ఉద్యోగుల సమస్యలపై సీఎం స్పందించాలి

ABN , First Publish Date - 2021-12-07T04:59:18+05:30 IST

‘ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ఔట్‌సోర్సింగ్‌, పింఛనర్ల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి జగన్‌ చొరవ చూపాలి’ అని ఏపీ జేఏసీ చైర్మన్‌ బండి శ్రీనివాసరావు, జేఏసీ అమరావతి అసోసియేట్‌ అధ్యక్షుడు ఫణి పేర్రాజులు కోరారు. తమ సంఘాలు ఏ రాజకీయ పార్టీకీ తొత్తులు కావని స్పష్టం చేశారు.

ఉద్యోగుల సమస్యలపై సీఎం స్పందించాలి
మాట్లాడుతున్న ఏపీ జేఏసీ, జేఏసీ అమరావతి నాయకులు బండి శ్రీనివాసరావు, ఫణి పేర్రాజు

- ఏపీ జేఏసీ, జేఏసీ అమరావతి నాయకుల డిమాండ్‌

- నేటి నుంచి ఉద్యమబాట 

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, డిసెంబరు 6)

‘ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ఔట్‌సోర్సింగ్‌, పింఛనర్ల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి జగన్‌ చొరవ చూపాలి’ అని ఏపీ జేఏసీ చైర్మన్‌ బండి శ్రీనివాసరావు, జేఏసీ అమరావతి అసోసియేట్‌ అధ్యక్షుడు ఫణి పేర్రాజులు కోరారు. తమ సంఘాలు ఏ రాజకీయ పార్టీకీ తొత్తులు కావని స్పష్టం చేశారు. సోమవారం శ్రీకాకుళంలోని ఎన్జీవో భవన్‌లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ‘కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్‌, సీపీఎస్‌ రద్దుతో పాటు  రూ.16వేల కోట్లతో ఆర్థికపరమైన డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరాం. కానీ ఉద్యోగుల జీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ డబ్బులు కూడా సక్రమంగా అందట్లేదు. తెలంగాణ మాదిరి.. మన రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ వర్తించడం లేదు. పీఆర్సీ రిపోర్టు కావాలని చీఫ్‌సెక్రటరీకి విన్నవించినా ఇంతవరకు స్పందించలేదు. దీంతో ఉద్యమబాట పట్టాం. ఈ క్రమంలో ప్రభుత్వ తీరుపై ఇటీవల విజయవాడలో మాట్లాడగా.. తాము టీడీపీకి అనుకూలమని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్టు మీడియాలో తప్పుడు ప్రచారం సాగింది. మేము ఏ పార్టీకీ అనుకూలం కాదు. మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. వాటి పరిష్కారం కోసం నేటి నుంచి ఉద్యమబాట పడుతున్నాం. మంగళవారం నుంచి 16 లక్షల మంది ఉద్యోగులు నిరసన చేపట్టనున్నారు. 7, 8, 9 తేదీల్లో నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతారు. 10న భోజన విరామ సమయంలో నిరసన చేపడతాం. 13న మండల కేంద్రాల్లో నిరసనలు చేపడతాం.  16న మండలాలు, జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేస్తాం. 21న జిల్లా కేంద్రంలో ధర్నా, సమావేశం నిర్వహిస్తాం. తర్వాత తిరుపతి, వైజాగ్‌, గుంటూరు ప్రాంతాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తా’మని తెలిపారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్‌ ముందుగా స్పందించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. సమావేశంలో ఏపీఎస్‌ఆర్టీసీ ఎన్‌ఎంయూ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి వైవీఆర్‌ కృష్ణారావు, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు భానుమూర్తి, ఏపీ రెవెన్యూ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్‌ కృష్ణమూర్తి, రెవెన్యూ సర్వీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేణుగోపాల్‌, జిల్లా జేఏసీ చైర్మన్‌ హనుమంతు సాయిరాం, చౌదరి రవీంద్ర, డీవీ రమణ, చల్లా శ్రీనివాసరావు, శశి భూషణరావు  పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-07T04:59:18+05:30 IST