బీభత్సం సృష్టించిన దోపిడీ దొంగలు.. ప్రయాణికుల కార్లను అడ్డగించి..

ABN , First Publish Date - 2021-01-14T05:52:04+05:30 IST

విశాఖ ఏజెన్సీలోని గూడెంకొత్తవీధి మండలం ధారకొండ..

బీభత్సం సృష్టించిన దోపిడీ దొంగలు.. ప్రయాణికుల కార్లను అడ్డగించి..
దుండగులు ధ్వంసం చేసిన పీఆర్‌ ఏఈఈ కారు

ధారకొండ ఘాట్‌రోడ్డులో ప్రయాణికుల వాహనాలు అడ్డగింత

నాటు తుపాకులు, కత్తులు, కర్రలతో స్వైరవిహారం

పంచాయతీరాజ్‌ ఏఈఈ కారు ధ్వంసం

సీలేరు వర్తకుడి దంపతుల నుంచి బంగారం దోపిడీ

లంబసింగి వెళుతున్న పాల్వంచ పర్యాటకుల నుంచి

సెల్‌ఫోన్లు, రూ.35 వేల నగదు అపహరణ


సీలేరు/చింతపల్లి(విశాఖపట్నం)విశాఖ ఏజెన్సీలోని గూడెంకొత్తవీధి మండలం ధారకొండ ఘాట్‌రోడ్డులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ప్రయాణికుల కార్లను అడ్డగించి నగదు, బంగారు ఆభరణాలను దోచుకున్నారు. ఒక కారుపై కర్రలతో దాడి చేసి ధ్వంసం చేశారు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు జరిగిన వరుస సంఘటనలకు సంబంధించి పోలీసులు, బాధితుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గూడెంకొత్తవీధిలో పంచాయతీరాజ్‌ ఏఈఈగా పనిచేస్తున్న కిల్లో జ్యోతిబాబు మంగళవారం ఉదయం తన స్నేహితులైన ముగ్గురు ఉపాధ్యాయులతో కలిసి చింతపల్లి నుంచి కారులో బయలుదేరి సీలేరు వెళ్లారు. గ్రామ సచివాలయం భవనం శ్లాబ్‌ పనులు పరిశీలించి, రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో చింతపల్లి తిరుగు ప్రయాణమయ్యారు. 8:50 గంటల సమయానికి ధారకొండ ఘాట్‌రోడ్డులో మూడో మలుపు వద్దకు చేరుకున్నారు. రహదారికి అడ్డంగా బండరాళ్లు వుండడంతో కారు నడుపుతున్న ఉపాధ్యాయుడు అర్జున్‌ (రింతాడ) అనుమానం వచ్చి రివర్స్‌ చేయబోయారు. ఈలోగా పక్కనే వున్న తుప్పల్లో నుంచి ముసుగులు ధరించిన ముగ్గురు ఆగంతకులు రోడ్డుపైకి వచ్చి ముందు సీట్లో కూర్చున్న వారికి నాటు తుపాకులు గురిపెట్టారు. దీంతో అర్జున్‌ కారును రివర్స్‌ చేస్తూనే డోర్ల అద్దాలు పైకి ఎత్తారు. ఇదే సమయంలో మరో ముగ్గురు దుండగులు వచ్చి కర్రలతో కారు అద్దాలపై దాడి చేశారు. అయినా సరే కారును ఆపకుండా వేగంగా రివర్స్‌ చేసి ధారాలమ్మ అమ్మవారి ఆలయం వద్దకు వచ్చారు.ఈ విషయాన్ని అర్చకులు, వర్తకులకు చెప్పారు.  


సీలేరు వర్తకుడి కారుపై దాడి

సీలేరుకు చెందిన వర్తకుడు కారే సత్యనారాయణ, ఈశ్వరమ్మ దంపతులు విశాఖ వెళ్లడానికి బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు కారులో బయలు దేరారు. ఐదున్నర గంటల సమయంలో ధారకొండ ఘాట్‌రోడ్డు రెండో మలుపు వద్దకు చేరుకున్నారు. ఎదురుగా రెండు ద్విచక్ర వాహనాలపై నాటు తుపా కులతో వచ్చిన నలుగురు వ్యక్తులు కారును అడ్డగించారు. మీరెవరని వ్యాపారి ప్రశ్నించగా... పోలీసులమని, డిక్కీ తెరవండి...తనిఖీ చేయాలంటూనే ఇద్దరు దుండగులు సత్యనారాయణ మెడలో వున్న గోల్డ్‌ చైన్‌, అతడి భార్య మెడలో వున్న నల్లపూసల దండను (రెండూ కలిసి సుమారు ఐదు తులాలు) తెంచుకున్నారు. ఇంతలో హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళుతున్న ఎక్స్‌ప్రెస్‌ బస్‌ వస్తుండడంతో దుండగులు అక్కడి నుంచి ఉడాయించారు. 


