పల్లెలను వణికిస్తున్న జ్వరాలు...

ABN , First Publish Date - 2022-09-29T05:19:38+05:30 IST

రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్న అమడగూరు మండలం వైపు ప్రజాప్రతినిధులు కానీ, వైద్యులు కానీ కన్నెత్తి చూడటం లేదు.

పల్లెలను వణికిస్తున్న జ్వరాలు...
అమడగూరు జిల్లాపరిషత పాఠశాల ఆవరణలో నిల్వ ఉన్న చెత్త

-అధ్వానంగా పారిశుధ్య నిర్వహణ

-కనిపించని వైద్య శిబిరాలు

-సరిహద్దు మండలాల్లో మరీ ఘోరం

-గ్రామాల్లో వైద్యం దయనీయం


 జిల్లాలో విష జ్వరాలు కుదిపేస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి జ్వరాలు అధికమవుతున్నాయి. మరీ ముఖ్యంగా పల్లెల్లో జ్వరపీడితులు అధికమవుతున్నారు. వాతావరణంలో నెలకొన్న మార్పులు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కీటక, నీటి జనిత వ్యాధులు ప్రబలడంతో అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. పిల్లలు, పెద్దలు జ్వరాలతో వణికిపోతున్నారు. ప్రైవేట్‌ ఆసుపత్రులు, ఆర్‌ఎంపీ కేంద్రాలు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో గ్రామాల్లో వైద్య సేవలు సక్రమంగా అందడం లేదు. ‘ఇంటివద్దకే వైద్యం’ అంటూ ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇచ్చే రాజకీయ నాయకులు ఇప్పుడు పల్లెల వైపు కన్నెత్తి  చూడటం లేదు. 


అమడగూరు, సెప్టెంబరు 28:  రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్న అమడగూరు మండలం వైపు ప్రజాప్రతినిధులు కానీ, వైద్యులు కానీ కన్నెత్తి చూడటం లేదు. మండలంలో ఏ పల్లెకు వెళ్లినా విష జ్వరాలతో యువకులు, వృద్ధులు మంచానపడ్డవారే కనిపిస్తారు. చాలా గ్రామాల్లో మురుగు ఎక్కడబడితే అక్కడ నిల్వ ఉండటంతో దోమలు వృద్ధి చెంది మలేరియా, డెంగీ, థైరాయిడ్‌ లాంటి ప్రాణాంతకమైన జ్వరాలు ప్రబలుతున్నాయి. వైద్య సిబ్బంది గ్రామాల్లో ఫాగింగ్‌, బ్లీచింగ్‌ స్ర్పే చేయకపోవడంతో దోమలు వృద్ధి చెంది ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నారు. వైద్య సిబ్బంది మాత్రం గ్రామాల్లో విషజ్వరాలపై ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతో జ్వరపీడితులు అధికమవుతున్నారు. వైద్యసిబ్బంది తూతూమంత్రంగా గ్రామాలకు వస్తున్నారు. వ్యాఽధుల బారిన పడినవారికి రక్తపరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఆయా గ్రామాల్లో జ్వరాల బారిన పడిన వారికి కనీసం వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం లేదు. 


విలేజ్‌ క్లినిక్‌లు ఎక్కడ?


ప్రభుత్వం ప్రతి గ్రామానికి విలేజ్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేసి, ఆరోగ్య ఆంధ్రప్రదేశగా మారుస్తామని ఇస్తున్న ప్రచారం కాస్తా ప్రకటనలకే పరిమితమవుతోంది. కానీ క్షేత్ర స్థాయిలో అమలు ఏమాత్రం జరగడం లేదు. మండలంలో వైద్యుల నిర్లక్ష్యంతో జ్వరాలు రోజురోజుకు పెరుగుతున్నాయే తప్ప చికిత్సలుచేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి రోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 80 నుంచి వందమంది రోగులు వస్తుంటారు. ప్రతిరోగికి ఒకే రకమైన మందులు ఇస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్‌ ఆసుప్రతులకు రెఫర్‌ చేస్తున్నారని  రోగులు వాపోతున్నారు. అమడగూరు, గుండువారిపల్లి, మామిడిమేకలపల్లి, కొత్తపల్లి, గాజులపల్లి, కొలిమిరాళ్లపల్లి గ్రామాల్లో ప్రతి ఇంటికి ఇద్దరునుంచి ముగ్గురు వరకు విషజ్వరాల బారిన పడ్డారు. 


తనకల్లులోనూ అంతే...


 తనకల్లు, సెప్టెంబరు 28: తనకల్లు మండల పరిధిలోని పెద్దపల్లి, వడ్డుమరవపల్లి, మల్లిరెడ్డిపల్లి, కొత్తకురవపల్లి, నడిమికుంటపల్లి, సుబ్బరాయునిపల్లి, నక్కరాళ్ళతండా గ్రామాలు జ్వరాల బారిన పడ్డాయి. ఈగ్రామాల్లో ఒక్కొక్క ఇంటికి ముగ్గురు, నలుగురు జ్వరాల పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామాలు కర్ణాటక రాషా్ట్రనికి సరిహద్దుగా ఉన్నాయి. దీంతో జ్వరాలబారిన పడ్డవారు కర్ణాటక పరిధిలోని చాకివేలుకు వెళ్లి వైద్యసేవలు పొందుతున్నారు.  గ్రామాల్లో దోమలు పెరిగిపోవడంతో జ్వరాలు వస్తున్నట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యసిబ్బంది మందులు, మాత్రలు ఇచ్చి వెళ్తున్నా, జ్వరాలు తగ్గడంలేదని జ్వరబాధితులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఈప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతోపాటు, జ్వరాలు తగ్గేల పరిసరాల పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.



Updated Date - 2022-09-29T05:19:38+05:30 IST