అమ్మఒడి.. అలజడి!

ABN , First Publish Date - 2022-05-25T05:51:52+05:30 IST

అమ్మఒడి పథకం నిధుల మంజూరులో మళ్లీ కోత పడింది. తల్లిదండ్రులకు పిల్లల చదువులు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టింది. పాఠశాలలకు వెళ్లే ఒక్కో విద్యార్థికి రూ.15వేలు చొప్పున ఏటా తల్లుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని ప్రకటించింది. 2019-20 విద్యాసంవత్సరం నుంచే ఈ పథకాన్ని అమలు చేస్తోంది.ఈ ఏడాది సాయం అందించాల్సిన గడువు ఆరు నెలలు పెంచింది. దీనికితోడు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం మరో రూ.వెయ్యి కోత పెట్టి.. రూ.13వేలే జమ చేసేందుకు సిద్ధమవుతోంది.

అమ్మఒడి.. అలజడి!

- మౌలిక సదుపాయాల కోసం మరో రూ.వెయ్యి కోతకు సిద్ధం
- ఆరు నెలలు ఆలస్యంగా సాయం
- అడుగడుగునా నిబంధనల కొర్రీలు
- తగ్గనున్న లబ్ధిదారులు
- ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు
(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి/ ఇచ్ఛాపురం రూరల్‌)

అమ్మఒడి పథకం నిధుల మంజూరులో మళ్లీ కోత పడింది. తల్లిదండ్రులకు పిల్లల చదువులు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టింది. పాఠశాలలకు వెళ్లే ఒక్కో విద్యార్థికి రూ.15వేలు చొప్పున ఏటా తల్లుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని ప్రకటించింది. 2019-20 విద్యాసంవత్సరం నుంచే ఈ పథకాన్ని అమలు చేస్తోంది. తొలి సంవత్సరం రూ.15వేలు చొప్పున జమ చేసింది. రెండో సంవత్సరం మరుగుదొడ్ల నిర్వహణ కోసం రూ.వెయ్యి తగ్గించి రూ.14వేలు అందజేసింది. ఈ ఏడాది సాయం అందించాల్సిన గడువు ఆరు నెలలు పెంచింది. దీనికితోడు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం మరో రూ.వెయ్యి కోత పెట్టి.. రూ.13వేలే జమ చేసేందుకు సిద్ధమవుతోంది. మరిన్ని నిబంధనల కొర్రీలతో ఈ ఏడాది లబ్ధిదారుల సంఖ్య కూడా తగ్గనుంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో అలజడి రేగుతోంది.

తగ్గుతున్న లబ్ధిదారులు :
- జిల్లాలో 2019- 2020లో 2,39,902 మంది విద్యార్థులకు రూ.15 వేలు చొప్పున తల్లుల ఖాతాల్లో రూ.359,85,30,000 జమ చేశారు.
- 2020- 2021లో 2,39,692 మంది విద్యార్థులకు రూ.14 వేలు చొప్పున  రూ.335,56,88,000 అందజేశారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ కోసం ఒక్కో విద్యార్థి వద్ద  రూ.వెయ్యి చొప్పున కోత విధించారు.
- తాజాగా 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి అమ్మఒడి సాయం జనవరిలో కాకుండా జూన్‌కు పొడిగించారు. ఆరు నెలలు ఆలస్యమైనా.. ‘అమ్మఒడి’ నిధులు అందుతున్నాయని తల్లిదండ్రులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కాగా, ఈ ఏడాది పాఠశాలల్లో మౌలిక సదుపాయాల నిర్వహణ కోసం మరో రూ.వెయ్యి కోత వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరోవైపు జిల్లాలో ఈ ఏడాది సుమారు 45వేల మంది విద్యార్థులు ‘అమ్మఒడి’ సాయానికి బదులు ల్యాప్‌టాప్‌లు ఎంపిక చేసుకున్నారు. అమ్మఒడి సాయంలో కోత విధించిన ప్రభుత్వం..  ల్యాప్‌టాప్‌ల విషయంలో ఏ మెలిక పెడుతుందోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

ఇవీ నిబంధనలు :
అమ్మఒడి సాయం మంజూరు విషయంలో ప్రభుత్వం నిబంధనలు మరింత కఠినం చేసింది. మొదటి ఏడాది కన్నా రెండో ఏడాది అమ్మఒడి లబ్ధిదారులు ఎలా పెరిగారంటూ అధికారులు సర్వే చేపట్టారు. సరిహద్దు మండలాల్లో అనర్హులకు ఈ సాయం అందినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది విద్యార్థులకు 75 శాతం హాజరు ఉంటేనే అమ్మఒడి సాయం అందజేయనున్నట్టు ప్రకటించారు. దీనికి తోడు మరిన్ని నిబంధనలు విధించారు.  
- ఎన్‌పీసీఐ (నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా)తో అనుసంధానమైన బ్యాంక్‌ ఖాతాకే ఆర్థిక సాయం జమచేస్తారు.
- బియ్యం కార్డులో తప్పనిసరిగా తల్లి, విద్యార్థి పేర్లు ఉండాలి. లేకుంటే  సాయం అందదు. తల్లిదండ్రులు లేని పిల్లలు సంరక్షకుల పెంపకంలో ఉన్నవారు అనర్హులుగా గుర్తించే ప్రమాదం ఉంది.
- గతేడాది కొవిడ్‌ కారణంగా ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు టీసీలు లేకుండా చేరారు. ఫీజులు ఇవ్వకపోవడంతో ప్రైవేటు యాజమాన్యాలు టీసీలు ఇవ్వడంలేదు. దీంతో వారు చైల్డ్‌ఇన్‌ఫోలో నమోదు కాలేదు. వారికి సాయం అందుతుందో లేదో స్పష్టత లేదు.
- విద్యుత్‌ వినియోగం 300 యూనిట్లు దాటితే సాయం అందదు.
- ఈ నిబంధనల కొర్రీలతో ఈ ఏడాది మూడో విడత అమ్మఒడి సాయం ఎంత మందికి అందుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీనిపై ఉపవిధ్యాశాఖాధికారి కె.వాసుదేవురావుని వివరణ కోరగా అమ్మఒడి సాయం ఎంత మొత్తంలో అందుతుందో వివరాలు ఏవీ ఇంకా రాలేదన్నారు. ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన తరువాతే చెప్పగలమని తెలిపారు.
 

Updated Date - 2022-05-25T05:51:52+05:30 IST