పర్యాటకుల నుంచి నగదు దోపిడీ

తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నుంచి ఐదుగురు లంబసింగి వెళ్లడానికి కారులో బయలులేరి తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ధారకొండ ఘాట్‌రోడ్డుకు చేరుకున్నారు. అప్పటికే మాటువేసిన దోపిడీ దొంగలు...కారును అడ్డగించి వారి నుంచి నాలుగు సెల్‌ఫోన్లు, రూ.35 వేల నగదు దోచుకున్నారు. ఆరు గంటలకు సప్పర్ల చేరుకున్న వీరు విషయాన్ని స్థానిక గిరిజనులకు చెప్పారు. అయితే వీరు సీలేరు, చింతపల్లి పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. 


సీసీ టీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నాం: ఎస్‌ఐ రంజిత్‌, జీకే వీధి

ధారకొండ ఘాట్‌రోడ్డులో జరిగిన దోపిడీ ఘటనలపై కేసు నమోదుచేసి విచారణ చేపడుతున్నాం. అమ్మవారి ఆలయం వద్దనున్న సీసీ టీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నాం.


కారుపై కర్రలతో దాడి: జ్యోతిబాబు, ఏఈఈ 

ధారకొండ అమ్మవారి ఆలయం దాటి మూడో మలుపు వద్దకు రాగానే ఎదురుగా బండరాళ్లు కనిపించాయి. దొంగలే రాళ్లు పెట్టి వుంటారని భావించి కారు నడుపుతున్న నా స్నేహితుడు అర్జున్‌ వెంటనే రివర్స్‌ చేసేశాడు. అయితే ఆ క్రమంలో ఇంజన్‌ ఆగిపోయింది. అప్పటికే చుట్టుపక్కల పొదల్లో నుంచి రహదారిపైకి చేరుకున్న దొంగలు కారు నలుదిక్కులా చేరి కర్రలతో కొట్టడం ప్రారంభించారు. అయినా వెంటనే కారు స్టార్ట్‌ చేసి ఆపకుండా వేగంగా ధారకొండ అమ్మవారి ఆలయం వరకు వచ్చేశాం. సంఘటనా స్థలంలో మూడు, నాలుగు నిమిషాలు మాత్రమే ఉండి ఉంటాం. ఆ కొద్ది సమయంలోనే దొంగలు కారు అద్దాలు పగులగొట్టేశారు. మొత్తం ఆరుగురు ఉన్నారు. ముగ్గురి వద్ద నాటు తుపాకులు, మరో ముగ్గురి వద్ద కత్తులు ఉన్నాయి. ఆరుగురు మాస్క్‌లు ధరించి ఉన్నారు. తెలుగులోనే మాట్లాడు తున్నారు. సుమారు ఎనిమిదేళ్లుగా ఈ ప్రాంతంలో పనిచేస్తు న్నాను. ఎప్పుడూ ఇలా జరగలేదు.   

ఆ సమయానికి బస్సు రావడం అదృష్టం: ఈశ్వరమ్మ

నా భర్త సత్యనారాయణ ధారకొండ రెండో మలుపు వద్ద కారు నెమ్మదిగా నడుపుతుండగా... ఒక వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి అడ్డంగా నిలిపాడు. అతడి వెంట మరో ముగ్గురు ద్విచక్ర వావానంపై వచ్చారు. తుపాకలు చూపించి తాము పోలీసులమని...డిక్కీ తియ్యండంటూ హిందీ, ఒరియాలో అడిగారు. వారితో మాట్లాడుతుండగానే మరో వైపు ఇద్దరు...నా మెడలోనున్న నల్లపూసలతాడు, నాభర్త మెడలోనున్న చైను లాగేసుకున్నారు. నా మెడలో వున్న తాడు కూడా లాగేస్తుండగా గట్టిగా పట్టుకున్నాను. ఇంతలో బస్సు హారన్‌ మోగడంతో దొంగలు అక్కడ నుంచి వెళ్లిపోయారు. సమయానికి బస్సు రాకపోతే దొంగలు మా వద్దనున్న నగదు, మెడలోనున్న తాడు, ఉంగరాలు కూడా దోచుకునేవారు. ఆ సమయానికి బస్సు రావడం మా అదృష్టం. 

Updated Date - 2021-01-14T05:52:04+05:30 IST