వ్యాపారరంగం కుదేలు

ABN , First Publish Date - 2020-07-08T11:15:18+05:30 IST

జిల్లాలో పారిశ్రామిక రంగం చాలా తక్కువ. ప్రభుత్వ ఉద్యోగులు మినహా ఇతర రూపాల్లో కూడా, నెలనెలా కాస్తంత చెప్పుకోదగిన స్థాయిలో

వ్యాపారరంగం కుదేలు

మూడు నెలలుగా ముఖ్యమైనవన్నీ మూతే

బట్టలు, నగలు, చెప్పులు, హోమ్‌నీడ్స్‌ జీరో

నెలనెల రూ.2వేలకోట్ల టర్నోవర్‌కు బ్రేక్‌ 

నిర్వహణ భారంతో వ్యాపారులు విలవిల

లక్ష కుటుంబాలపై ప్రత్యక్ష ప్రభావం

నిత్యావ సర దుకాణాలకు కొద్ది ఊరట


జిల్లాలో వ్యాపార రంగం కోలుకోలేని దెబ్బతింది. కరోనా నివారణ కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ ప్రభావం ఆ రంగంపై తీవ్రంగా పడింది. ముమ్మరంగా వ్యాపారాలు జరిగే వేసవితో పాటు పాఠశాలలు తెరిచే కీలకమైన సమయంలో ఈ పరిస్థితి ఏర్పడటంతో వ్యాపారవర్గాలు లబోదిబోమంటున్నారు. వస్ర్తాలు, నగలు, చెప్పులు, హోమ్‌నీడ్స్‌, బుక్స్‌-స్టేషనరీ వంటి షాపులు, హోటల్స్‌ వంటి వ్యాపారాలు ఎక్కువగా నష్టపోతున్నాయి. నెలనెలా తక్కువగా వేసుకున్నా సగటున రూ.2వేలకోట్ల వ్యాపారం ఈ తరహా  వాటిలో జరుగుతుండగా గడచిన మూడుమాసాలుగా లాక్‌డౌన్‌ ఆంక్షలతో మొత్తం నిలిచిపోయాయి .ప్రత్యక్షంగా లక్ష కుటుంబాలు ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటుండగా వ్యాపారాలు లేకపోయినా దుకాణాల నిర్వహణ కోసం పెద్ద మొత్తంలోనే ఖర్చుచేయక తప్పక వ్యాపారులు మరింత ఇబ్బందులు పడుతున్నారు.


(ఒంగోలు-ఆంధ్రజ్యోతి): జిల్లాలో పారిశ్రామిక రంగం చాలా తక్కువ. ప్రభుత్వ ఉద్యోగులు మినహా ఇతర రూపాల్లో కూడా, నెలనెలా కాస్తంత చెప్పుకోదగిన స్థాయిలో వేతనాలు లభించేవారు తక్కువే. అధికశాతం మంది వ్యవసాయం, అనుబంధ రంగాలపైనే ఆధారపడి ఉండటంతో ఏడాది పొడవునా వ్యాపారాలు సాగే అవకాశం ఉండదు. పంటలు చేతికి వచ్చి వాటి అమ్మకాలు పూర్తయి మార్చి నుంచి జూలై వరకు రైతులకు కాస్తంత చేతిలో డబ్బు అందుబాటులో ఉంటుంది. దీంతో ఆ ఏడాది తమకు వచ్చిన రాబడికి అనుగుణంగా వివిధ రకాల వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. ఇక పాఠశాలల ప్రారంభం, శుభకార్యాలతో నుంచి ఆగస్టు వరకు అన్నివర్గాల వారు అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.


అలా ఏడాదిలో అయిదారు మాసాలు వ్యాపారాలు జోరుగా ఉంటాయి. ఇతర సమయాల్లో చూస్తే వివిధ రకాల పండగలప్పుడు కొంతమేర వ్యాపారం జరుగుతుంది. అలా ఏటా మార్చి నుంచి ఆగస్టు వరకు వ్యాపారులకు కీలకమైన సమయం. ప్రధానంగా ఎక్కువ వ్యాపారం జరిగే వస్ర్తాలు, నగలు, చెప్పులు, పుస్తకాలు, స్టేషనరీ, హామ్‌నీడ్స్‌, ఇతర ఎలకా్ట్ట్రనిక్‌, ఎలక్ట్ర్టికల్‌ వస్తువులు, ఫర్నిచర్‌ వంటివాటి కొనుగోళ్ల ఈ సమయంలో కాస్తంత అధికంగా ఉంటుంటాయి. అందుకే వ్యాపారులు కూడా ఎక్కువ సరుకును ముందుగా తెచ్చి నిల్వ చేసుకుంటుంటారు. ఈ ఏడాది కూడా అలాగే వ్యాపారులు ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. అయితే కరోనాతో వ్యాపారమంతా నిలిచిపోయింది.


మూడు మాసాలుగా..

