షింజో అబే హంతకుడి లక్ష్యం ఓ మత పెద్దను చంపడం!

ABN , First Publish Date - 2022-07-09T20:32:54+05:30 IST

జపాన్ మాజీ ప్రధాన మంత్రి షింజో అబే (Shinzo Abe) హత్య కేసులో

షింజో అబే హంతకుడి లక్ష్యం ఓ మత పెద్దను చంపడం!

న్యూఢిల్లీ : జపాన్ మాజీ ప్రధాన మంత్రి షింజో అబే (Shinzo Abe) హత్య కేసులో నిందితుడు టెట్సుయ యమగామి (41) అసలు లక్ష్యం ఓ మత పెద్ద అని జపనీస్ పోలీసు వర్గాలను ఉటంకిస్తూ ఆ దేశ మీడియా శనివారం తెలిపింది. తనకు ఓ సంస్థపై తీవ్ర ఆగ్రహం ఉందని, ఆ సంస్థతో అబేకు సంబంధాలు ఉన్నట్లు తనకు అనుమానం ఉందని  యమగామి చెప్పినట్లు పేర్కొంది. 


యమగామి చెప్పిన సంస్థ ఓ మత సంబంధిత సంస్థ అని తెలుస్తోంది. ఆ సంస్థతో షింజో అబేకు సంబంధం ఉందని, దేశంలో ఆ సంస్థకు అన్ని విధాలుగా అండదండలు అందిస్తున్నారని యమగామి అనుమానించాడు. తన తల్లిని ఆ సంస్థకు చెందిన మత పెద్ద మోసం చేసినట్లు విశ్వసించాడు. ఆ మత పెద్దను హత్య చేయాలనేది అతని మొదటి ప్రణాళిక అని పోలీసు వర్గాలు చెప్పినట్లు జపనీస్ మీడియా తెలిపింది. అయితే ఆ మత పెద్ద పేరు, ఆయన ఆ సమయంలో అబే సమీపంలో ఉన్నారా? వంటి విషయాలను వెల్లడించలేదు.


జపాన్‌లోని నారా నగరంలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తున్న షింజో అబేపై యమగామి రెండుసార్లు కాల్పులు జరిపి, హత్య చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యానంతరం యమగామి తుపాకీని క్రింద పడేసి, అక్కడే నిల్చున్నట్లు పోలీసులు చెప్పారు. అతనిని అరెస్ట్ చేసి, ప్రశ్నించినపుడు తన లక్ష్యం ఓ మత పెద్ద అని చెప్పినట్లు తెలిపారు. 


జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిద శుక్రవారం జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ, షింజో  అబే హత్య అత్యంత ఆటవిక చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. అబే పార్దివ దేహాన్ని శనివారం ఉదయం ఆయన నివాసంలో ఉంచారు. షిబుయ ప్రాంతంలోని ఆయన నివాసానికి అనేక మంది తరలివచ్చి, ఆయనకు అంతిమ వీడ్కోలు పలికారు. 


యమగామి జపాన్ మారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్‌లో గతంలో పని చేసినట్లు పోలీసులు తెలిపారు. రెండు నెలల క్రితమే ఆ ఉద్యోగం నుంచి బయటకు వచ్చినట్లు చెప్పారు. నారా పట్టణంలోని ఆయన ఇంట్లో సోదాలు చేసినపుడు హోమ్‌మేడ్ గన్స్, పేలుడు పదార్థాలను  స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 


Updated Date - 2022-07-09T20:32:54+05:30 IST