వరద మొదలైంది

ABN , First Publish Date - 2020-08-09T09:53:23+05:30 IST

శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి మొదలైంది. శనివారం సాయంత్రానికి జూరాల నుంచి 2.25లక్ష క్యూసెక్కుల నీరు వస్తోంది.

వరద మొదలైంది


నారాయణపూర్‌, ఆల్మట్టి నుంచి ప్రవాహం

జూరాల నుంచి 2.25 లక్షల క్యూసెక్కులు

ఏపీలోనూ ప్రారంభం కానున్న విద్యుదుత్పత్తి


కర్నూలు, ఆంధ్రజ్యోతి:   శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి మొదలైంది. శనివారం సాయంత్రానికి జూరాల నుంచి 2.25లక్ష క్యూసెక్కుల నీరు వస్తోంది. ఈ నీరు అర్ధరాత్రి దాటాక శ్రీశైలానికి చేరుకునే అవకాశం ఉంది. రోజూ 15-20 టీఎంసీల చొప్పున నీరు రావచ్చని అంచనాలున్నాయి. రెండ్రోజుల్లో ఏపీ కూడా విద్యుదుత్పత్తి మొదలుపెట్టే అవకాశం ఉంది. మహరాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యాంలు నిండుతున్నాయి. శనివారం ఉదయం నుంచే జూరాల నుంచి ఔట్‌ఫ్లో మొదలైంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, పూర్తి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా 849.90 అడుగుల వద్ద 79.8115 టీఎంసీల నీరు చేరింది.


నారాయణపూర్‌ గరిష్ఠ నీటి మట్టం 490.76మీటర్లు, నీటి నిల్వ 28 టీఎంసీలు కాగా 26.89 టీఎంసీల నీరు చేరింది. ఇన్‌ఫ్లో 2లక్షల క్యూసెక్కులుండగా 2,20,620 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి గరిష్ఠ నీటి మట్టం 517 అడుగులు, నీటి నిల్వ 129.27 టీఎంసీలుండగా ప్రస్తుతం 108 టీఎంసీల నీరు చేరింది. ఇన్‌ఫ్లో 2.23లక్షల క్యూసెక్కులు ఉంది. 2.20లక్షల క్యూసెక్కులు జూరాలకు విడుదల చేస్తున్నారు. వారంపాటు ఇదే స్థాయిలో వరద నీరు రావచ్చని, శ్రీశైలం నీటిమట్టం 875-880 అడుగులకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. 10-15 రోజుల్లో సుమారు 150 టీఎంసీల నీరు చేరుకోవచ్చని చెబుతున్నారు.


ఏపీలోనూ విద్యుదుత్పత్తి

తెలుగు రాష్ట్రాల్లో జూలై 7వ తేదీ నుంచి కురిసిన వర్షాలకు సుంకేసుల నుంచి 12.5 టీఎంసీలు, హంద్రీ నుంచి 12 టీఎంసీలు, జూరాల నుంచి 79 టీఎంసీలు మొత్తం 103 టీఎంసీల నీరు శ్రీశైలానికి చేరింది. జలాశయం నుంచి తెలుగు రాష్ట్రాలు కలిసి ఇప్పటిదాకా 72 టీఎంసీలు వాడుకోగా.. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుదుత్పత్తి ద్వారా 64.5 టీఎంసీలు, ఎత్తిపోతల పథకాల ద్వారా 2.64 టీఎంసీలను తెలంగాణ ప్రభుత్వం డ్రా చేసుకుంది.


ఏపీ ప్రభుత్వం మాత్రం మల్యాల, హంద్రీనీవా నుంచి 1.5 టీఎంసీలు, పోతిరె డ్డిపాడు నుంచి 2.3 టీఎంసీలను అవసరాల రీత్యా మాత్రమే వాడుకుంది. శ్రీశైలం నీటిమట్టం పెరిగితే విద్యుదుత్పత్తి ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. కుడి గట్టు భూగర్భ విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి కూడా నీటిని డ్రా చేసుకునే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు నీటి విడుదలపై జిల్లా అధికారులు అప్రమత్తం కావాల్సి ఉంది. లేకుంటే జూలైలో వచ్చిన వరదను ఉపయోగించుకోలేని దుస్థితే పునరావృతం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 


తుంగభద్ర డ్యాంకు లక్ష క్యూసెక్కులు..ఒక్క రోజులో 10 టీఎంసీలు చేరిక 

హాలహర్వి, ఆగస్టు 8: తుంగభద్ర జలాశయానికి వరద పెరిగింది. లక్ష క్యూసెక్కుల నీరు వస్తోంది. రెండు రోజుల క్రితం ఎగువన ప్రాంతాలైన శివమొగ్గ, మలేనాడు, హరిహర, అగుంబే తదితర ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. దీంతో తుంగ జలాశయం పూర్తి స్థాయిలో నిండడంతో దిగువన తుంగభద్ర జలాశయానికి 60 వేల క్యూసెక్కులకు పైగా విడుదల చేశారు.


ఇలాగే నాలుగు రోజుల పాటు ఇన్‌ఫ్లో కొనసాగితే తుంగభద్ర జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుతుందని బోర్డు ఈఈ సురేష్‌రెడ్డి తెలిపారు. తుంగభద్ర జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు, ప్రస్తుతం నీటి మట్టం 1618.18 అడుగులు ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 100.855 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం నీటి నిల్వ 56.521 ఉంది. ఇన్‌ఫ్లో 1,01,002 క్యూసెక్కులు ఉంది. 8,629 క్యూసెక్కులు సాగునీటి కాల్వలకు మళ్లిస్తున్నారు. 


డ్యాం పూర్తిస్థాయి నిల్వ ప్రస్తుతం ఇన్‌ఫ్లో ఔట్‌ఫ్లో

జూరాల 9.66 టీఎంసీలు 5.2 టీఎంసీలు 226,010 క్యూసెక్కులు 2,22,560క్యూసెక్కులు

శ్రీశైలం 215.81 టీఎంసీలు 81.82 టీఎంసీలు 2,10,000 క్యూసెక్కులు

Updated Date - 2020-08-09T09:53:23+05:30 IST