మృతదేహం చెంతనే సెటిల్‌మెంట్‌

ABN , First Publish Date - 2021-02-26T05:30:00+05:30 IST

తనకు రావలసిన ఆస్తి హక్కులు ఇస్తే కానీ, అత్త మృతదేహాన్ని విడిచిపెట్టేది లేదని కోడలు భీష్మించుకున్న సంఘటన వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది.

మృతదేహం చెంతనే సెటిల్‌మెంట్‌

 న్యాయం చేయాలంటూ అత్త అంత్యక్రియలను అడ్డుకున్న కోడలు 

  పోలీసులు, గ్రామపెద్దల చొరవతో సమస్యకు పరిష్కారం

వజ్రపుకొత్తూరు, ఫిబ్రవరి 26 : తనకు రావలసిన ఆస్తి హక్కులు ఇస్తే కానీ, అత్త మృతదేహాన్ని విడిచిపెట్టేది లేదని కోడలు భీష్మించుకున్న సంఘటన వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. అక్కుపల్లి గ్రామానికి చెందిన పొట్టి భూలక్ష్మి భర్త 2013లో చనిపోయారు. ఆమె కుమారుడు విజయకుమార్‌ కూడా 2016లో అనారోగ్యంతో మృతిచెందారు. అప్పటి నుంచి కోడలు పొట్టి ప్రమీల.. గుంగువాడలోని ఆమె కన్నవారింటి దగ్గర ఉంటోంది. కాశీబుగ్గలోని కుమార్తె ఇంటి వద్ద  భూలక్ష్మి జీవనం సాగిస్తోంది. అనారోగ్యంతో మంచం పట్టిన భూలక్ష్మి  గురువారం రాత్రి మృతి చెందింది. శుక్రవారం ఉదయం అంత్యక్రియలకు ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులు అక్కుపల్లికి తరలించారు. విషయం తెలుసుకున్న కోడలు ప్రమీల.. తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కుపల్లి చేరుకుంది. అత్తవారింటి నుంచి తనకు రావాల్సిన ఆస్తి ఇచ్చేవరకూ అంత్యక్రియలు నిర్వహించరాదంటూ ఆమె పట్టుబట్టింది. దహన సంస్కారాలు నిర్వహించకుండా మృతదేహాన్ని అడ్డుకుంది. గ్రామస్థులు ఎంత నచ్చజెప్పినా వెనక్కి తగ్గలేదు. దీంతో ఎస్‌ఐ కూన గోవిందరావు పోలీసులతో అక్కుపల్లి చేరుకున్నారు. మృతురాలి కోడలు ప్రమీలతో గ్రామపెద్దలు చర్చించారు. వారి సమక్షంలో ఆస్తి సమస్య పరిష్కారానికి అంగీకారం కుదిర్చారు. దీంతో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రమీల అంగీకరించింది. ఈ ఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ గోవిందరావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. రోజంతా గ్రామంలో మృతదేహం ఉండిపోయిందనే విషయం తెలుసుకుని.. సమస్య పరిష్కరించామని వివరించారు. 

Updated Date - 2021-02-26T05:30:00+05:30 IST