Abn logo
Aug 3 2021 @ 22:44PM

మహిళా సంఘాలపై వడ్డీ భారం

మంచిర్యాలలోని జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ కార్యాలయం

 పెండింగ్‌లో మూడు సంవత్సరాల బకాయిలు

వడ్డీలు చెల్లిస్తేనే కొత్త రుణాలంటున్న బ్యాంకర్లు

పాత బకాయిలు తీర్చేందుకు నానాతంటాలు

వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న లబ్ధిదారులు 

మంచిర్యాల, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): నిరుపేద మహిళలకు రుణాలు అందజేయడం ద్వారా ఆర్థిక చేయూతను అందించేందుకు ప్రవేశపెట్టిన ‘వడ్డీలేని రుణాలు’ పథకం జిల్లాలో నీరుగారుతోంది. మూడు సంవత్సరాలకు సంబంధించిన వడ్డీ డబ్బులు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కొత్త రుణాలు కావాలంటే పాత అప్పులు వడ్డీతో సహా చెల్లించాలని బ్యాంకర్లు స్పష్టం చేస్తుండటంతో అధిక వడ్డీకి అప్పులు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. 

రుణాలు ఎవరికి ఇస్తారు

స్వయం సహాయక సంఘాలు(సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూప్‌)లో సభ్యత్వం ఉన్న మహిళలు వడ్డీలేని రుణాలు పొందేందుకు అర్హులు. గ్రూపులోని మహిళలందరికీ కలిపి బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. రుణం పొందిన సంఘాల సభ్యులు నెలసరి వాయిదాల్లో నిర్ణీత గడువులోగా  తిరిగి చెల్లించాలి. ఇందుకోసం బ్యాంకులు సంఘాల సభ్యుల నుంచి 12.5 శాతం వడ్డీ వసూలు చేస్తాయి. 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైస్‌ రాజశేఖర్‌రెడ్డి పావలా వడ్డీకి రుణాల పేరుతో పథకం ప్రారంభించారు. మహిళలకు ఇచ్చే రుణాల వడ్డీలో 75 శాతం ప్రభుత్వం చెల్లిస్తుండగా, మిగతా 25 శాతాన్ని (పావలా వడ్డీ) సంఘాల సభ్యులు చెల్లించాలి. అయితే పథకంలో మార్పులు చేసిన అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం 2009లో పూర్తి వడ్డీని తామే చెల్లిస్తామని, రుణం పొందిన మహిళలు సులభ వాయిదాల్లో తీసుకున్న మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుందని ‘వడ్డీలేని రుణాల పథకం’గా మార్చింది. అయితే 2014 వరకు బాగానే సాగిన పథకం, ఆ తరువాత ప్రభుత్వం వడ్డీలు చెల్లించకపోవడంతో నీరుగారుతోంది. అప్పటి నుంచి వడ్డీ డబ్బుల భారం మహిళలపై పడుతోంది. 

పేరుకుపోయిన బకాయిలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత జిల్లాలో 2015-16 వరకు మాత్రమే వడ్డీ చెల్లింపులు జరిగాయి. 2015-16 సంవత్సరానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో 9,916 సంఘాలకు వడ్డీ కింద రూ.3 కోట్ల 89 లక్షల 44వేలు చెల్లించాలని నిర్ణయించింది. అయితే వీటిలో 2016 జనవరి  వరకు ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి 8,130 సంఘాలకు రూ.3 కోట్ల 8 లక్షల 30వేలు మాత్రమే విడుదల చేసింది. మిగతా 1,786 సంఘాలకు సంబంధించి ఇంకా రూ.81 లక్షల 14 వేలు చెల్లించాల్సి ఉండగా దాదాపు మూడు సంవత్సరాల తరువాత ప్రభుత్వం అంచెలంచెలుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. అలాగే 2016-17 సంవత్సరానికి సంబంధించి 8,648 సంఘాలకుగాను 9,029 ఖాతాల్లో రూ. 6 కోట్ల 79లక్షల 50వేలు, 2017-18 సంవత్సరానికి సంబంధించి 9085 సంఘాలకుగాను 9676 ఖాతాల్లో రూ. 6కోట్ల 28 లక్షల 76వేల వడ్డీ డబ్బులు మూడేళ్ళ నిరీక్షణ అనంతరం ఇటీవల జమ అయ్యాయి. మిగతా మూడు ఆర్థిక సంవత్సరాలు 2018-19, 2019-20, 2020-21లకు సంబంధించి వడ్డీ డబ్బులు విడుదల చేయకపోవడంతో ఎస్‌హెచ్‌జీ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 

కొత్త రుణాలకు ససేమిరా

వడ్డీ బకాయిలు ఉన్న స్వయం సహాయక సంఘాలకు తిరిగి కొత్త రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ససేమిరా అంటున్నారు. పాత రుణాల వడ్డీలు చెల్లించాలని పట్టుబడుతుండటంతో అప్పు తెచ్చి మరీ చెల్లించాల్సి వస్తుందని పలు సంఘాలకు చెందిన మహిళలు వాపోతున్నారు. తీసుకున్న రుణంతోపాటు నెలసరి వడ్డీ కలిపి చెల్లిస్తుండటంతో అధిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వడ్డీలేని రుణాల పేరిట పథకం ప్రారంభించి, తిరిగి వడ్డీలు వసూలు చేయడం సమంజసంగా లేదని తెలిపారు. రూ.50 వేలు రుణం పొందిన సంఘాల సభ్యులు నెలసరి వాయిదా కింద రూ.2 వేలతోపాటు అదనంగా వడ్డీ కింద మరో రూ. 1000 చెల్లించాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో తమకు 2 పైసల వడ్డీ భారం పడుతోందని వాపోయారు. పేరుకే వడ్డీలేని రుణాలని, వడ్డీ వ్యాపారుల మాదిరిగా వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా వడ్డీ బకాయిలు విడుదల చేయాలని స్వయం సహాయక సంఘాల సభ్యులు కోరుతున్నారు.