టీడీపీ అగ్ర కమిటీలలో జిల్లాకు దక్కని చోటు

ABN , First Publish Date - 2020-10-20T08:00:32+05:30 IST

తెలుగుదేశం పార్టీలో కీలకమైన రెండు కమిటీల్లో జిల్లాకు చెందిన వారిలో ఎవరికీ స్థానం దక్కలేదు. సోమవారం ఆ పార్టీ జాతీయ

టీడీపీ అగ్ర కమిటీలలో జిల్లాకు దక్కని చోటు

సీనియర్లు దూరం కావటం, యువతకు కిందిస్థాయిలో ప్రాధాన్యత ఇవ్వటమే కారణ ం 

రాష్ట్ర కమిటీలో ఒకరిద్దరికి చోటుదక్కే అవకాశం 

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు) 

తెలుగుదేశం పార్టీలో కీలకమైన రెండు కమిటీల్లో జిల్లాకు చెందిన వారిలో ఎవరికీ స్థానం దక్కలేదు. సోమవారం ఆ పార్టీ జాతీయ కమిటీని, రాష్ట్రస్థాయిలో కీలకమైన పొలిట్‌బ్యూరోను ప్రకటించింది. జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు ప్రకటించిన ఈ జాబితాలో జాతీయస్థాయిలో ప్రధాన కార్యదర్శిగా గతంలో నారా లోకేష్‌ ఒక్కరే ఉండగా ఇప్పుడు మరికొందరికి ప్రధాన కార్యదర్శి పదవులు కేటాయించటం విశేషం. గతంలో జిల్లా నుంచి పార్టీ జాతీయ కమిటీలో మాజీమంత్రి శిద్దా రాఘవరావు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తదితరులు ప్రాతినిధ్యం వహించారు.


ప్రస్తుతం జాతీయ కమిటీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి స్థాయిలో పార్టీలోని మహిళలు, యువ నాయకత్వానికి ప్రాధాన్యమిచ్చినప్పటికీ జిల్లా నుంచి ఎవరికీ అవకాశం దక్కలేదు. గత ఒకటిన్నర దశాబ్ధకాలంలో పొలిట్‌బ్యూరోలో జిల్లాలో ఎవరికీ అవకాశం దక్కకపోవటం ఇదే ప్రథమం. పార్టీ చంద్రబాబునాయుడు చేతిలోకి రాకమునుపు ఒకరిద్దరు నాయకులు జిల్లా నుంచి పార్టీ కీలక పదవుల్లో స్థానం దక్కించుకున్నారు. చంద్రబాబు హయాం ప్రారంభమైన తర్వాత దాదాపుగా 2004 నుంచి ఇప్పటివరకు జిల్లాకు చెందిన ఒకరిద్దరు నాయకులు కీలక పదవుల్లో ఉన్నారు.


పార్టీ పొలిట్‌బ్యూరోలో ఉండటంతో పాటు జాతీయ కమిటీలో కోశాధికారి, ఉపాధ్యక్షుడు లాంటి పదవులు కూడా జిల్లాకు దక్కాయి. కానీ ప్రస్తుతం ఆ పార్టీ ప్రకటించిన కేంద్ర కమిటీలో కానీ, పొలిట్‌బ్యూరోలో కానీ జిల్లా నుంచి ఎవరికీ స్థానం దక్కలేదు. ఇటీవల చోటుచేసుకున్న కొన్ని రాజకీయ పరిణామాల్లో జిల్లాలో ఆ పార్టీకి సీనియర్‌ నాయకులుగా ఉన్న చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు వైసీపీలో చేరిపోయారు. గతంలో బలరాం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, పొలిట్‌బ్యూరో సభ్యునిగా, తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశారు.


