జిల్లాలో వానాకాలం పంటల సాగు అంచనా 4,88,579 ఎకరాలు

ABN , First Publish Date - 2022-05-28T05:05:15+05:30 IST

వానాకాలం సీజన్‌కు వ్యవసాయ శాఖ కసరత్తు మొదలు పెట్టింది.

జిల్లాలో వానాకాలం పంటల సాగు అంచనా 4,88,579 ఎకరాలు

  • ప్రణాళికను రూపొందించిన వ్యవసాయ అధికారులు 
  • పెరగనున్న పత్తి, కంది, చిరుధాన్యాల సాగు విస్తీర్ణం 
  • తగ్గనున్న వరి, మొక్కజొన్న సాగు 
  • విత్తనాలు, ఎరువులు, కాంప్లెక్స్‌, ప్లానింగ్‌ సిద్ధం


వానాకాలం సీజన్‌కు వ్యవసాయ శాఖ కసరత్తు మొదలు పెట్టింది. జూన్‌లోనే నైరుతి రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ చెబుతుండటంతో వానాకాలం సాగుపై అధికారులు దృష్టి సారించారు.  రైతుల ఇబ్బందులు తొలగించేందుకు ముందస్తుగా సాగు ప్రణాళిక రూపొందించారు. వ్యవసాయ క్లస్టర్లవారీగా ఎన్ని ఎకరాల్లో భూమి సాగు అవుతుందని అంచనా వేసి.. ఈ మేరకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సిద్ధం చేస్తున్నారు. 


రంగారెడ్డి అర్బన్‌, మే 27 : ఈసారి వరి సాగును తగ్గించి... పత్తి, కంది సాగుతో పాటు చిరు ధాన్యాల సాగును పెంచాలని వ్యవసాయ అధికారులు నిర్ణయించారు. జిల్లాలో గత వానాకాలం(2021లో) 3,79,675 ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలు సాగు చేయగా.. ఈసారి (2022లో) వానాకాలంలో 4,88,597 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేశారు. ఇందుకనుగుణంగా 26,702 క్వింటాళ్ల విత్తనాలు అవసరం కానున్నాయి. 65శాతం సబ్సిడీపై 789.90 క్వింటాళ్ల జీలుగ, జనుము విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచారు. అలాగే 1,01,841 టన్నుల రసాయనిక ఎరువులు అవసరం కానుండగా.. ప్రస్తుతం 26537.31 టన్నుల ఎరువులను అందుబాటులో ఉంచారు. గతేడాది సాగు విస్తీర్ణం కంటే ఈసారి సాగు విస్తీర్ణం 1,08,904 ఎకరాలు పెరగనుంది.


పెరగనున్న పత్తి, కంది సాగు విస్తీర్ణం

గత వానాకాలంలో గిట్టుబాటు ధరలు లభించని కారణంగా వ్యవసాయశాఖ ఈసారి పత్తి, కంది విస్తీర్ణాన్ని పెంచే విధంగా వ్యవసాయాధికారులు అవగాహన కల్పించనున్నారు. జిల్లాలో 2,75,050 ఎకరాల్లో, కంది 70,520 ఎకరాల్లో సాగు చేసేవిధంగా రైతులను ప్రోత్సహించనున్నారు. 


నకిలీ విత్తనాల నిరోధానికి టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా అధికారులు ముందుకు సాగుతున్నారు. టాస్క్‌ఫోర్స్‌ టీంలు ఏర్పాటుచేసి హెచ్‌టీ పత్తి విత్తనాలు, కల్తీ విత్తనాల సరఫరాను నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే డివిజన్‌స్థాయిలో ఏడీఏ టాస్క్‌ఫోర్స్‌ టీంలు ఏర్పాటుచేసి డీలర్ల దుకాణాలను తనిఖీచేసి నకిలీ విత్తనాల సరఫరాను నిరోధించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. మండలాల్లో వ్యవసాయ, పోలీస్‌ అధికారులతో టాస్క్‌ఫోర్స్‌ టీం ఏర్పాటు చేసి డీలర్ల దుకాణాలు తనిఖీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 


డీసీఎంఎస్‌ ద్వారా పచ్చిరొట్ట విత్తనాలు

65శాతం రాయితీపై ఈ ఏడాది వానాకాలంలో రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు డీసీఎంస్‌ కౌంటర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. సబ్సిడీ విత్తనాలు కొనుగోలు చేసే రైతులు తప్పనిసరిగా పట్టాదార్‌ పాసుపుస్తకం, ఆధార్‌కార్డు తీసుకెళ్లాలి. ఆన్‌లైన్‌ విధానం ద్వారా సబ్సిడీ విత్తనాలు సరఫరా చేస్తున్నారు. 