వ్యాపారాలు కాస్తంత ఊపందుకునే సమయానికి వచ్చిన కరోనాతో వ్యవహారం తల్లకిందులైంది. కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో కేవలం నిత్యావసర వస్తువులు అమ్మే దుకాణాలు, అది కూడా పరిమిత సమయంలో తప్ప ఇతర ఏ వ్యాపారం చేసుకొనే దుకాణాలును తెరిచే అవకాశం లేకుండాపోయింది. అలా ఇప్పటికి మూడుమాసాలు దాటిపోగా మధ్యలో కొద్దిరోజులు సడలింపులు ఇచ్చినా పెద్దగా ఉపకరించలేదు.


వ్యాపారానికి వీలుగా దుకాణాలను సిద్ధం చేసుకొనే లోపుగానే మళ్లీ అధికారులు జిల్లాలోని ముఖ్యమైన నాలుగు పట్టణాలుతో పాటు ఇతర పట్టణాలలోని కంటైన్మెంట్‌ జోన్లలో మరోసారి లాక్‌డౌన్‌ ఆంక్షలను విధించారు. దీంతో కీలకమైన సమయంలో ప్రధానమైన అన్ని వ్యాపారాలు నిలిచిపోరు ఆ రంగంపై ఆధారపడిన వారు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలో అన్నివర్గాల ప్రజలతో సంబంధం ఉండే ప్రధాన వ్యాపారాలను పరిశీలిస్తే అయిదారు రకాలు ఉండగా అవి సాగకే ఈ మూడు మాసాల్లో రూ.6వేలకోట్ల వ్యాపారం నిలిచిపోయినట్లు సమాచారం. 


కష్టంగా మారిన నిర్వహణ

జిల్లాలో నగల దుకాణాలు వెయ్యివరకు ఉండగా సగటున వాటిలో ఈ సీజన్‌లో రోజువారీగా పదికోట్లకు వంతున నెలకు రూ.300కోట్లకుపైగా వ్యాపారం జరుగుతుంది. అలా ఈ మూడు మాసాల్లో ఒక్క నగలు దుకాణాలు సాగకనే రూ.1000 కోట్ల వ్యాపారం ఆగిపోయింది. ఇక మరో ప్రధానమైన వస్త్ర వ్యాపారాన్ని పరిశీలిస్తే చిన బొంబాయిగా పేరున్న చీరాలలో నెలకు సుమారు రూ.250కోట్ల వరకు హాల్‌సేల్‌ వ్యాపారం ఉంటుంది. అలాగే జిల్లావ్యాప్తంగా చిన్నా, పెద్దా వస్త్రదుకాణాలు, రెడీమేడ్‌ దుకాణాలు దాదాపు రెండువేల వరకు ఉండగా సగటున నెలకు రూ.250కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా.


ఈమూడు నెలలో దాదాపు రూ.1500 కోట్ల మేర ఒక్క వస్త్రవ్యాపారమే నిలిచిపోయింది. ఇతరాల్లో ఈసమయంలో హోమ్‌నీడ్స్‌ వ్యాపారం బాగానే సాగుతుంది. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో పెద్దస్థాయి ఇలాంటి దుకాణాలు 150వరకు ఉండగా చిన్నస్థాయివి కూడా కలుపుకొంటే  మెత్తం 500 వరకు ఉండాయి. ప్రస్తుత సమయం ఆ వ్యాపారానికి మంచి సీజన్‌కాగా నెలకు కనీసం రూ.300కోట్ల నుంచి రూ.350కోట్ల వంతున మూడునెలల్లో వెయ్యికోట్ల వ్యాపారాన్ని ఆ వ్యాపారులు కోల్పోయారు. అలాగే జిల్లాలోని 500లకుపైగా ఉన్న చెప్పుల దుకాణాలు సాగక రూ.150కోట్లు వ్యాపారం నిలిచిపోయింది. ఆ దుకాణాలకు ఇదే ప్రధాన సీజన్‌. అలాగే జిల్లా అంతటా వెయ్యి వరకు ఉన్న పెద్ద, మీడియం హోటళ్లు, రెస్టారెంట్లు, లాడ్జిలు అగిపోయి మరో రూ.300 కోట్లకుపైగా వ్యాపారం నిలిచిపోయింది.


ఇలా కీలక వ్యాపారాలు సాగక రూ.4 వేలకోట్లు వరకు వ్యాపారం ఆగిపోయింది.వ్యాపారాలు సాగకపోయినా పెద్దమెత్తంలోనే దుకాణాల నిర్వహణ కోసం ఖర్చుచేయాల్సి వచ్చి యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా ఈ పరిస్థితి వల్ల దుకాణాల యజమానులు, వాటిలో పనిచేసే గుమాస్తాలు, ఇతరత్రా సిబ్బంది కలిపి ప్రత్యక్షంగానే సుమారు లక్ష మంది వరకు ఉండనుండగా కరోనాతో ఆ కుటుంబాల పరిస్థితి గందరగోళంలో పడింది.

Updated Date - 2020-07-08T11:15:18+05:30 IST