రైతుకు భరోసా ఇవ్వడంలో సీఎం విఫలం

ABN , First Publish Date - 2020-09-18T05:30:00+05:30 IST

రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు పంట పొలాలు నీట మునిగి రైతులు లబోదిబోమంటున్నా వారికి భరోసా ఇవ్వడంలో ముఖ్యమంత్రి వై ఎస్‌ జగన్మోహన్‌రెడ్డి

రైతుకు భరోసా ఇవ్వడంలో సీఎం విఫలం

 నీట మునిగిన పంటలను పరిశీలించిన మాజీ మంత్రి కాలవ



బొమ్మనహాళ్‌, సెప్టెంబరు 18 : రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు పంట పొలాలు  నీట మునిగి రైతులు లబోదిబోమంటున్నా వారికి భరోసా ఇవ్వడంలో ముఖ్యమంత్రి వై ఎస్‌ జగన్మోహన్‌రెడ్డి విఫలమయ్యారని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు. గత నాలుగైదు రోజులుగా కురిసిన వర్షానికి మండలంలోని గోవిందవాడ, దర్గాహోన్నూరు గ్రామాలలో నీటమునిగిన వేరుశనగ, మొక్కజొన్న, పత్తి, మిర్చి పంటలను ఆయన శుక్రవారం పరిశీలించారు. 


ఎకరాకు రూ. 30 వేల వరకు పెట్టుబడి పెట్టామని, చేతికందే సమయంలో వేరుశనగ పంట పూర్తిగా దెబ్బతిందని బాధిత రైతులు తిప్పేస్వామి, లక్ష్మీ, వన్నూర తదితర రైతులు మాజీ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఇంతగా నష్టపోయిన  ప్రభుత్వ ప్రజాప్రతినిధులుగానీ, అధికారులు గానీ వచ్చి పంటలను పరిశీలించి సహాయం అందించలేదని బాధిత రైతులు ఆయన ముందుకు ఆవేదన వ్యక్తం చేశారు.


నష్టపోయిన రైతులకు సహాయం అందేలా తెలుగుదేశం పార్టీ తరఫున కలెక్టర్‌ దృష్టికి తీసుకెళతామని భరోసా ఇచ్చారు. అనంతరం  కాలవ మాట్లాడుతూ  బొమ్మనహాళ్‌ మండలంలో  దాదాపు 300 ఎకరాలకు పైగా వేరుశనగ, పత్తి, మిరప తదితర పంటలు నష్టపోయాయన్నారు. వేరుశనగకు ఎకరాకు రూ. 25 వేలు, పత్తికి ఎకరాకు రూ. 30 వేలు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.  అధికారులు, ప్రజాప్రతినిధులు జరిగిన నష్టాన్ని గుర్తించకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు.


కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొత్తపల్లి మల్లికార్జున, కుమ్మరి మల్లికార్జున, కేశవరెడ్డి, ఎస్‌పీ నాగరాజు, కేశప్ప, కొత్తపల్లి మహేంద్ర, శీన, తిమ్మరాజు, తిప్పేస్వామి, సోమనాథ్‌, మల్లి, టంకశాల హనుమంతు, హనుమంతరెడ్డి, ఎల్‌బీ నగర్‌ మోహన్‌, గాలి బసప్ప పాల్గొన్నారు

Updated Date - 2020-09-18T05:30:00+05:30 IST