లక్ష్యాన్ని అధిగమించాలి

ABN , First Publish Date - 2022-05-17T05:10:01+05:30 IST

ప్రభుత్వ పథకాల అమలులో నిర్దేశించిన లక్ష్యంలో వందశాతం ప్రగతి సాధించాలని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా, జేసీ తమీమ్‌ అన్సారియాలు ఆదేశించారు.

లక్ష్యాన్ని అధిగమించాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీషా

పేదల ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి కనిపించాలి

వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా


రాయచోటి (కలెక్టరేట్‌), మే 16: ప్రభుత్వ పథకాల అమలులో నిర్దేశించిన లక్ష్యంలో వందశాతం ప్రగతి సాధించాలని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా, జేసీ తమీమ్‌ అన్సారియాలు ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో వీసీ హాల్‌ నుంచి ఆర్డీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్‌లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రభుత్వ పథకాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మండలాల వారీగా వివిధ ప్రభుత్వ పథకాల అమలులో రోజువారీ ఇచ్చిన లక్ష్యాన్ని అధిగమించేందుకు ఎంపీడీవోలు కృషి చేయాలని ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన స్పందన ఫిర్యాదులను పరిష్కరించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా స్పందన అర్జీల పరిష్కారంలో వెనుకబడిన మండలాల అధికారులతో సమీక్షించారు. అలాగే ఈబీసీ నేస్తం, జగనన్న తోడు, జగనన్న చేదోడు, జగనన్న వసతి దీవెన పథకాలకు సంబంధించి సమీక్షించి తగు సూచనలు జారీ చేశారు. జాయింట్‌  కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా మాట్లాడుతూ వారం వారం జగనన్న గృహ నిర్మాణాల్లో ప్రగతి కనపడాలని, ఈ మేరకు ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేసేలా కృషి చేయాలన్నారు. జగనన్న హౌసింగ్‌ లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి కనిపించాలని, వెనుకబడితే సహించేది లేదని సంబంధిత అధికారులను హెచ్చరించారు. గృహ నిర్మాణశాఖ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లతో ప్రతిరోజూ సమీక్ష చేయాలన్నారు. ప్రభుత్వ భూములకు, వాగులు, వంకలు, పొరంబోకు స్థలాలకు తగిన రక్షణ కల్పించాలని కలెక్టర్‌, జేసీలు తహసీల్దార్లను ఆదేశించారు. పీవోఎల్‌ఆర్‌ అంశంలో చిట్వేలి, పుల్లంపేట, రైల్వేకోడూరు మండలాలు లక్ష్య సాధనలో వెనుకబడి ఉన్నాయని, వచ్చే వారంలోగా ప్రగతి సాధించాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌వో సత్యనారాయణ, రాయచోటి, రాజంపేట, మదనపల్లె ఆర్డీవోలు రంగస్వామి, కోదండరామిరెడ్డి, మురళి, కలెక్టరేట్‌ ఏవో బాలకృష్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్‌ మిషనర్లు, తహసీల్దార్‌లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు. 


అర్జీదారులకు న్యాయం చేయండి

అన్నమయ్య జిల్లాలోని స్పందనకు వచ్చే అర్జీలను సత్వర న్యాయం చేయాలని అధికారులను కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా ఆదేశించారు. ఒక్కసారి స్పందనకు వచ్చిన అర్జీదారులు మళ్లీ మళ్లీ స్పందనకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తహసీల్దార్‌, ఎంపీడీవో, వీఆర్‌వో, పంచాయతీ సెక్రటరీలదేనని తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన స్పందన కార్యక్రమంలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. కార్యక్రమంలో డీఆర్‌వో, జేసీ, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-17T05:10:01+05:30 IST