్ష్మి తెలిపారు.  సోమవారం మునిసిపల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్య క్రమంలో ఆమె మాట్లాడుతూ పన్నులు సకాలం చెల్లించాలని కోరారు. దీర్ఘకాలంగా ఆస్తి పన్ను బకాయి ఉన్నవారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 


Updated Date - 2021-04-13T05:19:36+05:30 IST