భారీగా తరలిన కమల దళం

ABN , First Publish Date - 2022-07-04T05:05:45+05:30 IST

నగరంలో జరిగిన బీజేపీ విజయసంకల్ప సభ విజయవంతమైంది.

భారీగా తరలిన కమల దళం
మేడ్చల్‌ నుంచి మోదీ సభకు తరలివెళ్తున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు

  • విజయ సంకల్ప సభతో బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం
  • శివార్ల నుంచి భారీగా జనసమీకరణ
  • నడ్డా, అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
  • కొండా భుజం తట్టిన ప్రధాని మోదీ


నగరంలో జరిగిన బీజేపీ విజయసంకల్ప సభ విజయవంతమైంది. ఈ సభకు ఉమ్మడి రంగారెడ్డిజిల్లా నుంచి భారీగా బీజేపీ శ్రేణులు తరలివెళ్లాయి. ఈ ప్రాంతం నుంచి జనసమీకరణకు  ఆ పార్టీ నాయకులు విశేషంగా కృషి చేశారు. నియోజకవర్గ, బూత్‌ స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేసి జనాన్ని తరలించారు. సభకు జాతీయ నేతలు హాజరు కావడంతో పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహం నిండింది. 


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టేందుకు ఊవిళ్లూరుతున్న బీజేపీ హైదరాబాద్‌లో జాతీయ కార్యవర్గ సమావేశాలను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా పరేడ్‌ గ్రౌండ్‌లో ఆదివారం లక్షలాదిమందితో భారీ బహిరంగసభ నిర్వహించింది. ఈ సభకు ప్రధాని మోదీతో పాటు బీజేపీ అతిరథ మహారథులందరూ హాజరుకానుండడంతో ఆ పార్టీ ముందు నుంచే జనసమీకరణను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న ఉమ్మడి రంగారెడ్డిజిల్లా నుంచే భారీగా జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. ఆయా నియోజకవర్గాలకు టార్గెట్లు పెట్టింది. ఒక్కో నియోజకవర్గం నుంచి 15వేల నుంచి 5వేల మందిని తరలించే విధంగా వాహనాలను ఏర్పాటు చేసింది. నియోజకవర్గ, బూత్‌ స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేసి జనసమీకరణ చేశారు. స్థానిక నేతలు వీరందరికీ భోజన ఏర్పాట్లు చేశారు. రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌ జిల్లాల నుంచి దాదాపు 2లక్షల మందికిపైగా జనాన్ని తరలించేందుకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. ఆదివారం సాయంత్రం సభకు ఆశించిన స్థాయిలో పార్టీ శ్రేణులు తరలివెళ్లాయి. ముఖ్యంగా నగర శివార్లలోని మహేశ్వరం, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, ఎల్‌బీనగర్‌, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, మల్కాజిగిరి, ఉప్పల్‌ నియోజకవర్గాల నుంచి భారీగా జనం తరలివెళ్లారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు రైళ్లు, బస్సులు, ఇతర వాహనాలతో పరేడ్‌ గ్రౌండ్‌కు తరలివెళ్లారు. మాజీ మంత్రి డాక్టర్‌ చంద్రశేఖర్‌ తన అనుచరులతో కలిసి వికారాబాద్‌ నుంచి రైలులో హైదరాబాద్‌కు తరలివెళ్లారు. 


కాషాయ కండువా కప్పుకున్న ‘కొండా’

చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బీజేపీలో చేరారు. ఆదివారం పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్‌షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈసందర్భంగా కొండా విశ్వేశ్వరెడ్డిని ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులు, జాతీయనాయకులు అభినందించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రధాని మోదీ వద్దకు  కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని తీసుకువెళ్లి వేదికపై పరిచయం చేశారు. ఈ సందర్భంగా మోదీ కొండా భుజం తట్టారు. విశ్వేశ్వర్‌రెడ్డి ప్రధానికి శాలువా బహుకరించారు. ఇదిలాఉంటే బీజేపీ బహిరంగ సభ విజయవంతం కావడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. అయితే ప్రధాని ప్రసంగం రాజకీయంగా ధాటిగా లేకపోవడంతో కొంత నిరుత్సాహ పడ్డారు. పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన విజయ సంకల్ప సభ విజయవంతం కావడం పట్ల రంగారెడ్డిజిల్లా పార్టీ అధ్యక్షుడు బొక్కా నర్సింహారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సభను విజయవంతం చేసేందుకు జిల్లా నుంచి పెద్దసంఖ్యలో జనమీకరణ చేసిన స్థానిక నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.



Updated Date - 2022-07-04T05:05:45+05:30 IST