కాలువ పూడ్చేసి.. పంట ముంచేసి!

ABN , First Publish Date - 2022-08-07T05:09:16+05:30 IST

ధర్మవరం పంచాయతీ పరిధిలో ఉన్న క్వారీల నుంచి పెద్దఎత్తున రాయిపిక్క, బుగ్గిని తరలించేందుకు గ్రామంలోని నల్లచెరువు గట్టును ఆనుకుని ఉన్న కాలువను పూడ్చేశారని ధర్మవరం రైతులు విలేకరుల వద్ద ఆవేదన వెళ్లగక్కారు.

కాలువ పూడ్చేసి.. పంట ముంచేసి!
మునిగిన వరి పంటను చూపుతున్న రైతులు


ప్రశ్నిస్తే వైసీపీ నేత పేరుతో బెదిరింపులు
ఆవేదన వ్యక్తం చేసిన ధర్మవరం రైతులు

శృంగవరపుకోట రూరల్‌, ఆగస్టు 6 :
ధర్మవరం పంచాయతీ పరిధిలో ఉన్న క్వారీల నుంచి పెద్దఎత్తున రాయిపిక్క, బుగ్గిని తరలించేందుకు గ్రామంలోని నల్లచెరువు గట్టును ఆనుకుని ఉన్న కాలువను పూడ్చేశారని ధర్మవరం రైతులు విలేకరుల వద్ద ఆవేదన వెళ్లగక్కారు. వారి తీరు వల్ల 15 ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకంగా మిగిలిందని వాపోయారు. క్షేత్రస్థాయిలో తాము ఎదుర్కొంటున్న కష్టాలను శనివారం స్వయంగా చూపించారు.
ధర్మవరం కోమటిచెరువు కింద 15 ఎకరాల్లో స్థానిక రైతులు సాగు చేస్తున్నారు. ఇటీవల వర్షాలకు కోమటిచెరువులో భారీగా నీరు చేరింది. సాధారణంగా ఈ చెరువులో అదనంగా చేరే నీరు వీరి పొలాల మీదుగా జాగరం-అలుగుబిల్లి కాలువలోకి వెళ్తుంటుంది. నేడు ఆ పరిస్థితి లేదు. కాలువను కప్పేయడంతో నీరంతా పంటపొలాల్లో ఉండిపోతోంది. జాతీయ రహదారి పనుల కోసం సమీపంలో క్వారీలను లీజులకు తీసుకున్నారని, నిత్యం లారీల్లో పిక్క, బుగ్గి తరలిస్తున్నారని, చెరువుగట్టును పూర్తిగా ఆక్రమించి రోడ్డుగా మార్చేయడంతో పాటు మిగులు జలాలు పోయే కాల్వను కప్పేశారనేది రైతుల ఆవేదన. వీరి పంట పొలాలు రెండురోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి నీటమునిగాయి. వరినారు బయటకు కనిపించడం లేదు. ఆ బాధతో క్వారీకి వెళ్తున్న లారీని అడ్డుకుంటుండగా ఎవరెవరో వ్యక్తులు వచ్చి రైతులను బెదరిస్తున్నారు. ఇటీవల ఓ ప్రజాప్రతినిధి వచ్చి జిల్లా కేంద్రంలో ఉండే ఓ పెద్ద వ్యక్తిని కలవాల్సి ఉంటుందని బెదిరించినట్లు రైతులు వాపోయారు. తమకు న్యాయం చేయాల్సిన ప్రజాప్రతినిధులు పార్టీలో వున్న పెద్దపెద్ద వ్యక్తుల పేర్లతో బ్లాక్‌మెయిల్‌ చేసి క్వారీల వారికి లబ్ధిచేకూర్చాలని చూడటం దుర్మార్గమన్నారు. తమకు జరిగిన అన్యాయంపై కలెక్టర్‌ను కలిసి న్యాయం చేయాలని కోరుతామని తెలిపారు. చెరువు గట్లు రూపురేఖలు మార్చేస్తున్న ఇరిగేషన్‌ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. విలేకరులతో మాట్లాడిన వారిలో రైతులు పెంట సత్యారావు, పెంట సన్యాసప్పడు, చప్ప మహేష్‌, లగుడు అవతారం, చప్ప దేముడు, చప్ప సూర్యనారాయణ, పెంట రాంబాబు, పెంట సంతోష్‌కుమార్‌, లగుడు బైరాగి, అల్లు కృష్ణ, జాగరపు అర్జున, చప్ప తవుడు తదితరులు ఉన్నారు.


Updated Date - 2022-08-07T05:09:16+05:30 IST