ఇంటి దీపాన్ని బలిగొన్న ప్రమాదం

ABN , First Publish Date - 2021-03-07T06:04:03+05:30 IST

భర్త చనిపోయినా ముగ్గురు ఆడ పిల్లలతో కష్టాలను ఎదురొడ్డిన ఆమె ప్రమాదంలో మృత్యువాత పడింది. పాడి గేదెలను నమ్ముకుని తన కూతుళ్లను పెంచీ పెద్దచేసిన ఆ తల్లీ మరణంతో అమ్మాయిలు ఇంటి పెద్దదిక్కును కోల్పోయారు.

ఇంటి దీపాన్ని బలిగొన్న ప్రమాదం
లింగమ్మ మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబసభ్యులు


 రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి, గేదెలు సైతం.. 

 భర్త మృతి చెందడంతో గేదెలను మేపుతూ సాకిన తల్లి


సూర్యాపేటరూరల్‌, మార్చి 6: భర్త చనిపోయినా ముగ్గురు ఆడ పిల్లలతో కష్టాలను ఎదురొడ్డిన ఆమె ప్రమాదంలో మృత్యువాత పడింది. పాడి గేదెలను నమ్ముకుని తన కూతుళ్లను పెంచీ పెద్దచేసిన ఆ తల్లీ మరణంతో అమ్మాయిలు ఇంటి పెద్దదిక్కును కోల్పోయారు. ఈ సంఘటన సూర్యాపేట మండలం యర్కారం గ్రామ సమీపంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం యర్కారం గ్రామానికి చెందిన చింతలపాటి లింగమ్మ(43) గేదెలను మేపుకుంటూ జీవనం సాగిస్తోంది. భర్త గతంలోనే చనిపోగా, ముగ్గురు కుమార్తెలున్నారు. అయినా ఆమె కుంగిపోకుండా ఆడపిల్లలను పోషించుకుంటూ  ఉన్నత చదువులను చదివించింది. ఇటీవలే పెద్దకూతురు వివాహం కూడా జరిపించింది. రెండో కూతురు డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్‌లో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తోంది. చిన్న కూతురు డిగ్రీ మెదటి సంవత్సరం చదువుతూ ఇంటి వద్ద ఉంటోంది. వారిద్దరూ మంచీచెడులు చూసుకుంటూ తమ జీవితాలను నెట్టుకువస్తున్నారు. రోజులాగే తనకున్న మూడు గేదెలను తీసుకుని గ్రామం నుంచి రాజానాయక్‌ తండా సమీపంలో రోడ్డువెంట వెళుతోంది. ఈ క్రమంలో జనగాం వైపు వెళ్తున్న ట్రక్కు అతివేగంతో లింగమ్మతో పాటు మూడు గేదెలు ఢీకొట్టి పైనుంచి దూసుకువెళ్లింది. ప్రమాదంలో లింగమ్మతో పాటు మూడుగేదెలు కూడా అక్కడికక్కడే మృతి చెందాయి. తండ్రి లేకున్నా ఆత్మస్థైర్యంతో తమను కాపాడుకుంటూ వచ్చిన తల్లి చనిపోవడంతో ఆమె కుమార్తెలు దిక్కులేని వారయ్యారు. వారు రోదిస్తున్న తీరు గ్రామస్థులను కంటతడి పెట్టించింది. ప్రమాదంపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.




Updated Date - 2021-03-07T06:04:03+05:30 IST