నా రాజీనామాతోనే టీఆర్‌ఎస్‌ పతనం షురూ...

ABN , First Publish Date - 2021-11-28T05:24:05+05:30 IST

ఉద్యమ పార్టీగా ప్రారంభమై రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ పతనం తన రాజీనామాతోనే మొదలైందని ఆ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న సర్దార్‌ రవీందర్‌సింగ్‌ అన్నారు.

నా రాజీనామాతోనే టీఆర్‌ఎస్‌ పతనం షురూ...

 - నామినేషన్‌ తిరస్కరించే కుట్రలు చేసినప్పుడే నైతిక విజయం సాధించా

- కరీంనగర్‌లో ఉండే వారికే ఓటు వేయండి 

- ఎమ్మెల్సీ స్వతంత్ర రవీందర్‌సింగ్‌ 

కరీంనగర్‌ టౌన్‌, నవంబర్‌ 27: ఉద్యమ పార్టీగా ప్రారంభమై రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ పతనం తన రాజీనామాతోనే మొదలైందని ఆ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న సర్దార్‌ రవీందర్‌సింగ్‌ అన్నారు. శనివారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌లో చేరి ఉద్యమాన్ని ఉవ్వెత్తుకు తీసుకెళ్లడంలో ఎంతగానో కృషి చేశానని అన్నారు. 2006లో అప్పటి ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్‌ అర్జున గుట్టకు వెళ్లిన సందర్భంగా అక్కడ దేవుడి సాక్షిగా తనకు ఎమ్మెల్సీగా అవకాశమిస్తామని చెప్పారని, మరో మూడుసార్లు కూడా తాను అడగకున్నా అదే హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఎమ్మెల్సీగా తనకు అవకాశమిస్తామని ఇచ్చిన హామీ మేరకు ఈసారి తాను పోటీకి సిద్ధపడగా తనను పొమ్మనలేక పొగబెట్టి బద్నాం చేస్తున్నారని, ఉద్యమ ద్రోహులకు పెద్దపీట వేస్తూ ఉద్యమకారులను పట్టించుకోవడం లేదన్నారు. తన నామినేషన్‌ను తిరస్కరించేందుకు తీవ్రంగా కృషిచేశారని, కుట్రలు, కుతంత్రాల మధ్య తన నామినేషన్‌ ఓకే అయిందని, తన నామినేషన్‌ను తిరస్కరించే కుట్ర చేసినప్పుడే నైతిక విజయం సాధించానని అన్నారు. మేయర్‌ పదవి అడగలేదని, తాను ఎమ్మెల్సీ మాత్రమే అడుగగా ఈసారి నీకేనంటూ చెప్పి మోసం చేయడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాల్సి వచ్చిందని వెల్లడించారు. మేయర్‌గా నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, రూపాయికే నల్లా కనెక్షన్‌, దహనసంస్కారాల వంటి పథకాలతో దేశంలోనే గుర్తింపు తెచ్చానని అన్నారు. స్మార్ట్‌సిటీ కోసం ఎంతగానో కృషిచేసి శ్రమించి నిధులు తెస్తే ఇప్పుడు నాసిరకం పనులతో కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని విమర్శించారు. రెండుసార్లు ఎమ్మెల్సీగా గెలిచిన ప్రస్తుత టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భానుప్రసాద్‌రావు ఏనాడూ ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లను పట్టించుకోలేదని, కనీసం ఇక్కడ కార్యాలయం కూడా ఏర్పాటు చేయలేదన్నారు. స్థానిక సంస్థల సమస్యలపై ఏనాడు ఉద్యమించాడో చెప్పాలని డిమాండ్‌ చేశారు. స్థానిక సంస్థల అభివృద్ధి, ప్రాదేశిక సభ్యుల సమస్యలు పట్టించుకోని భానుప్రసాద్‌ తిరిగి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని నిలదీశారు. వాళ్లు గెలిస్తే హైదరాబాద్‌కే పరిమితమవుతారని, తమ వ్యాపారాల అభివృద్ధి కోసమే పదవిని వినియోగించుకుంటారని విమర్శించారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే కరీంనగర్‌లో కార్యాలయం ఏర్పాటు చేస్తానని, ప్రాదేశిక సభ్యులకు హెల్త్‌కార్డులు అందిస్తామని రవీందర్‌సింగ్‌ ప్రకటించారు. సామాజిక వర్గాల సమీకరణల నేపథ్యంలో పదవులు కేటాయిస్తున్నట్లు చెబుతున్న సీఎం కేసీఆర్‌ ఉద్యమ సమయంలో సకలజనుల సమ్మె చేపట్టారని, అప్పుడు సామాజిక సమీకరణల ఆధారంగా ఆందోళనలు చేశారా అని ప్రశ్నించారు. పదవుల కోసం పాకులాడే వారెవరో ప్రజలకు తెలుసునని, మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌, ఎమ్మెల్సీ కవితకు ఓడిపోయిన వెంటనే పదవులు కట్టబెట్టడం అందరికీ తెలుసునని అన్నారు. ఉద్యమానికి ముందే తాను కౌన్సిలర్‌గా, కార్పొరేటర్‌గా, విద్యార్ధి దశలో కళాశాల అధ్యక్షుడిగా పదవులు చేపట్టాలని చెప్పారు. ప్రజలు కలలుగన్న తెలంగాణ కావాలంటే ఉద్యమకారులు ప్రజాప్రతినిధులు అవుతేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ఎన్ని డబ్బులిచ్చినా తీసుకొని నిరంతరం ప్రజలతో కలిసి ఉండే తనకు ఓటు వేయాలని, స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కరీంనగర్‌ వారినే గెలిపించాలనే కోరారు. భారీ మెజార్టీతో తన విజయం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసమావేశంలో పలువురు మండల ప్రాదేశిక సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-28T05:24:05+05:30 IST