నమోదుతోనే సరి.. బోధన ఎలా?

ABN , First Publish Date - 2021-10-10T05:29:48+05:30 IST

విద్యార్థులకు బోధించడం ఉపాధ్యాయుల ప్రధాన విధి. పిల్లలు సక్రమంగా చదువుతున్నారో? లేదో పరిశీలించాలి. వారి సందేహాలను నివృత్తి చేయాలి. కానీ, బోధనేతర పనులతోనే ప్రభుత్వ ఉపాధ్యాయుల సమయం గడిచిపోతోంది. విద్యార్థుల హాజరు తీసుకోవడం, మరుగుదొడ్ల పరిశుభ్రతపై ఫొటోలు తీయడం, మధ్యాహ్న భోజనం చిత్రాలు తీయడం, విద్యాకానుక కిట్ల సమాచారం, పాఠ్యపుస్తకాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు కోసం ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోంది. దీంతో బోధనపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏకోపాధ్యాయుడు ఉన్నచోట మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

నమోదుతోనే సరి.. బోధన ఎలా?
కవిటిలో యాప్‌లపై ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులు(ఫైల్‌)

- ఉపాధ్యాయులపై యాప్‌ల భారం

- ఆన్‌లైన్‌ వివరాల అప్‌లోడ్‌కు రోజుకు గంటన్నర సమయం

- ఏకోపాధ్యాయ పాఠశాలల్లో మరిన్ని ఇబ్బందులు 

(ఇచ్ఛాపురం) 

విద్యార్థులకు బోధించడం ఉపాధ్యాయుల ప్రధాన విధి. పిల్లలు సక్రమంగా చదువుతున్నారో? లేదో పరిశీలించాలి. వారి సందేహాలను నివృత్తి చేయాలి. కానీ, బోధనేతర పనులతోనే ప్రభుత్వ ఉపాధ్యాయుల సమయం గడిచిపోతోంది. విద్యార్థుల హాజరు తీసుకోవడం, మరుగుదొడ్ల పరిశుభ్రతపై ఫొటోలు తీయడం, మధ్యాహ్న భోజనం చిత్రాలు తీయడం, విద్యాకానుక కిట్ల సమాచారం, పాఠ్యపుస్తకాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు కోసం ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోంది. దీంతో బోధనపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏకోపాధ్యాయుడు ఉన్నచోట మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

జిల్లాలో మొత్తం 3,272 ప్రభుత్వ పాఠశాలల్లో 2,95,520 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల హాజరును మొదట రిజిస్టర్‌లో తీసుకున్న తర్వాత దాన్ని యాప్‌లో నమోదు చేస్తున్నారు. అంతర్జాల సదుపాయం బాగున్నచోట తొందరగా ప్రక్రియ పూర్తవుతోంది. నెట్‌వర్క్‌ లేనిచోట 45 నిమిషాల వరకు సమయం పడుతోంది. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే దీనికి అదనం. బడిలో ఒకే పేరుతో నలుగురైదుగురు ఉంటే వీరికి హాజరు వేయడం మరింత కష్టంగా మారుతోంది. యాప్‌లో ఇంటిపేర్లు లేకపోవడంతో పిల్లల ఐడీ నంబరును దగ్గర పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఉన్నత పాఠశాలల్లో ఈ బాధ్యతలను ప్రత్యేకంగా ఒక ఉపాధ్యాయుడికి అప్పగిస్తున్నారు. దీంతో మొదటి పీరియడ్‌ బోధనకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. జిల్లాలో ఏకోపాధ్యాయ పాఠశాలలు సుమారు 85 ఉన్నాయి. ఇలాంటి చోట రెండుసార్లు హాజరుకు సమయం కేటాయిస్తే పాఠాల బోధనకు అంతరాయం ఏర్పడుతోంది. విద్యార్థులు ఒక బడి నుంచి మరో బడికి మారినప్పుడు ఆన్‌లైన్‌లో టీసీల మార్పు జరగడం లేదు. కొత్తగా చేరిన బడిలో విద్యార్థుల హాజరు నమోదు కావడం లేదు. వీరంతా అనధికారికంగానే కొనసాగుతున్నారు.

- ఉపాధ్యాయుడు నిత్యం మరుగుదొడ్ల శుభ్రతకు సంబంధించి 4- 8 చిత్రాలు తీయాల్సి వస్తోంది. నెట్‌వర్క్‌ లేని బడుల్లో 8 చిత్రాలు అప్‌లోడ్‌ చేయడానికి 20-30 నిమిషాలు పడుతోంది. 

- మధ్యాహ్న భోజనానికి సంబంధించిన ఐఎంఎంఎస్‌ యాప్‌లో విద్యార్థుల హాజరు, మెనూ నమోదు చేయాలి. వంట గది, సరుకుల నిల్వగది, వంట పాత్రలు, ఆహార పదార్థాలు, విద్యార్థులు తినే ఫ్లోర్‌ ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేయాలి. ఇందుకు 7-8 చిత్రాలు ప్రతిరోజు తీసి, యాప్‌లో పెట్టాల్సి వస్తోంది. నెట్‌వర్క్‌ సమస్య ఉంటే మరింత సమయం పడుతోంది. భోజన సమయంలో వీటన్నింటినీ తీసి అప్‌లోడ్‌ చేసేందుకు 20 నిమిషాలు పడుతోంది. 

- అలాగే డ్రైరేషన్‌ లెక్కల జాబితా, విద్యాకానుక కిట్లకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రుల బయోమెట్రిక్‌ తీసుకుంటున్నారు. కిట్‌ కింద ఇచ్చే వస్తువుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి వస్తోంది. వీటి నిర్వహణకే సమయం అయిపోతుంది. మరి బోధన ఎలా చేయాలని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 


మంత్రి ఆదేశాలు అమలు చేయాలి

ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ నిర్వహించిన సమావేశంలో ఈ యాప్‌లన్నింటినీ తొలగిస్తామన్నారు. యాప్‌ల సంఖ్య తగ్గిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు అమలు చేయలేదు. నెట్‌వర్క్‌లేని చోట యాప్‌లలో వివరాల నమోదుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

- ఆర్‌వీ అనంతాచార్యులు, ఏపీటీఎఫ్‌ జిల్లా ఉపాఽధ్యక్షులు, ఇచ్ఛాపురం


ఆందోళన వద్దు

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉపాధ్యాయులకు అదనంగా బాధ్యతలు అప్పగించాం. ఉపాధ్యాయులు ఒత్తిడికి లోనవుతున్నామని ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. దసరా తర్వాత ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉపాధ్యాయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

 - పగడాలమ్మ, డిప్యూటీ డీఈవో

Updated Date - 2021-10-10T05:29:48+05:30 IST