సంద్రంలో పడవ బోల్తా

ABN , First Publish Date - 2022-08-07T05:10:56+05:30 IST

ముక్కాం సమీప సముద్రంలో శనివారం పడవ బోల్తాపడి విశాఖ జిల్లా భీమిలి సమీప చిననాగమయ్యపాలెంకు చెందిన మత్స్యకార యువకుడు ఎర్రిపల్లి ధనరాజు(18) గల్లంతయ్యాడు.

సంద్రంలో పడవ బోల్తా
గల్లంతైన మత్స్యకార యువకుడు ధనరాజు(ఫైల్‌).


మత్స్యకారుడు గల్లంతు
సురక్షితంగా తీరానికి చేరిన ఐదుగురు

భోగాపురం, ఆగస్టు 6:
ముక్కాం సమీప సముద్రంలో శనివారం పడవ బోల్తాపడి విశాఖ జిల్లా భీమిలి సమీప చిననాగమయ్యపాలెంకు చెందిన మత్స్యకార యువకుడు ఎర్రిపల్లి ధనరాజు(18) గల్లంతయ్యాడు. ఆయనతో పాటు వెళ్లిన మిగతా ఐదుగురు క్షేమంగా ఒడ్డుకు చేరారు. ఆ వివరాలిలా ఉన్నాయి.
ఎర్రిపల్లి ధనరాజు కొంతకాలంగా ముక్కాం గ్రామంలోని తాతయ్య ఇంటి వద్ద ఉంటూ సముద్రంపైకి వేటకు వెళ్తున్నాడు. శనివారం మధ్యాహ్నం తీరానికి కొంతదూరంలో చేపలు ఉన్నట్లు మత్స్యకారులకు అంచనాగా తెలియడంతో ధనరాజుతో పాటు ముక్కాం గ్రామానికి చెందిన ఆకలి నరిశింహులు, గనగళ్ల నరిశమ్మ, గుంటు రామన్న, కాలి బుడ్డి, ఆకలి తాతారావులు కలిసి ఒకే పడవపై వేటకు బయలుదేరారు. తీరం దాటి కొద్దిదూరం వెళ్లాక ఉధృతంగా వచ్చిన కెరటాలకు పడవ బోల్తాపడింది. దీంతో ఆరుగురూ సముద్రంలో పడిపోయారు. ఐదుగురు ఈదుకొంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు. ఆకలి తాతారావు కాలికి గాయాలయ్యాయి. కష్టం నుంచి బయటపడాలన్న ఆత్రంలో ఎవరికి వారుగా తీరానికి చేరారు. ఆ తర్వాతే ఎర్రిపల్లి ధనరాజు గల్లంతైనట్లు గుర్తించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో వెతకడానికి సాహసించలేదు. మెరైన్‌, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా తహసీల్దార్‌ కె.శ్రీనివాసరావు, ఎస్‌ఐ యు.మహేష్‌, మెరైన్‌ ఎస్‌ఐ పి.రమేష్‌ తీరానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ముక్కాం చేరుకొని ఘటన గురించి తెలుసుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలోని మత్స్యకారులంతా విచారంలో మునిగారు.



Updated Date - 2022-08-07T05:10:56+05:30 IST