ఉపాధి కూలి రూ.600 చెల్లించాలి

ABN , First Publish Date - 2022-05-21T06:03:14+05:30 IST

ఉపాధి కూలి రూ.600 చెల్లించాలి

ఉపాధి కూలి రూ.600 చెల్లించాలి
డీఆర్‌డీఏ ఎదుట నిరసన తెలుపుతున్న కూలీలు

నీడ, నీరు, వైద్యం కల్పించటంలో అధికారులు విఫలం

ఏడు వారాలుగా కూలీలకు డబ్బులు చెల్లించలేదు

పలుగు, పార, తట్ట పట్టి కదిలిన కూలీలు

ప్రజాపంథా ఆధ్వర్యంలో ఖమ్మంలో ఉపాధి కూలీల వినూత్న ధర్నా

ఖమ్మంసంక్షేమవిభాగం, మే 20: ఉపాధి కూలీలకు ఏడువారాలుగా కూలీ డబ్బులు బ్యాంకు ఖాతాల్లో పడటం లేదని, కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించటంలో అధికారులు విఫలం చెందారని, పెరిగిన నిత్యావసరాలకు తగిన విధంగా రోజుకు కూలీ రూ.600ఇవ్వాలని ప్రజాపంథా జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం ప్రజాపంథా, అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో కూలీలు పలుగు, పార, తట్ట పట్టి ఖమ్మంలో ప్రదర్శన చేపట్టారు. డీఆర్‌డీఏ కార్యాలయం ముట్టడి చేపట్టారు. ఈ సందర్భంగా గోకినపల్లి వెంకటేశ్వరరావు, ఆవుల అశోక్‌ మాట్లాడుతూ 2005లో కూలీలకు పనులు కల్పించి వలసలను నిరోధించేందుకు రూపొందించిన ఉపాధి హామీ పథకంలో మార్పు లు చేసిలక్ష్యాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఉపాధి కూలీలను దెబ్బతీసే 333 జీవోను కేంద్రం వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌చేశారు. నెలల తరబడి కూలీలకు డబ్బులు రాకపోవటంతో పూ ట గడవటం కష్టంగా ఉందన్నారు. రైతులు వ్యవసాయం చేయకపోవటంతో ఆ ప్రభావం కూలీలపై పడిందన్నారు. వంద రోజుల పనిదినాలను 200రోజులుగా మార్పులు చేయాలని కోరారు. వేసవికాలం భత్యం 30శాతం ఇవ్వటంలేదని విమర్శించారు. కూలీలకు బీమా, రవాణా సౌకర్యాలు కల్పించటంలేదని, కనీసం కూలీలకు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందించటంలో అధికారులు విఫలం చెందారని ఆరోపించారు. కార్యక్రమంలో ప్రజాపంథా, ఏఐకేఎంఎస్‌ నాయకులు మలీదు నాగేశ్వరరావు, ఆర్‌.శివలింగం, బందెల వెంకయ్య, కంకణాల అర్జునరావు, లాజర్‌, సీవై పుల్లయ్య, టీఝాన్సీ, మంగతాయి, శ్రీనివాస్‌, వెంకన్న, జీ రామయ్య, రాకేష్‌, చందు, శ్రీనివాసరావు, స్టీవెన, రామదాసు పాల్గొన్నారు.


ఉపాధి కూలీల వినూత్న ధర్నా

ఉపాధి కూలీలు శుక్రవారం జిల్లా డ్వామా కార్యాలయానికి పలుగు, పార, తట్ట పట్టి జిల్లా ఉపాధి కార్యాలయానికి కదంతొక్కారు. ఉపాధి కార్యాలయం ఎదుట తట్టలు పట్టి తమ సమస్యలు పరిష్కరించాలని అధికారులను వేడుకున్నారు. జిల్లా ఉపాధి కార్యాలయంలో మొక్కలకు పాదులు చేసి కార్యాలయం శుభ్రం చేసి వినూత్నంగా తమ సమస్యలను వివరించారు. డీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట ఎక్కువ సమయం పాటు కూలీలు ధర్నా చేయటంతో అక్కడకు చేరుకున్న పోలీసులు కూలీలు, నాయకు ల గడ్డం పట్టుకొని ధర్నాను ముగించాలని కోరారు. కూలీలకు ప్రజాపంథా(ఎన్డీ) పార్టీ సంఘీభావం తెలిపారు.

Updated Date - 2022-05-21T06:03:14+05:30 IST