మెట్ట రైతు విలాపం

ABN , First Publish Date - 2021-12-02T05:07:09+05:30 IST

కరువు నేలలో జలసిరులు పొంగడంతో హుస్నాబాద్‌ రైతులు మురిసిపోయారు. సాగునీటికై తపించిన చోట మత్తడి దూకుతున్న చెరువులను చూసి పొంగిపోయారు. మెట్ట పంటలకే ముఖం వాచిపోయినవారు వరి సాగువైపు మళ్లారు. ఖుష్కీ భూములను లక్షల రూపాయలు వెచ్చించి తరి పొలాలుగా మార్చుకున్నారు. ధాన్యం దిగుబడిలో జిల్లాలోనే ముందువరుసలో నిలుస్తున్నారు. కానీ వరి సాగు చేయొద్దని ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో వారి సంబురం మూణ్ణాళ్ల ముచ్చటగానే మారింది. పొలాల్లో గట్లు తొలగించి మళ్లీ మెట్ట చేలుగా మార్చాల్సి వస్తున్నది.

మెట్ట రైతు విలాపం
నారుమడి కోసం దున్నిన పొలం (ఫైల్‌)

మూణ్ణాళ్ల ముచ్చటగా వరిసాగు

 మూడేళ్ల క్రితం వరకు ఇక్కడ ఆరుతడి పంటలే..

 జల సిరులతో వరి వైపు మొగ్గు

 లక్షలు వెచ్చించి భూములను మడులుగా మార్చుకున్న రైతులు 

 ప్రభుత్వ నిర్ణయంతో పెట్టుబడి వృథా

 హుస్నాబాద్‌ డివిజన్‌లో అన్నదాతల ఆక్రందన


కరువు నేలలో జలసిరులు పొంగడంతో హుస్నాబాద్‌ రైతులు మురిసిపోయారు. సాగునీటికై తపించిన చోట మత్తడి దూకుతున్న చెరువులను చూసి పొంగిపోయారు. మెట్ట పంటలకే ముఖం వాచిపోయినవారు వరి సాగువైపు మళ్లారు. ఖుష్కీ భూములను లక్షల రూపాయలు వెచ్చించి తరి పొలాలుగా మార్చుకున్నారు. ధాన్యం దిగుబడిలో జిల్లాలోనే ముందువరుసలో నిలుస్తున్నారు. కానీ వరి సాగు చేయొద్దని ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో వారి సంబురం మూణ్ణాళ్ల ముచ్చటగానే మారింది. పొలాల్లో గట్లు తొలగించి మళ్లీ మెట్ట చేలుగా మార్చాల్సి వస్తున్నది. 


హుస్నాబాద్‌, డిసెంబరు 1: వరుణుడి కరుణపై ఆధారపడి వ్యవసాయం చేసే హుస్నాబాద్‌ ప్రాంత రైతాంగం మెట్ట పంటలే సాగుచేసేవారు. వర్షాభావ పరిస్థితులు, నదులు, ప్రాజెక్టులు లేకపోవడమే ఇందుకు కారణం. పత్తి, మొక్కజొన్న, జొన్న, పెసర, కంది, మిర్చి, వేరుశనగ, బెబ్బర్లు తదితర పంటలను పండించేవారు. అక్కడక్కడ బోర్లు, బావుల దగ్గర మాత్రం పరిమితంగా వరి పండించే వారు. 

హుస్నాబాద్‌ మండలంలోని ధర్మారం, తురకవానికుంట, మహ్మదాపూర్‌ వంటి గ్రామాల్లో మాత్రం కూరగాయలు పండించేవారు. హుస్నాబాద్‌ డివిజన్‌లో 1,60,612 ఎకరాల సాగుభూమి ఉన్నది. 70 వేల ఎకరాల్లో పత్తి, 38 వేల ఎకరాల్లో వరి, మిగిలిన భూమిలో ఇతర పంటలు పండిస్తారు. 2019 నుంచి వర్షాలు పుష్కలంగా కురియడంతో చెరువులు, కుంటల్లో సమృద్ధిగా  నీరు ఉంటున్నది. భూగర్భ జలాలు గణనీయంగా పెరగడంతో బోర్లు, బావుల్లోనూ నీరు పెరిగింది. దీంతో మూడేళ్లుగా వరి సాగు పెరుగుతూ వస్తున్నది. ఈ వర్షాకాలంలో 63,716 ఎకరాల్లో వరి నాట్లు వేశారు. ఈమేరకు పత్తి సాగు తగ్గింది. కేవలం 37,716 ఎకరాల్లో మాత్రమే పత్తి వేశారు. డివిజన్‌లో గత యాసంగిలో 82,500 ఎకరాల్లో పంటలు సాగు చేయగా ఇందులో అత్యధికంగా 75,500 ఎకరాల్లో వరి సాగు చేశారు. కేవలం 7వేల ఎకరాల్లో మాత్రమే ఆరుతడి పంటలు వేశారు. కోతుల బెడదతో ఆరుతడి పంటలు వేయలేమని, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకున్నా వరి సాగు చేస్తామని ఇక్కడి రైతులు పేర్కొంటున్నారు. వేరుశనగ, మొక్కజొన్న, కూరగాయల పంటల వేస్తే కోతులు, ఎలుగుబంట్లు పంటలను నాశనం చేస్తుండటం కూడా వరి వేయడానికి ప్రధాన కారణం.


ఖుష్కీ భూములను తరిగా...


సాగునీరు సమృద్ధిగా ఉండటంతో రైతులు ఆరుతడి పంటలు పండించే ఖుష్కి భూములను రూ. లక్షలు ఖర్చుచేసి తరిగా (వరి పండించే భూములుగా) మార్చుకున్నారు. చేలను చదునుచేసి చెరువు మట్టిని పోయించి మడులుగా మార్చారు. మామిడి తోటలను కొట్టించి వరి పొలాలుగా మార్చారు. ఇందుకోసం రూ. లక్షలు ఖర్చు చేశారు. కానీ యాసంగిలో వరి సాగు వద్దని ప్రభుత్వం నిర్ణయించడంతో రైతుల ఆశలు అడియాసలయ్యాయి. ఈ భూముల్లో ఏ పంటలు వేయాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. చెరువుల్లో పుష్కలంగా నీరున్నా ఆయకట్టు భూముల్లో వరి వయొద్దని చెబుతుండటంతో అన్నదాతలు బావురుమంటున్నారు. ఏ పంట వేయాలో తెలియని సందిగ్ధత నెలకొన్నది. ఏండ్ల నుంచి ఆరుతడి పంటలకే ముఖం వాచిపోయిన స్థితిలో మూడేళ్లుగా వరి పండిస్తున్నామని, ఈ స్థితిలో ప్రభుత్వ నిర్ణయం శరాఘాతంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. 


 

Updated Date - 2021-12-02T05:07:09+05:30 IST