డ్రై, వెట్‌ డైరెక్ట్‌ వరి సాగు పద్ధతులపై ప్రోత్సాహం

ఆధునిక పద్ధతుల ద్వారా డ్రై, వెట్‌ డైరెక్ట్‌ వరి సాగు పద్ధతులను ప్రతి క్లస్టర్‌లో వ్యవసాయ విస్తరణ అధికారి తన క్లస్టర్‌ పరిధిలోని గ్రామాల్లో 25మంది రైతులు 50ఎకరాల్లో ప్రదర్శన క్షేత్రస్థాయిలో ఎంపిక చేసుకుంటున్నారు. ప్రతి వ్యవసాయ విస్తరణ అధికారి తమ పరిధిలోని ప్రదర్శన క్షేత్రం సందర్శించి ప్రతి ఆక్టివిటీని అన్ని లెవల్లో సీజన్‌లో మొత్తం పరిశీలించి డ్యాక్యుమెంటేషన్‌ తయారు చేసేలా అధికారులు ప్లాన్‌ చేసుకున్నారు. అలాగే భాస్వరం జీవన ఎరువులను వినియోగించేలా రైతులను ప్రోత్సహించనున్నారు.


అధిక సాంద్రత పద్ధతిలో ఒకేసారి పత్తి తీత

ఈ పథకంలో వానాకాలం 2022లో మాడ్గుల్‌ మండలంలో 300 ఎకరాలు, ఆమనగల్లు మండలంలో 100 ఎకరాలు, తలకొండపల్లి మండలంలో 100 ఎకరాలు మొత్తం 500 ఎకరాల్లో అధిక సాంద్రత పద్ధతిలో ఒకేసారి పత్తి తీయుట ప్రదర్శన క్షేత్రంను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. అలాగే రాశి సీడ్స్‌ ప్రమేయంతో 1,240 ఎకరాల్లో ప్రణాళికను తయారు చేశారు. మాడ్గుల మండలంలో 510 ఎకరాలు, ఆమనగల్లు మండలంలో 400 ఎకరాలు, తలకొండపల్లి మండలంలో 330 ఎకరాల్లో సాగు చేయడం కోసం ప్రణాళికలు రూపొందించారు.


అంచనాలు రూపొందించాం

జిల్లాలో వానాకాలం పంటల సాగు అంచనాలను రూపొందించాము. అందుకనుగుణంగా విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచేందుకు కసరత్తులు చేస్తున్నాము. జిల్లాలో ఈసారి వరి, మొక్కజొన్న సాగు విస్తీర్ణాన్ని తగ్గించడం జరిగింది. పత్తి, కంది, చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రోత్సహిస్తున్నాము. పత్తిసాగులో హెచ్‌టీ పత్తి విత్తనాలు గురించి అప్రమత్తంగా ఉండాలి. హెచ్‌టి పాజిటివ్‌ (హెచ్‌టీ) పత్తి విత్తనాలు జీఈఏసీ అనుమతి లేదు. అనధికార వ్యక్తులు హెచ్‌టీ పాజిటివ్‌ విత్తనాలను నేరుగా రైతులకు అమ్మటానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి అధికారులకు సమాచారం ఇవ్వాలి. నకిలీ విత్తనాలు అమ్మితే.. చర్యలు తప్పవు. 

- గీతారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి 


కావాల్సిన విత్తనాలు ( క్వింటాలలో)

పంట విత్తన పరిమాణం

వరి 18,750

కందులు 2,820.8

పత్తి(ప్యాకెట్లు) 5,50,100 

(450 గ్రాములు)

జొన్న 600

మినునములు 13.6

వేరుశనగ 144

పెసర్లు 28

ఆముదం 03

సోయాబీన్‌ 07

ఇతర పంటలు 495

మొత్తం 26,702


===========================


2022 వానాకాలం సాగు విస్తీర్ణం 

(తాత్కాలిక అంచనా ఎకరాల్లో)

పంట 2021 2022

వరి 1,30,430 75,000

జొన్న 4,209 15,000

మొక్కజొన్న 74,195 48,000

పెసర్లు 121 352

కందులు 35,571 70,520

పత్తి 1,31,600 2,75,050

మినుములు 44 170

వేరుశనగ 231 240

ఆముదం 25 120

సోయాబీన్‌ 84 20

ఇతర పంటలు 3,165 4,125

మొత్తం 3,79,675 4,88,579


============================


రసాయనిక ఎరువులు వానాకాలం 2022 ప్రణాళిక 

ఎరువు కావాల్సిన పరిమాణం అందుబాటులో ఉన్న  రసాయనిక

(టన్నులలో) ఎరువుల మోతాదు (టన్నులలో)

యూరియా 41,930 14,523

డీఏపీ 19,567 3,291.65

ఎస్‌ఎస్‌పి 3,421 1,53.43

ఎమ్‌ఓపీ 4,822 296.69

కాంప్లెక్స్‌ 32,101 8,272.54

మొత్తం 1,01,841 26,537.31



Updated Date - 2022-05-28T05:05:15+05:30 IST