నిర్మాణ రంగం కుదేలు!

ABN , First Publish Date - 2020-06-02T10:19:08+05:30 IST

లాక్‌డౌన్‌ ప్రభావంతో నిర్మాణ రంగం కుదేలైంది. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా నిర్మాణ పనులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది

నిర్మాణ రంగం కుదేలు!

లాక్‌డౌన్‌ ప్రభావంతో సిమెంట్‌, ఇనుము ధరలకు రెక్కలు

నిలిచిన నిర్మాణాలు.. కార్మికులకు తప్పని ఇబ్బందులు


(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి/నరసన్నపేట)

లాక్‌డౌన్‌ ప్రభావంతో నిర్మాణ రంగం కుదేలైంది. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా నిర్మాణ పనులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ సిమెంట్‌, ఇసుక, ఐరన్‌ తదితర నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో పనులు చేపట్టేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు.  ప్రభుత్వ పనులు సైతం ముందుకు సాగడం లేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు చెల్లిస్తేనే.. పనులు చేపడతామని కాంట్రాక్టర్లు భీష్మిస్తున్నారు. దీంతో నిర్మాణ రంగం డీలా పడి.. కార్మికులకు ఉపాధి కరువవుతోంది. 


నిర్మాణ రంగంపైనా కరోనా ప్రభావం పడింది. ఒకప్పుడు లక్షలాది మందికి ఉపాధి కల్పించిన భవన నిర్మాణ రంగం.. ప్రస్తుతం లాక్‌డౌన్‌తో పాటు నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో కుదేలైంది. లాక్‌డౌన్‌ కారణంగా గృహ నిర్మాణాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు భవన నిర్మాణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రభుత్వం సడలింపులు ఇవ్వడంతో భవన నిర్మాణ పనులు ఊపందుకుంటాయని అంతా భావించారు. కానీ లాక్‌డౌన్‌ దెబ్బకు సిమెంట్‌ కంపెనీలు భారీగా ధరలు పెంచేశాయి. భవన నిర్మాణ పనులకు అత్యవసరమైన సిమెంట్‌ ధరలకు రెక్కలొచ్చాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉత్పత్తి కంపెనీలు సిండికేట్‌గా మారడంతో సిమెంట్‌ ధరలు పెరిగాయి. దీంతో నిర్మాణదారులు పనులు చేపట్టేందుకు వెనుకంజ వేస్తున్నారు.


సిమెంట్‌తో ముడిపడిన ఏ పని చేపట్టాలన్నా కాంట్రాక్టర్లు, భవన నిర్మాణదారులు పరేషాన్‌ అవుతున్నారు. లాక్‌డౌన్‌కు ముందు సిమెంట్‌ బస్తా రూ. 300 ఉండగా.. ప్రస్తుతం రూ.400కి చేరుకుంది. మరోపక్క ఐరన్‌ ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఐరన్‌ టన్నుపై రూ.2వేల నుంచి ఐదు వేలు వరకు ధర పెంచేశారు. విశాఖ ఐరన్‌ గతంలో టన్ను ధర రూ.51 వేలు ఉంటే ప్రస్తుతం రూ.55వేలకు విక్రయిస్తున్నారు. లోకల్‌ రకం ఐరన్‌ టన్ను గతంలో రూ.48 వేలు ఉండగా, ప్రస్తుతం దీనికి అదనంగా రూ.2వేలు పెంచేశారు.  ఇంకోవైపు నాగావళి, వంశధార నదులు చెంతనే ఉన్నా.. ఇసుక సైతం అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందించింది. ప్రస్తుత ప్రభుత్వం ఏపీఎండీసీ ద్వారా ఆన్‌లైన్‌లో ఇసుకను విక్రయిస్తోంది. దళారులు, చోటా నాయకులు దొడ్డిదారిన ఇసుక సేకరించి.. అడ్డగోలుగా ధరలు పెంచేసి విక్రయిస్తున్నారు. ప్రభుత్వం టన్ను ఇసుక ధర రూ.375 నిర్ణయించగా, ప్రైవేటు భవన నిర్మాణాలకు రూ.1200 వరకు వసూలు చేస్తున్నారు.


