సీఎం పర్యటన నేపథ్యంలో అప్రమత్తం

ABN , First Publish Date - 2021-12-17T06:30:52+05:30 IST

నూతన కలెక్టరేట్‌ భవనాన్ని ఈనెల 20వ తేదీన ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

సీఎం పర్యటన నేపథ్యంలో అప్రమత్తం
ఏర్పాట్లను పరిశీలిస్తున్న మునిసిపల్‌ కమిషనర్‌ పూర్ణచందర్‌రావు

కలెక్టరేట్‌ భవనాన్ని పరిశీలించిన మునిసిపల్‌ కమిషనర్‌ 

యాదాద్రి, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): నూతన కలెక్టరేట్‌ భవనాన్ని ఈనెల 20వ తేదీన ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సీఎం కేసీఆర్‌ జిల్లాలో పర్యటించి, కలెక్టరేట్‌ భవనం ప్రారంభించడంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటిస్తారన్న సమాచారం ఉన్నతాధికారులు అందించడంతో, జిల్లాయంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టరేట్‌ భవనంలోని పనులు ఏమేరకు పూర్తయ్యాయి, కార్యాలయాల్లో ఫర్నిచర్‌, విద్యుత్‌, తాగునీటి వసతి, తదితర సౌకర్యాలపై దృష్టి సారించింది. భువనగిరి మునిసిపల్‌ కమిషనర్‌ పూర్ణచందర్‌రావు గురువారం కలెక్టరేట్‌ను సందర్శించి, పనులను పరిశీలించారు. భవననిర్మాణ పనులు పూర్తికావడంతో, ఇంకా ఏమైనా పనులు పెండింగ్‌లో ఉన్నాయా అని ఆరాతీశారు. ప్రస్తుతం సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయి. ల్యాండ్‌స్కేప్‌, ప్రహరీచుట్టూ పూలమొక్కలు, తదితర పనులు పూర్తయ్యే దశలో ఉన్నాయి. ముఖ్యమంత్రి రానున్న దృష్ట్యా పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తిచేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న భువనగిరి-యాదగిరిగుట్ట రోడ్డును మునిసిపల్‌ కమిషనర్‌ పరిశీలించారు. రోడ్డు మరమ్మతులు చేపట్టేందుకు అధికారులతో కలిసి అంచనా వేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో సంబంధిత అధికారులతో కలెక్టర్‌ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. 


కలెక్టరేట్‌ ఆవరణలో హెలీప్యాడ్‌ నిర్మాణం

ప్రభుత్వం నూతన జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్‌ భవనాలను నిర్మిస్తోంది. కలెక్టరేట్‌ భవనంతోపాటు ప్రాంగణమంతా కూడా విశాలంగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. కలెక్టరేట్‌లను కనీసం 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తోంది. అయితే జిల్లాకేంద్రానికి సమీపంలో 25 ఎకరాల ప్రభుత్వ స్థలంలేకపోవడంతో రాయిగిరి వద్ద పట్టుపరిశ్రమశాఖకు చెందిన స్థలంలో కలెక్టరేట్‌ను నిర్మించారు. మొత్తం 12.20 ఎకరాల్లో కలెక్టరేట్‌ భవనం, కలెక్టర్‌, అదనపు కలెక్టర్ల నివాసాలను నిర్మిస్తున్నారు. అన్ని కలెక్టరేట్‌ల వద్ద కూడా హెలీప్యాడ్‌లను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టరేట్‌ ఆవరణలో హెలీప్యాడ్‌ నిర్మాణం పూర్తయింది. అదేవిధంగా గణతంత్ర, స్వాతంత్య్ర, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసేందుకు వీలుగా కలెక్టరేట్‌ భవనానికి ఎదురుగా జెండా దిమ్మెతోపాటు ప్రత్యేకంగా స్థంభాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌ భవనం మొత్తం జీ ప్లస్‌ టూ అంతస్తుల్లో 1,58,756 అడుగుల విస్తీర్ణంలో ఉంది. వీటిలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 53,740 ఎస్‌ఎ్‌ఫటీ, మొదటి అంతస్తు 50,832, రెండో అంతస్తులో 15,428 ఎస్‌ఎఫ్‌టీలో నిర్మించారు. ఈ భవన నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటివరకు రూ.53కోట్లు మంజూరుచేసింది. వీటిలో దాదాపు రూ.53కోట్ల మేరకు పనులు పూర్తయ్యాయి. కాంట్రాక్టర్లు భవనాన్ని ఆర్‌అండ్‌బీ అధికారులకు అప్పజెప్పారు. 

Updated Date - 2021-12-17T06:30:52+05:30 IST