ముందుచూపేదీ?

ABN , First Publish Date - 2020-09-21T05:51:44+05:30 IST

వాంకిడి మండలంలో నూతనంగా ఏర్పాటు అయిన నవేగాం గ్రామ పంచాయతీ పరిధిలో వంతెనలు లేక రాక పోకలకు గ్రామస్థులు తీవ్ర

ముందుచూపేదీ?

వంతెనలు లేక గ్రామస్థుల ఇబ్బందులు 

వర్షాకాలంలో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తే రాకపోకలకు ఇక్కట్లు 


అధికారులు ముందుచూపుతో వాగులపై వంతెనల నిర్మాణానికి చర్యలు తీసుకోక పోవడంతో గ్రామస్థులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో వరదనీరు చేరితే వాగులో నుంచి పలు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించాల్సి వస్తోంది. భారీగా ఉప్పొంగి ప్రవహిస్తే రోజుల పాటు సైతం రాకపోకలు నిలిచిపోతున్నాయి. కుమరం భీం జిల్లాలోని వాంకిడి, కెరమెరి మండలాల్లో వాగులపై వంతెనలు లేక పోవడంతో పలు గ్రామాల ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు.


వాంకిడి, సెప్టెంబరు 20: వాంకిడి మండలంలో నూతనంగా ఏర్పాటు అయిన నవేగాం గ్రామ పంచాయతీ పరిధిలో వంతెనలు లేక రాక పోకలకు గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ పంచాయతీ నుంచి మండల కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం ప్రజలు రాక పోకలు సాగిస్తుంటారు. సరైన రహదారి లేక పోవడం, వాగులపై వంతెనలు లేక పోవడంతో రాకపోలకు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని వాగులు దాటి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వాగుపై వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.


వంతెన లేక కష్టాలు

కెరమెరి : మండలంలోని ఆగుర్‌వాడ, నాగల్‌గొంది గ్రామాలకు వెళ్లేదారిలో వాగుపై వంతెన లేక పోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాగల్‌గొంది గ్రామంలో కోలాం, నాయకపొడు గిరిజనులు గత కొన్నేళ్లుగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. గ్రామంలో 200 నివాసాలు ఉన్నాయి. నిత్యం వివిధ పనుల నిమిత్తం, నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం  మండల కేంద్రానికి రాకపోకలు సాగిస్తుంటారు. అటవీ ప్రాంతంలో భారీ వర్షం కురిసినప్పుడల్లా వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గంటల తరబడి వాగు అవతల వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.


గతేడాది వర్షాకాలంలో గ్రామానికి చెందిన విద్యార్థి హట్టి పాఠశాలలో చదువుతూ ఇంటికి చేరుకునే క్రమంలో వాగులో కొట్టుకు పోయాడు. దీంతో అప్పటి నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులకు సమస్యను విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోతుందని గ్రామస్థులు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో గ్రామానికి వచ్చిన ప్రజాప్రతినిధులు వాగుపై వంతెన, ఇళ్లు నిర్మిస్తామని హామీలు ఇస్తున్నా ఆచరణకు నోచుకోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు.

Updated Date - 2020-09-21T05:51:44+05:30 IST