కొంతకాలంగా ఆన్‌లైన్‌ బుకింగ్‌లు ఆపేశారు. నేరుగా లబ్ధిదారుడి ఇంటికే సరఫరా చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. ఎక్కడా ఆచరణకు నోచుకోవడం లేదు. ఇలా.. మొత్తంగా నిర్మాణ సామగ్రి ధర పెరగడంతో ఒక్కో భవన నిర్మాణానికి అంచనా కంటే అదనంగా సుమారు రూ.3 లక్షల వరకు ఖర్చువుతోందని నిర్మాణదారులు వాపోతున్నారు. అదనపు పెట్టుబడి పెట్టలేక నిర్మాణాలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నారు. శ్రీకాకుళంలో పీఎన్‌ కాలనీ, విశాఖ ఏ కాలనీ, రాగోలు, బలగ, శాంతినగర్‌, గుజరాతిపేట వంటి ప్రాంతాల్లో అనేక అపార్ట్‌మెంట్‌ల పనులను నిలిపివేశారు. బిల్డర్లు పనులు ప్రారంభించేందుకు సుముఖంగా లేరు. అన్నింటిపైనా ధరలు పెరిగిన నేపథ్యంలో.. నిర్మాణ పనులు చేయడం తమ వల్ల కాదని కాంట్రాక్టర్లు ఏర్కొంటున్నారు. పాత టెండర్ల ప్రకారం చేయడానికి గిట్టబాబు కావడం లేదని, పోనీ ప్రస్తుత ధరలకు అనుగుణంగా ఎలాగోలా పనులు చేపడదామనుకుంటే అధికారులు ఒప్పుకోవడం లేదని కాంట్రాక్టర్లు  చెప్పుకొస్తున్నారు. టెండర్‌ కోడ్‌ ప్రకారం పనులు చేస్తే నష్టాలు తప్పవని వారు వాపోతున్నారు.


కదలని ప్రభుత్వ నిర్మాణాలు...

లాక్‌డౌన్‌ కారణంగా జిల్లాలో అనేక ప్రభుత్వ భవన నిర్మాణాలు నిలిచిపోయాయి. లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చినా, కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించడం లేదు. పెరిగిన సిమెంట్‌, ఐరన్‌ రేట్లను అదనంగా చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఉదాహరణకు సీతంపేట ఐటీడీఏ పరిధిలో 23 గిరిజన గ్రామాలకు తాగునీటిని అందించేందుకు రూ.10కోట్ల అంచనా వ్యయంతో రక్షితనీటి పథకాల పనులు ప్రారంభించారు. లాక్‌డౌన్‌ ప్రభావంతో ఈ పనులు నిలిచిపోయాయి. పెరిగిన నిర్మాణ సామగ్రి ధరలు చెల్లించే వరకూ పనులు ప్రారంభించేది లేదని కాంట్రాక్టర్‌ చెబుతున్నారు. దీంతో గిరిజనులకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. 


ఉపాధిహామీ కన్వర్జెన్సీలో భాగంగా రూ.75 కోట్ల అంచనాలతో కొత్తగా గ్రామాల్లో సిమెంట్‌ రహదారులు నిర్మించతలపెట్టారు. పెరిగిన ధరలకు భయపడి పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. 


నాడు-నేడు పనుల్లో భాగంగా ప్రభుత్వ  పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. నిర్మాణ సామగ్రి ధరల పెంపు.. ఈ పనులపైనా పడింది. కేవలం 60 శాతం పనులు మాత్రమే ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది. 


కార్మికులకు ఉపాధి కరువు..

జిల్లాలో నిర్మాణాలు సాగకపోవడంతో భవన నిర్మాణ కార్మికులకు పనులు దొరకని పరిస్థితి నెలకొంది. జిలాలో దాదాపు 3.50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. వీరంతా పనులు లేక ఖాళీగానే ఉంటున్నారు. ఇన్నాళ్లూ ఇసుక ర్యాంపులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో ఇసుక లేక నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం జిల్లా అంతటా ఇసుక ర్యాంపులకు అనుమతి ఇవ్వడంతో సామాన్యులు ఇళ్లు కట్టుకునేందుకు ముందుకు వచ్చారు. ఈ తరుణంలో సిమెంట్‌ ధరల పెంపు వారికి షాక్‌ ఇచ్చాయి.


దీంతో భవన నిర్మాణాలు నిలిచిపోయాయి. మరోవైపు వ్యవసాయ పనులు కూడా లేకపోవడంతో కార్మికులు అవస్థలు పడుతున్నారు. లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడ్డ కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కార్మిక శాఖ ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సాయం కోసం వారంతా ఎదురుచూస్తున్నారు. అలాగే   పెరిగిన సిమెంట్‌, ఐరన్‌ ధరలను నియంత్రించి.. నిర్మాణాలు ఊపందుకునేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. 

Updated Date - 2020-06-02T10:19:08+05:30 IST