పోలింగ్‌కు 72 గంటల ముందు ప్రచారం ముగించాలి

ABN , First Publish Date - 2021-10-27T06:03:08+05:30 IST

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 30న జరగనున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు 72 గంటల ముందు ప్రచారం ముగించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

పోలింగ్‌కు 72 గంటల ముందు ప్రచారం ముగించాలి
హుజూరాబాద్‌లో ఆర్‌టీపీసీఆర్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్‌

- జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్‌

కరీంనగర్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 30న జరగనున్న  హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు 72 గంటల ముందు ప్రచారం ముగించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పోలింగ్‌కు 72 గంటల ముందు అనగా ఈ నెల 27న సాయంత్రం 7 నుంచి 30 వరకు నిశబ్ధ కాలం (సైలెన్స్‌ పీరియడ్‌) అని తెలిపారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 సెక్షన్‌ (126) ప్రకారం ఎన్నికల ప్రచారానికి సంబంధించి రాజకీయ పార్టీలు, ప్రజలను ప్రచారానికి సమీకరించరాదని, మీడియా కార్యక్రమాలు నిర్వహించరాదని, ఎన్నికలకు సంబంధించిన ప్రచార సభలు, సమావేశాలు, బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించరాదని తెలిపారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన సినిమాటోగ్రఫీ, టెలివిజన్‌, ప్రచార సామగ్రి ప్రజలకు తెలిపే విధంగా ప్రదర్శించరాదని, మ్యూజికల్‌, వినోద్‌ కార్యక్రమాలు నిర్వహించవద్దని తెలిపారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై రెండు సంవత్సరాల శిక్షణ, ఫైన్‌ లేక రెండూ విధిస్తామని పేర్కొన్నారు. 

పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఉండాలి

హుజూరాబాద్‌ రూరల్‌: హుజూరాబాద్‌ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక సందర్భంగా ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్‌ అన్నారు. మంగళవారం హుజూరాబాద్‌ మండలం సింగాపూర్‌ గ్రామంలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన 17/31, 18/31 పోలింగ్‌ కేంద్రాలను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఈ పోలింగ్‌ కేంద్రాలు ఓటర్లకు అసౌకర్యవంతంగా ఉన్నందున పక్కనే గల భవనంలోకి మార్చాలని అధికారులకు సూచించారు. పోలింగ్‌ రోజు ఓటర్ల రద్దీని నివారించేందుకు కేంద్రాలను సౌకర్యవంతంగా ఉన్న గదుల్లోకి మార్చాలని సూచించారు. ఓటర్లు ఎండలో నిలబడకుండా ఉండేందుకు షామియానాలు, కర్చీలు వేయించాలన్నారు. కార్యక్రమంలో హుజూరాబాద్‌ రిటర్నింగ్‌ అధికారి సీహెచ్‌ రవిందర్‌రెడ్డి, తహసీల్దార్‌ రాంరెడ్డ్డి, పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారి తదితరులు పాల్గొన్నారు.

కొవిడ్‌ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించాలి

కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించి, సర్టిఫికెట్‌ ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ వైద్య సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం హుజూరాబాద్‌ శాసనసభ నియోజకవర్గం ఎన్నిక సందర్భంగా హుజూరాబాద్‌ ప్రభుత్వ ప్రాంతీయ ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన  ఆర్టీపీసీఆర్‌ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న అభ్యర్థులు మొదటి డోసు, రెండో డోసు తీసుకోనివారు ఆర్టీపీసీఆర్‌ సెంటర్‌లో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకొని తప్పనిసరిగా సర్టిఫికెట్‌ పొందాలన్నారు. నెగిటీవ్‌ సర్టిఫికెట్‌  ఉన్న వారికే పోలింగ్‌, కౌంటింగ్‌ ఏజెంట్లుగా అనుమతిస్తామని స్పష్టం చేశారు.  


Updated Date - 2021-10-27T06:03:08+05:30 IST