శిద్దా రాఘవరావు జాతీయ కమిటీలో కోశాధికారిగా, రాష్ట్ర కమిటీలో పొలిట్‌బ్యూరో సభ్యునిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం కూడా పార్టీ రాష్ట్ర నాయకత్వం, ముఖ్యంగా చంద్రబాబు జిల్లా నుంచి ఆరెండు కమిటీలలో కనీసం ఒకరికైనా అవకాశం ఇవ్వాలని పరిశీలించినట్లు తెలిసింది. అయితే యువ నాయకత్వాన్ని కిందిస్థాయిలో కీలక పదవుల్లో వినియోగించుకోవాలన్న ఆలోచనతో పాటు పార్టీలో క్రియాశీలకపాత్ర పోషించని సీనియర్లను పక్కన బెట్టాలన్న ఆలోచనతోనే ఆ రెండు కమిటీల్లో ఎవరికీ స్థానం కల్పించలేకపోయారని అంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉండి భారం మోసేందుకు ముందుకొచ్చిన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకి బాపట్ల లోక్‌సభ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. కనిగిరి మాజీ ఎమ్మెల్యే డా. ఉగ్రనరసింహారెడ్డికి రాష్ట్రస్థాయిలో గుర్తింపునిస్తూ చిత్తూరు, తిరుపతి లోక్‌సభ నియోజకవర్గాల కోఆర్డినేటర్‌ బాధ్యతలు అప్పగించారు.


ఇక బీసీల నుంచి పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నూకసాని బాలాజీకి ఒంగోలు లోక్‌సభ పార్టీ అధ్యక్ష పదవిని అప్పజెప్పారు. వీటన్నిటికీ తోడు కిందిస్థాయిలో జనసంబంధాలు, పార్టీ పట్ల నిబద్ధత ఉన్న నాయకులను నియోజకవర్గ స్థాయిలో కూడా ప్రోత్సహించాలని ఆ పార్టీ భావిస్తోంది. అందుకనుగుణంగానే అధిష్టానం దృష్టిలో ఉన్న గూడూరి ఎరిక్షన్‌బాబుకు రాష్ట్రస్థాయిలో ఎస్సీ విభాగ కమిటీల్లో ప్రాధాన్యమివ్వటంతో పాటు ఎర్రగొండపాలెం నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు తీసుకోమని సూచించినట్లు తెలిసింది. పార్టీ రాష్ట్ర నాయకులకు నిత్యం అందుబాటులో ఉంటూ పార్టీ నిర్మాణ వ్యవహారాల్లో కూడా పాలుపంచుకుంటున్న దర్శి నియోజకవర్గంలోని మర్రెడ్డి శ్రీనివాసరెడ్డికి తెలుగురైతు రాష్ట్ర అధ్యక్ష పదవినిచ్చారు. ఇలా జిల్లాలోని మరికొందరు యువ నాయకులను అవసరానికి అనుగుణంగా స్థానిక బాధ్యతల్లోను కాకుంటే ఆయా విభాగాల్లో రాష్ట్ర బాధ్యతల్లో వినియోగించుకోవాలన్న ఉద్దేశంతోనే అడుగులేస్తున్నారు.


కాగా అచ్చెంనాయుడు అధ్యక్షతన ఏర్పడే రాష్ట్ర కమిటీలో ఒకరిద్దరికి అవకాశం లభించవచ్చని తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సాయికల్పనరెడ్డి, మరో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు లాంటి మరికొందరిని పరిగణనలోకి తీసుకుని వారిలో ఒకరిద్దరికి పార్టీ రాష్ట్ర కమిటీలో ప్రాధాన్యతనివ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. జిల్లాలో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల్లో కనిగిరి ఇన్‌చార్జ్‌గా వినూత్న కార్యక్రమాలు నిర్వహించటంతో పాటు ప్రస్తుత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడు రిమాండ్‌లో ఉంటూ ఆరోగ్య సమస్యలతో గుంటూరులో చికిత్స పొందినప్పుడు కీలకమైన సేవలందించిన డా. ఉగ్రనరసింహారెడ్డికి మరింత ప్రాధాన్యతనివ్వాలని రాష్ట్ర నాయకత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. చీరాల టీడీపీ ఇన్‌చార్జ్‌ బాలాజీని కూడా పరిగణనలోకి తీసుకుని పార్టీ పదవులలో ప్రాధాన్యమివ్వాలని కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం.


మరోవైపు వారి ఆర్థిక మూలాలను దెబ్బతీసి టీడీపీకి వారిని దూరం చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురిచేసిన అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్‌, కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావులను పార్టీపరంగా ఎలా వినియోగించుకోవాలన్న విషయంపై చంద్రబాబు ఆలోచన చేస్తూ వారి అభిప్రాయాలను కూడా తెలుసుకోవటం విశేషం.

Updated Date - 2020-10-20T08:00:32+05:30 IST